Friday, April 26, 2024

మెట్టా కవిత్వంలో కొత్త ముద్రలు

- Advertisement -
- Advertisement -

నన్ను నేను తెలుసుకున్నాకే/ నాకు జీవితం మొదలయింది/ అది కవిత్వానికి పర్యాయపదమైంది’/ మెట్టా నాగేశ్వరరావు కవిత్వానికి ఆయువుపట్టు అతడి శ్రమలు పండిన జీవితమే. పేదరికాన్ని దుఃఖంగా, ఎవరెవరో వచ్చి సానుభూతిని చూపాలన్నట్టు భావించడు. పేదరికమే జీవితాన్ని ఉన్నతీకరిస్తుందంటాడు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని కవిత్వమే సమకూర్చుతుందంటాడు. అందుకే నిత్యకవితావ్రతుడు మెట్టా. కవిత రాయని రోజు ముద్దముట్టనట్టు, గాలాడనట్టు వుంటుందంటాడు. రోజూ రాస్తాడనే అపవాదు అతడిపైకి వినిపిస్తున్నా,ఖాతరుజేయడు. రాస్తూ రాస్తూనే వుంటాడు. కవిత్వపు విలువల్ని పల్చబడనీకుండా సీరియస్ ప్రపంచాన్నే చిత్రిస్తుంటాడు. కొన్ని కవితల ద్వారా అతడి లేఖినీ ముద్రల్ని పరిశీలిద్దాం. సముద్రుడు అనే కవిత రాసాడు. చాలామంది ఇదివరలో రాసిన వస్తువే.

మరి మెట్టా కొత్తగా ఎలా రాసాడో చదవండి../ ‘సముద్రుడు ఉప్పుకుబేరుడు/ నదులకు అయస్కాంతం/ వెన్నెలకు వాత్సల్యం/ ముత్యాలకార్ఖానా/ తిమింగలాలకు ఆయుదాత/ ఖండాల మధ్య వారధి నిర్మాత/ ఒకే ఒక్క బాహుబలి/ సముద్రుడికి సూర్యుడు/ తళుకునగల్ని తయారుజేసే/ స్వర్ణకారుడు/ దేవతల్ని అమరుల్ని జేసినవాడు/ సముద్రుడు’ / ఇలా సంక్షిప్తతాశిల్పంతో సముద్రాన్ని గమ్మతిగా వర్ణనలు బట్టాడు. ప్రతీపదచిత్రమూ నవనవోపేతంగా రచించాడు. కవితంతా ఉటకించాల్సిన పదాలను రాయడం ఈ కవితలో విశేషం.
‘పెద్దదీపం ఆరిపోతే‘ ఖండికలో తండ్రి మరణం తాలూకా వాతావరణాన్ని ప్రతిబింబించాడు./ ‘పెద్దదీపం తలదాపున/ నివాళిప్రమిదలో/ దుఃఖపునూనె వెలిగితే/ ఇల్లు యిల్లంతా/ అమాసచీకటి కమ్ముతుంది/ ఆ పెద్దబొంది/ నేలకడుపులోకి దిగితే/ చంద్రబింబంలాంటి ఆమెముఖం/ దిగులుమబ్బుల్లో మునుగుతుంది/ పస్తులతో పిల్లలపొట్టలు/ లోయల్లోకి జారతాయి’/ నాన్న చావుని మెటాఫర్ భాషతో కదిలించేలా రాస్తాడు.

నివాళిప్రమిద, దుఃఖపునూనె, ఇటుకలతట్టలో శ్వాసని మోయడం, ఆటంకపుపెట్టెలో దిద్దే దిద్దే పలకల్ని దాయడం ఎన్నో నూతన పదాలను వాక్యాలకు పొదిగే ప్రతిభ మెట్టాకుంది.
‘మనిషి సిగ్నల్ దొర్కుతలేదు‘ అనేది తాజా వస్తువు. సమకాలిక యాంత్రికతా వైపరీత్యాలకు అద్దంపట్టిన కవిత. / ‘అంతా నెట్టుమయం/ జగమంతా సెల్లుమయం/ నెట్టుమాటున/ ఛాటింగుల డేటింగులు జేస్తూ/ కన్నపేగుల్ని వంచించే/ ఖతర్నాకులు యవ్వనపోరగాళ్లు/ చెవులు బ్లూటూత్ లాగా/ రెండుకళ్లూ సెల్లు స్క్రీనుగా మారాక/ భిక్షాపాత్ర అరచి అరచి/ ఆకలినెప్పి పాదాలతో/ ముందు యింటికి ఆశలడుగులేస్తుంటది’
ఈ కవితలో నెట్టుమాటు పదాన్ని చాటుమాటు పదానికి అనుకరణ. అంతా సెల్లుమయం అన్నది అంతా రామమయం అన్న పదానికి అనుకరణ.నట్టింటి అన్నదానికి నెట్టింటి అనుకరణ. మెట్టాలో విరివిగా అనాలజీ టెక్నికు కనిపిస్తుంది. ఇంకా ఫ్రీఫైర్ పబ్జీలు ఆడే పోరళ్ల ముఖాల్లోనివి ‘కసికవళికలు‘ అన్నాడు.

ఇంకా ప్రాసశిల్పం (శబ్దరమ్యత) మెట్టాలో పిలిస్తే పలుకుతానంటది./ ‘ఈజీ మనీ క్రేజీమనీ కాదు’/ ‘చుట్టాలొచ్చి చుట్టూ మూగినా’/ ‘రమ్మీలాడి రమ్ములు తాగి అదే మగదమ్మని వాగే నిషాజీవులు’/ ఎత్తిరాయాలే గానీ చాలాపంక్తులకు ప్రాసలపండువు జేస్తాడు. రమ్మీ రమ్ము మగదమ్ము లాంటి పదాల్లో ద్విత్వ మకారాన్ని ప్రయోగించడంలో నన్నయ ‘కమ్మని లతాంతమ్ములకుమ్మొనసి వచ్చు మధుపమ్ముల‘ వంటి సీస పద్యాలు పూనుంటాయి మెట్టానీ! అనంతశ్రమ’లో అమ్మ చాకిరేవు శ్రమను కవిత్వంతో అభిషేకించాడు./ ‘పొయ్యూదిన శబ్దం/ మావూరిలో తొలి అలికిడి/ బియ్యం చెరిగిన సంగీతం/ కోడిపుంజుకి అలారం’/నెత్తిమీద సూర్యుడు/ పొయ్యిలా భగభగా మండుతున్నా/ ఐదుగూనల బట్టలుదికి/ ఐదువేళ్లకూ బువ్వగుప్పుడయ్యేదీ/ అమ్మచేతి బాదుడికి/ ఆనందపడ్డ బట్టల కమ్మదనం/ మల్లెపూల గుబాళింపునీ మించిపోయేవీ’/ పై పాదాలను గమనిస్తే ఎండతీవ్రతను నెత్తిమీద పొయ్యిలా మండే సూర్యుడనడం అందమైన రూపకం.

అమ్మ వుతికిన బట్టలు మల్లెపూల గుబాళింపుని మించిపోయాయి అన్నది వృత్తిపని నైపుణ్యాన్ని చెప్పే అతిశయోక్తి. మెట్టా ఏది రాసిన కొత్తరంగులు పూసుకున్న కవిత్వమవుతుంది./ ‘చెట్టయి మొలకెత్తితే..’ ఖండికలో మనుషులకూ తరువు గుణాలకూ పోలిక పెడుతూ మాట్లాడిన వైనం చక్కగుంది./ ‘పిట్టలు విడిపోవు/ రాలేక్షణం వరకూ/ ఆకులన్నీ కలిసుంటాయి/ కుదుర్లు ఎడంగా వున్నా/ మూపులు రాసుకుంటాయి చెట్లు/ మనుషులే కోపఖడ్గంతో/ ఎడబాటుని గీసుకుంటారు/ చెట్టు కొమ్మల్లోని/ ఏ ఒక్క ఆకుకీ కోరికలుండవు/ కేవలం చెట్టులా మొలకెత్తు చాలు/ నీ ఒంటిలోని/ మట్టిరేణువులన్నీ పరిమళిస్తాయి’/ అలతి అలతి పదాలతో తాత్వికతను ఒడుపుగా రాయగలడు మెట్టా. చెట్టులో ఏ ఆకుకీ కోరికలుండవు. రెండోపార్శ్వం చెప్పనక్కరలేదు మనిషే అనంతకోరికల పుట్ట అని బోధపడినట్టే! మరోచోట… రావిచెట్టునిలా ఎత్తుకుంటాడు../ ‘గోదారిని పీల్చుకుని/ ఆకాశంలా విస్తరించింది రావిచెట్టు/ సూర్యుణ్ణి తినేసీ/ పచ్చని సముద్రమవుతుంది’/ పై స్టాంజాలో సైన్సుశిల్పాన్ని భలే అన్వయించాడు.

మెట్టాకు కూడా కవిత్వ శిల్పరహస్యం తెలుసు./ ప్రేమాక్షరాలు అనేకవితను చూస్తే…/ ‘దేహాలజిగి వ్యామోహమైతే/ వేడి చల్లారాక/ ప్రేమకాడి వదిలేస్తారు/ మనిషి ఇచ్ఛలను దాటి/ ఇష్టపడ్డమే మచ్చలేని ప్రేమ/ అది దేవతలైనా మెచ్చే ప్రేమ/ ప్రేమించినోడెవడైనా/ ప్రాణం తుంచి యిస్తాడు/ అమ్మచనుబాలను/ రక్తంగా మార్చుకున్నోడు/ ఎవడి రక్తాన్నీ కళ్లజూడడు’/ ఏ అంశమైనా కవితగా మలచగల కళత్వం మెట్టాలో మెండు. సమాజాన్ని తట్టిలేపే పాదాలను ఇట్టే ఇట్టే చెప్పేస్తాడు. తాత్వికచరణాలను కూడా పాదసారంగా బిగువుగా కూర్పు చేయడంలోనూ మెట్టా నేర్పరి./ ‘నేను అహాన్ని కాదు/ వ్యామోహాన్నీ కాదు/ దాహాతిశయాన్ని/ మనిషి మనిషిపై వున్న/ మక్కువదాహమది/ ఏ మనిషినైనా / అంతరాలపొడ లేకుండా/ సరాసరి /హృదయంలోకి గుటకేస్తాను/ నా కళ్లనెపుడూ/ ఎవరి కలిమివైపూ/ అసూయరెప్పలుగా తెరవనివ్వలేదు/ గంజిలో ఉల్లిముక్క నంజుకుని/ స్వర్గాన్ని చప్పరించగలను’/ అనేక నేనుల్లోకి కవిత మెట్టా వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించింది.

జీవితం పట్ల సరైన ఎరుకని రేపే కవిత్వాన్ని రేపూమాపూ కునుకు త్యజించైనా సాధన చేస్తుంటాడు. ఏ కవిత రాసినా తనదైనా ముద్రలుంటాయి. ఆలంకారికంగా ఉపమలు, మెటాఫర్లు, విరోధాభాసలు, ఫెర్సానిఫికేషన్లు,అతిశయోక్తులు, ఇమేజరీలను దట్టంగానూ మోహరిస్తాడు.అలాగే నిరలంకారికంగానూ తేజరింపజేస్తాడు కవితల్ని.మెట్టా సంతకం చేసిన పాదాలు చదివిన, పాఠకలోకం తప్పకుండా సంతసిస్తుంది.

యం.ప్రసాదరావు
                                                                                              మెట్టప్రాంత సాహితీసంగమం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News