Saturday, May 4, 2024

ఉప్పెనలో ఊరట

- Advertisement -
- Advertisement -

దేశంలో కాస్త తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
24గం.ల్లో 3.23లక్షల పాజిటివ్‌లు, 2771 మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజున 3 లక్షలకుపైగా కేసులు, 2 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి. అయితే, క్రితం రోజు(సోమవారం)తో పోలిస్తే కాస్త తగ్గాయి. మంగళవారం ఉదయం 8 గంటల వరకల్లా 24 గంటల్లో కొవిడ్19 కేసులు 3,23,144, మరణాలు 2771 నమోదయ్యా యి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,76,36,307కు, మొత్తం మరణాల సంఖ్య 1,97,894కి చేరింది. కోలుకున్నవారి సంఖ్య 1,45,56,209కి చేరింది. దీంతో, రికవరీ రేట్ 82.54 శాతంగా, మరణాల రేట్ 1.12 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 28,82,204గా నమోదైంది. మొత్తం కేసుల్లో ఇది 16.34 శాతం అని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. సెకండ్‌వేవ్ ఉధృతికి ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 17న 97.33 శాతంగా నమోదైన రికవరీ రేట్ ఇప్పుడు 82.54 శాతానికి పడిపోయింది. సోమవారం 16,58,700 మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 28,09,79,877కు చేరిందని ఐసిఎంఆర్ తెలిపింది. 24 గంటల్లో దేశంలో 2771 మరణాలు నమోదు కాగా, అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 524, ఢిల్లీలో 380,ఉత్తర్‌ప్రదేశ్‌లో 249, చత్తీస్‌గఢ్‌లో 226, కర్నాటకలో 201, గుజరాత్‌లో 158, జార్ఖండ్‌లో 124 నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం కేసుల్లో మరణాల రేటు 1.12 శాతంగా ఉండడం, 99 శాతం మంది కొవిడ్ నుంచి కోలుకోవడం ఊరట కలిగించేవే. సోమవారం 3.53 లక్షల మందికి కరోనా సోకగా, 2812 మంది మృతి చెందారు. మొత్తం కేసులు కోటి 73 లక్షలు మించగా, 1.95 లక్షల మంది మృతి చెందారు. దీన్ని బట్టి మరణాల సంఖ్య తీసివేయగా, మిగిలిన వారంతా కొవిడ్ నుంచి కోలుకున్నవారే అని చెప్పవచ్చు. ఆస్పత్రిలో చేరిన వారిలో 28 శాతం మందికి మెకానికల్ వెంటిలేషన్ అవసరమౌతోంది. మొదటి దశలో ఇది 37 శాతంగా ఉంది. సోమవారం 2.20 లక్షల మంది కోలుకున్నారు. ప్రపంచ స్థాయిలో పరిశీలిస్తే మనదేశం లోనే ఇంత ఎక్కువగా రికవరీలు ఉన్నాయి.

కరుణాశుక్లా తుదిశ్వాస
మాజీ ప్రధాని, బిజెపి అగ్రనేత అటల్‌బిహారీ వాజ్‌పేయి మేనకోడలు, మాజీ ఎంపి కరుణాశుక్లా(70) కరోనా వల్ల మృతి చెందారని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. కరుణాశుక్లా మరణం పట్ల చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్‌బఘేల్ ప్రగాఢ సంతాపం తెలిపారు. తానొక పెద్ద దిక్కును కోల్పోయానని, ఆమె దీవెనలు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని భూపేశ్ ట్విట్ చేశారు. 2013లో శుక్లా బిజెపిని వీడి కాంగ్రెస్‌లో చేరారు. బిజెపి ఆధిపత్య రాజకీయాల్లో చిక్కుకున్నదంటూ ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ పార్టీని వీడారు.

Corona Cases decreased on Tuesday in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News