Wednesday, May 8, 2024

అమరుల నిత్యస్మరణకే..అమర జ్యోతి

- Advertisement -
- Advertisement -

మన అమరులను నిత్యం స్మరించుకునేందుకే అమరజ్యోతిని నిర్మించుకున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నా రు. ఈ జ్యోతిని మన గుండెల్లో నిలిచే విధంగా, అమరుల పేరు ఎప్పుడూ మన మదిలో ఉండేలా చేశామన్నారు. మొత్తం అమరవీరుల ఫొటోలను ఇక్కడ ప్రదర్శిస్తామని కెసిఆర్ తెలిపారు. ట్యాంక్‌బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ ప్రసంగించారు. ముందుగా జై తెలంగాణ.. తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ కెసిఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

ఈ రోజు రెండు పార్శ్వాలు కలగలిసి ఉన్నాయి. నిన్నటి దాకా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సంతోషంగా జరుపుకున్నామని, ముగింపు సందర్భంలో ఘనంగా తెలంగాణ అమరులకు నివాళులర్పించాలని నిర్ణయించామని కెసిఆర్ తెలిపారు. దాంతోనే అమర జ్యోతి ప్రారంభం చివరిదశలో పెట్టుకున్నామని, మీరందరూ వచ్చి చేతుల్లో దీపాలు చేతబూని అమరలకు అర్థవంతమైన రీతిలో అంజలి ఘటించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కెసిఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని, ఈ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలని ఆయన తెలిపారు.
సంతోషం ఒక పాలు.. విషాదం రెండు పాళ్లు..
ఈ సందర్భంలో సంతోషం ఒక పాలు అయితే.. విషాదం రెండు పాళ్లుగా ఉందని సిఎం పేర్కొన్నారు. కానీ, ఈ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దదని, రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలోనే అనేక కుట్రకోణాలు దాగి ఉండడంతో, అమాయకులైన ఆనాటి రాజకీయ నాయకులు, ప్రజలు ఏదో మంచి జరుగుతుందన్న ఆశతో బలైపోయారన్నారు. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలయ్యాయన్నారు మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లందులో ఓ ఉద్యమ పొలికేక రావడం, అక్కడి నుంచి 1965, 1966 నుంచి మొదలుకొని 1967 నాటికి యూనివర్సిటీలకు చేరుకుందన్నారు. చాలా ధైర్యంగా 58 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టిఎన్జీఓలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ఉద్యమంలో ఆసాంతం పాల్గొన్నారన్నారు. ఎన్నో రకాల కేసులు, వేధింపులు, భయంకరమైన పడి యాక్టులు, ఉద్యోగుల బర్తరఫ్‌లు అనుభవించిన బాధలే ఈ రోజు తెలంగాణ అని ఆయన తెలిపారు. ఆనాటి టిఎన్జీఓ నేత ఆమోస్‌ను వీసా యాక్ట్ కింద పెట్టి ఉద్యోగాల్లో తీసేశారని కెసిఆర్ గుర్తు చేశారు.
విద్యార్థుల ఉద్యమం అద్భుతం..
ఆనాటి నుంచి నేటి వరకు కూడా మన విద్యార్థి శ్రేణులు చాలా అద్భుతంగా మందుకు వచ్చి పోరాటం చేశారని కెసిఆర్ ప్రశంసించారు. ఉద్యమం ప్రారంభించిన మొదట్లో వి.ప్రకాశ్, మధుసూదనాచారి లాంటి పిడికెడు మందితో మేధోమదనం చేశామని కెసిఆర్ తెలిపారు. ఈ సారి రాష్ట్రం సాధించి తీరాలన్న ఉద్దేశంతో అనేక మంది వ్యక్తులను కలిశామన్నారు. ఒక వ్యూహాం రచించుకొని బయల్దేరామని, ఆ బయల్దేరే సందర్భంలో ప్రొఫెసర్ జయశంకర్‌ను కలిశామని కెసిఆర్ పేర్కొన్నారు. ఆయన ఆజన్మ తెలంగాణవాది అని, కానీ, ఆయనకు రెండు సిద్ధాంతాలు బలంగా ఉండేవని కెసిఆర్ తెలిపారు. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన కాగా, రెండోది శనివారం పూర్తిగా నిరాహారంగా ఉపవాసం ఉండేవారని కెసిఆర్ పేర్కొన్నారు.

ఏ ఒక్క సందర్భంలో కూడా జయశంకర్ వెనుకడగు వేయలేదన్నారు. 1969 ఉద్యమం తర్వాత ఏం జరిగిందని జయశంకర్‌ను అడిగామని, కెసిఆర్ లాంటి వ్యక్తి రాకపోతడా అని చెప్పేవారన్నారు. తెలంగాణ ఉద్యమ సోయి బలతికుండాలని ప్రయత్నాలు చేశామని కెసిఆర్ చెప్పారు. లెఫ్ట్ పార్టీలు కూడా ఉద్యమానికి జీవం పోశాయని, ఉద్యమాన్ని సజీవంగా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని కెసిఆర్ తెలిపారు. మలిదశ ఉద్యమంలో అనేక రకాల చర్చలు, వాదోపవాదాలు, హింస, పోలీసు కాల్పులు, ఉద్యమం నీరుగారిపోవడం వంటివి చూశామని కెసిఆర్ గుర్తు చేశారు.
నా మీద జరిగిన దాడి, ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరగలేదు..
తెలంగాణ ఉద్యమంలో భాగంగా నా మీద జరిగిన దాడి.. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండదని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. అయినా ఏనాడూ బాధపడలేదని, మీ తిట్లే దీవెనలు అనుకొని ముందుకు వెళ్లానని కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కెసిఆర్ గుర్తు చేశారు. జలదృశ్యంలో ఉన్న ఆయన ఇంట్లోనే మనం కార్యాలయం ఏర్పాటు చేసుకొని పనులు ప్రారంభించామన్నారు. కర్కశకంగా నాటి ప్రభుత్వం మన ఆఫీసును ధ్వంసం చేసిందని, వస్తువులన్నీ బయట పడేశారని, అదే చోట అమరుల స్థూపం కట్టాలని, వారి ఆత్మ శాంతిస్తదని అదే జలదృశ్యంలో ఇంత చక్కగా అమరజ్యోతిని నిర్మించుకున్నామని కెసిఆర్ వివరించారు.
మహాత్మాగాంధీ స్ఫూర్తితో..
పార్టీ ఏర్పాటు తర్వాత, ఉద్యమంలో చాలా మంది నాతో విబేధించారని కెసిఆర్ తెలిపారు. చాలా గొప్పగా ఉద్యమం చేసి, తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేశామని, తెలంగాణ ప్రజలే మమ్మల్ని కాపాడారని ఆయన తెలిపారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ముందుకు సాగామని, హింస రాకుండా చూశామన్నారు.
కెసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో….
సిద్దిపేటలో ఉద్యోగ గర్జన చేసినప్పుడు నాటి రోశయ్య ప్రభుత్వం హైదరాబాద్ ఫ్రీ జోన్ అని 14 ఎఫ్ తీసుకొస్తే నిరసన వ్యక్తం చేశామని కెసిఆర్ గుర్తు చేశారు. అప్పుడే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రకటన చేశానని ఆయన తెలిపారు. కెసిఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని బయల్దేరానని ఆయన పేర్కొన్నార. నిమ్స్ డాక్టర్లు కూడా తననను బెదిరించారని, శక్తి లేదు, కోమాలోకి వెళ్తే మళ్లీ బయటకు రాలేవని చెప్పారన్నారు. దానిని కూడా తట్టుకోని నిలబడ్డానన్నారు.

విద్యార్థులు, నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే కేంద్రం దిగివచ్చిందని కెసిఆర్ తెలిపారు. లోక్‌సభలో చర్చ జరుగుతుంటే తాను నిమ్స్‌లో ఉండి చూశానని, మొత్తం భారత రాజకీయ వ్యవస్థ అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వచ్చిందని, ఆ తర్వాత దీక్ష విరమించానని కెసిఆర్ తెలిపారు. ఆ తర్వాత కుట్రలు, సమైక్యవాదులు చేశారని, పార్లమెం ట్‌లో కూడా పెప్పర్ స్ప్రేలు చల్లి తెలంగాణ రాకుండా అడ్డుకున్నారని, ఆ విషయాలు మీకందరికీ తెలుసని కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News