ప్రజాపక్షం/పినపాక:మండల పరిధిలోని సింగిరెడ్డిపల్లి పంచాయితీలో గల లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద ఉన్న మోటార్లలోని కాపర్ వైర్‌ను దొంగిలించిన దొంగలను శుక్రవారం సాయంత్రం ఉప్పాక బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా కనబడటంతో సర్కిల్ ఇన్సెక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్ వారిని విచారించి అరెస్టు చేసినట్లు మణుగూరు డిఎస్‌పి రవీందర్‌రెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరందరూ 13 కేసుల్లో నిందితులుగా ఉన్నారని, నాలుగు లక్షల రూపాయల విలువ చేసే 258 కేజీల రాగి వైర్, కియా కార్, స్కూటీ, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి పంట పొలాల్లోని, ప్రశాంతంగా ఉన్న ఏరియాల్లో టాన్సార్మర్లను పగలగొట్టి అందులోని విలువైన రాగి వైరు దొంగలించి ఇతర ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుతుంటారు. గతంలో పినపాక, కరకగూడెం, మణుగూరు, దమ్మపేట, పస్రా, అశ్వాపురం, ములుగు తదితర ప్రాంతాల్లో సైతం దొంగతనాలు చేసినట్లు తెలిపారు.
ఈ కేసులో ప్రధాన నిందితులు 1 కెల్లా ప్రసాద్, 2 మంత్రి దుర్గాప్రసాద్, 3 చింతపల్లి శివ, 4 నల్లగల్ల జగదీష్, 5 కొరగట్టు నాగరాజు అనే నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామన్నారు. పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్న కేసును ఎంతో చాకచక్యంగా చేదించిన ఈ బయ్యారం సిఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ సురేష్, సిబ్బందిని డిఎస్‌పి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ కాపర్ వైర్ దొంగతనాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఎటువంటి సమాచార ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.