Tuesday, May 28, 2024

మైనార్టీ ఓటర్లపై కాంగ్రెస్ గురి !

- Advertisement -
- Advertisement -

యువత, సీనియర్ నాయకులకు బాధ్యతలు
ముస్లిం మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు

మనతెలంగాణ/హైదరాబాద్: మైనార్టీ ఓటర్‌లపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. పాతబస్తీలో పాగా వేసేలా ఆ పార్టీ వ్యూహాలను రూపొందిస్తోంది. సోనియాగాంధీ చేతుల మీదుగా విడుదల చేసిన 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ముఖ్యంగా పాతబస్తీలోని పేదలకు అందేలా తగిన ప్రణాళికలను కాంగ్రెస్ రూపొందిస్తోంది. ప్రస్తుతం పాతబస్తీలో ఎంఐఎంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల కోసం చేపట్టబోయే పథకాలను గురించి వివరించే ప్రక్రియపై కాంగ్రెస్ దృష్టి సారించింది.

ప్రస్తుతం పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేపై మహిళా ఓటర్లు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టు తమ సర్వేలో వెల్లడికావడంతో దానిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన 6 గ్యారంటీలను పాతబస్తీలోని ప్రతి ఇంట్లోకి చేరేలా మైనార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేస్తోంది. పాతబస్తీలో ప్రతి ఇంటికి తమ పథకాలను, మేనిఫెస్టోను చేర్చేలా చురుకైన మైనార్టీ యువతతో పాటు సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించినట్టుగా తెలిసింది.

85 శాతం మందికి 6 గ్యారంటీలతో లబ్ధి
ముస్లిం వర్గానికి చెందిన 85 శాతం మందికి 6 గ్యారంటీలతో లబ్ధి చేకూరుతుందని మహిళలకు తెలిపేలా స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. మహాలక్ష్మీ పథకంతో పాటు రూ.500లకే గ్యాస్ సిలిండర్, బస్సులో ఫ్రీ ప్రయాణం వంటివి ఆర్థికంగా ఎంతగానో దోహదపడతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పాతబస్తీలో జరిగే బహిరంగ సభల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించేలా ప్రణాళికలను ఆ పార్టీ నాయకులు తయారు చేస్తున్నారు. దీంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంశాన్ని కూడా ముస్లిం మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

రూ.5లక్షలతో ముస్లిం యువతకు భరోసా
వీటితో పాటు యువవికాసం ద్వారా విద్యార్థులకు అందించే రూ.5లక్షలతో ముస్లిం యువతకు భరోసా కలుగుతుందన్న విషయాన్ని కిందిస్థాయిలో తీసుకెళ్లేలా ఈ పార్టీ యోచిస్తోంది. తాము ప్రవేశపెట్టే పథకాలు ప్రతి ఇంటికి చేరాలంటే దానికి సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బిజెపి పార్టీకి సంబంధించి ఎంఐఎం నాయకులు సైలెంట్‌గా ఉండడంతో మైనార్టీ ఓటర్లు ఆగ్రహంతో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సర్వేలో తేలింది. దీనిని ఆసరా చేసుకొని మున్ముందు పక్కాగా పాతబస్తీలో దూసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News