Saturday, September 20, 2025

కండువా కప్పితే పార్టీ మారినట్లేనా

- Advertisement -
- Advertisement -

ఇంటికి వచ్చిన వారికి ఏ కండువా కప్పుతామో వారికి
ఎలా తెలుస్తుంది? ఎంఎల్‌ఎలు పార్టీ మారిన
వ్యవహారంపై బిఆర్‌ఎస్ నేతలకే స్పష్టత లేదు పార్టీ
ఫిరాయింపుల నియమాలలోనూ కొరవడిన స్పష్టత
కవిత వ్యవహారం ఆస్తి పంపకాలకు సంబంధించిన
అంశం ఒక్క ఆడబిడ్డపై నలుగురు దాడి చేస్తున్నారు
ఉద్యమం పేరిట కెసిఆర్ కొన్ని వందల మంది పిల్లల
ఉసురు పోసుకున్నారు ఆ ఉసురు ఊరికే పోదు ఒక
సిఎంగానే ఎపి సిఎం చంద్రబాబును కలిశా
అందులో దాపరికం ఏమీ లేదు తుమ్మిడిహట్టి
కోసం మిగులు జలాలు వాడుకుంటాం ఒకే
ఆయకట్టును వివిధ ప్రాజెక్టుల కింద చూపించి కెసిఆర్
అప్పులు తెచ్చారు టెర్రరిస్టులతో చర్చలు జరిపే
కేంద్రం… మావోయిస్టులతోనూ చర్చలు జరపాలి
వారిని చంపితే సమస్యలు పరిష్కారం కావు 30వ తేదీ
లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు
మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌రెడ్డి
రాష్ట్రంలో గోద్రెజ్ రూ.200కోట్ల పెట్టుబడి

మన తెలంగాణ/హైదరాబాద్: కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశంపై భారత రాష్ట్ర సమితి నేతలకే స్పష్టత లేదని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. హరీష్ రావే తమకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో చెప్పారని, ఇది ఆన్‌రికార్డు అని సిఎం రేవంత్ అన్నారు. కెటిఆర్ ఎమ్మెల్యేల గురిం చి ఇంకో సంఖ్య చెబుతున్నారని సిఎం రేవంత్ ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు ఏమీ లేవని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలన్నారు. కండువా వేసుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్టేనానని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల నుం చి రూ.5వేలు బిఆర్‌ఎస్ పార్టీకి వెళుతుందని, నిధులు సైతం ఆ పార్టీకే వెళుతున్నాయని సిఎం రేవంత్ తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్-చాట్ నిర్వహించారు.

ఆడబిడ్డపై నలుగురు దాడి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలు ఉన్నాయని, కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు కలిసి ఒక ఆడపిల్ల (కవిత)పై దాడి చేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నలుగురు కలిసి ఒక మహిళపై దాడి చేస్తున్నారని, దీనిపై మహిళా లోకం స్పందించాలన్నారు. ఇది వారి కుటుంబ సమస్య అని, దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. కెసిఆర్ ఉద్యమం, భావోద్వేగం పేరిట అనేకమంది పిల్లలను పొట్టను పెట్టుకున్నారని, ఆ ఉసురే ఆయనకు తాకిందని, దీంతో కుమార్తె దూరమైందని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. గతంలో తనపై కేసు పెట్టి తన కూతురు పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కవిత కాంగ్రెస్‌లో చేరుతానంటే వ్యతిరేకిస్తామని ఆయన తెలిపారు. బిఆర్‌ఎస్‌ను బిజెపిలోకి విలీనం చేసే ప్రయత్నం చేశారని కెసిఆర్ కుటుంబ సభ్యులే ఆరోపిస్తున్నారని ఆయన అన్నారు.

ఎల్‌అండ్‌టి నిర్ణయాలపై ఆలోచిస్తాం
హైదరాబాద్ మెట్రో రైలుపై ఎల్ అండ్ టి తీసుకునే నిర్ణయాలపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఎల్‌అండ్‌టి తాము చెప్పినట్లు వినాల్సిందే నని, కెసిఆర్‌తో కుమ్ముక్కయితే ఒప్పుకోమని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వానికి ఎల్‌అండ్‌టి సంస్థ వివరణ ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఎల్‌అండ్‌టితో ఒప్పందం చేసుకుంటేనే అనుమతులు ఇస్తామని కేంద్రం చెబుతోందని, కేం ద్రంలో ఉన్న కిషన్‌రెడ్డి ఇలాంటి మెలికలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.
డ్రగ్స్‌ను కంట్రోల్ చేస్తున్నాం
డ్రగ్స్ నియంత్రణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సిఎం తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి డ్రగ్స్‌ను కంట్రోల్ చేస్తున్నామని, తమ ఈగల్ టీం గోవా వెళ్లి డ్రగ్స్‌తో సంబంధం ఉన్నవారిని పట్టుకుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో దొరికిన డ్రగ్స్ తయారీ కంపెనీ గత ప్రభుత్వంలోనే ఏర్పడిందని, కెటిఆర్ బామ్మర్ది ఫాంహౌస్‌లో డ్రగ్స్‌తో దొరికారని, అప్పుడు కెటిఆర్ ఎందుకు స్పందించలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో
ఒక్క మహిళా మంత్రి కూడా లేరు
2014-నుంచి 2019 మధ్య బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని, చట్టసభల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
యూరియా కొరతకు కేంద్రమే కారణం
రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. యూరియా కొరత రాజకీయ సృష్టి అని ఆయన అన్నారు. రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమన్నారు. ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉందని, బిజెపి, బిఆర్‌ఎస్ ఈ విషయంలో రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.

మావోయిస్టులను చంపితే
సమస్య పరిష్కారం కాదు
నక్సలైట్లు లొంగిపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పాలసీలు తీసుకొచ్చాయని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నప్పుడు, నక్సలైట్లతో చర్చలు జరపడానికి ఇబ్బంది ఏమిటనీ సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కొందరు నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని, వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పాలసీ ఉందన్నారు. మావోయిస్టులను చంపితే సమస్య పరిష్కారం కాదని, మనం వారితో చర్చించాలని సిఎం రేవంత్ సూచించారు.
చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు
కెటిఆర్ ఎందుకు మాట్లాడలేదు
లోకేశ్‌ను కెటిఆర్ చీకట్లో ఎందుకు కలిశారో చెప్పాలని సిఎం రేవంత్ డిమాండ్ చేశారు. లోకేష్ తనకు తమ్ముడు లాంటివాడని కెటిఆర్ చెప్పారని, మరి తమ్ముడు లోకేష్ తండ్రిని జైల్లో పెట్టినప్పుడు కెటిఆర్ ఎక్కడ ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబును జైల్లో పెడితే హైదరాబాద్ రోడ్లపైకి జనం వచ్చారని, ఆ జనాన్ని కెటిఆర్ ఎందుకు కొట్టించారని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు. తాను ఒక సిఎంగా ఎపి సిఎం చంద్రబాబును కలిశానని, చంద్రబాబును కలవడంలో ఎలాంటి దాపరికం లేదని రేవంత్ తెలిపారు.

జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీపై
లీగల్ ఒపీనియన్ అందలేదు
జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల విషయమై ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోర్టు తీర్పులపై మాకు ఉండే అధికారాలు పరిమితమని ఆయన తెలిపారు. ఏదైనా చేస్తే మళ్లీ మరో సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. తనకు ఇప్పటివరకు లీగల్ ఒపీనియన్ అందలేదని, లీగల్ ఒపీనియన్ అందగానే అడ్వకేట్ జనరల్‌కు పంపించి అభిప్రాయం తీసుకుంటానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎలా చేయాలి ఏం చేయాలన్నది ఆలోచిస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Also Read: శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటర్ కారిడార్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News