Sunday, April 28, 2024

జగిత్యాల అభివృద్దికి నిరంతర కృషి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జగిత్యాల పట్టణాభివృద్దికి నిరంతర కృషి చేస్తున్నామని, జగిత్యాలను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. రూ. 30 లక్షలతో ఖిల్లా ప్రహారీ గోడ నిర్మాణం, సిసి రోడ్డు, రూ. 30 లక్షలతో బీఫ్ స్లాటర్ హౌజ్‌లో దుకాణాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగిత్యాల పట్టణాభివృద్దికి ఈ తొమ్మిదేళ్లలో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఈ రోజు రూ. 90 లక్షలతో చేపట్టనున్న వివిధ పనులను ప్రారంభించుకున్నామని తెలిపారు.

పట్టణంలో జోన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో నిర్మాణాలు చేపట్టేందుకు మున్సిపల్ నుంచి అనుమతులు రాక, బ్యాంకు రుణాలు అందక, కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పట్టణంలోని 14 జోన్లలో 121 సర్వే నెంబర్లు మార్పు చేయించామన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు, బ్యాంకు రుణాలు అందడంతో పాటు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల రోడ్లు, మురికి కాల్వల సమస్యలు ఉండవవన్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో ఇండోర్ స్టేడియంలో ఉడెన్ షటిల్ కోర్టు ఏర్పాటు చేసుకున్నామని, క్రీడాకారులు ఉపయోగించుకోవాలన్నారు. చారిత్రక కట్టడమైన ఖిల్లా జగిత్యాలకే తలమానికమని, చారిత్రక ఖిల్లాను కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

గత పాలకులు ఖిల్లాను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరడంతో పాటు అంసాఘీక కార్యకలాపాలకు నిలయంగా మారగా, దానిని తెలంగాణ ప్రభుత్వం పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు నిధులు ఖర్చు చేస్తోందన్నారు. ఖిల్లాలో పచ్చదనం, పరిశుభ్రతను పెంపొందించి ఆహ్లాదరకరమైన వాతావరణాన్ని కల్పించామన్నారు. ఖిల్లా ప్రహారీ గోడ నిర్మాణానికి రూ.20 లక్షలు వెచ్చించామన్నారు.
అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తున్న బిఆర్‌ఎస్
బిఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దిని కాంక్షిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ది పథకాలను సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 13వ వార్డుకు చెందిన ఈగల్ యూత్ సభ్యులు జగిత్యాల డీజిల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 60 మంది మైనార్టీ యువకులు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారందరికీ ఎమ్కెల్యే సంజయ్ పార్టీ కండువాలు కప్పి బిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలెకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, రానున్న ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ఘన విజయం సాధించేలా, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ది పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేయాలని, వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు.
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
ముస్లీం, మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. మైనార్టీ పిల్లల కోసం మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం, పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందిస్తోందన్నారు. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందన్నారు.

మైనార్టీల ఆర్థిక స్వావలంబన కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని, త్వరలోనే మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తారన్నారు. పట్టణంలోని అన్ని మజీద్‌లు, షాదీఖానాలు, ఖబరస్తాన్‌ల అభివృద్దికి నిధులు మంజూరు చేశామన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జి.ఆర్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ నరేశ్, డిఇ రాజేశ్వర్, ఎఓ శ్రీనివాస్, అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ఆనందరావు, రాజ్‌కుమార్, రియాజ్ మామా, రజాక్, హనీఫ్, ఫిరోజ్, జావీద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News