Saturday, May 4, 2024

రష్యాలో దినదినం కరోనా విలయం

- Advertisement -
- Advertisement -
Corona cases are increasing in Russia
నెల రోజుల్లో 70 శాతం ఎక్కువైన కేసులు

మాస్కో : రష్యాలో కరోనా కేసులు రోజురోజుకీ అత్యధికంగా పెరుగుతున్నాయి. నెలక్రితం కన్నా కేసులు 70 శాతం ఎక్కువగా నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 19 న 20,174 కేసులు నమోదు కాగా, నేడు ఆదివారం 34,303 కేసులు నమోదయ్యాయని నేషనల్ కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ ఆదివారం వెల్లడించింది. శనివారం మృతుల సంఖ్య రికార్డు స్థాయిలో 1,002 మరణాలు సంభవించగా, ఆదివారం ఆ సంఖ్య కాస్త తగ్గి 999 వరకు మరణాలు నమోదయ్యాయి. అదికారులు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడానికి లాటరీలు, బోనస్‌లు, రాయితీలు ప్రకటించినా వ్యాక్సిన్‌పై సంకోచాలు, అధికారుల్లో సమన్వయం లోపించడం తదితర కారణాల వల్ల వ్యాక్సిన్ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. అయితే ప్రభుత్వం ఈ వారం మొత్తం 146 మిలియన్ జనాభాలో 29 శాతం మంది అంటే దాదాపు 43 మిలియన్ మంది పూర్తిగా టీకా పొందారని వెల్లడించింది.

కరోనా మరణాలు , కేసులు పెరుగుతున్నా మళ్లీ జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీనికి బదులు ఆయా ప్రాంతాల అధికార యంత్రాంగానికి నిబంధనల అమలుకు సంబంధించి పూర్తి అధికారాలను అప్పగించింది. 85 రీజియన్లలో ప్రజలు బహిరంగంగా పెద్ద ఎత్తున గుమికూడడంపై ఆంక్షలు విధించారు. ధియేటర్లు, రెస్టారెంట్లు, ఇతర వేదికలపై పరిమితి విధించారు. అయినా మాస్కో,. సెయింట్‌పీటర్స్ బర్గ్, తదితర నగరాల్లో దైనందిన జీవన వ్యవహారాలు యధాదిధిగా సాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద 7.99 మిలియన్ నిర్ధారణ కేసులు, 2,23,312 మరణాలను టాస్క్‌ఫోర్సు నమోదు చేసింది. ఐరోపా మొత్తం మీద ఇక్కడే మరణాల సంఖ్య ఎక్కువ. ప్రపంచం మొత్తం మీద అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో తరువాత రష్యాయే మరణాల్లో అయిదో దేశంగా ఉందని అధికారిక రికార్డులు చెబుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News