Wednesday, May 1, 2024

కరోనా ఉచ్చులో టెన్నిస్ విలవిల..

- Advertisement -
- Advertisement -

Corona impact on world Tennis

 

లండన్: ప్రపంచ టెన్నిస్‌పై కరోనా పిడుగు ప్రభావం గట్టిగానే పడిందని చెప్పాలి. ఈ మహమ్మరి దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి టెన్నిస్ టోర్నీలు అక్కడే నిలిచి పోయాయి.

ప్రతి ఏడాది కోట్లాది మంది అభిమానులను కనువిందు చేసే టెన్నిస్ ఈసారి కరోనా దెబ్బకు కుదేలైంది. దాదాపు అన్ని ప్రధాన టోర్నీలపై కరోనా ప్రభావం పడింది. ఇక, వింబుల్డన్ వంటి మెగా గ్రాండ్‌స్లామ్ టోర్నీని అయితే ఏకంగా రద్దే చేశారు. మరోవైపు ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లు జరుగుతాయా అన్నది అనుమానంగా మారింది. కరోనా వల్ల యూరప్, అమెరికా, ఆసియా దేశాలు అల్లకల్లోలంగా మారాయి.

దీంతో ఇక్కడ జరగాల్సిన అన్ని టోర్నీలను వాయిదా వేయడమే లేకుంటే పూర్తిగా రద్దు చేయడమో జరిగాయి. ప్రతి సంవత్సరం వివిధ దేశాల్లో జరిగే ప్రధాన టెన్నిస్ టోర్నీల్లో దిగ్గజ క్రీడాకారులు పాల్గొనడం అనవాయితీ. కొంతకాలంగా పురుషుల టెన్నిస్‌ను శాసిస్తున్న స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్, మహిళా టెన్నిస్ రారాణి సెరెనా విలియమ్స్‌లకు ఈ ఏడాది ఓ పీడకలగా మారిందనే చెప్పాలి. కెరీర్ చరమాంకంలో ఉన్న వీరికి ఈ సీజన్ ఎంతో కీలకంగా తయారైంది.

ఈసారి కనీసం ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్‌నైనా గెలిచి తమ రికార్డులను మరింత మెరుగు పరుచు కోవాలని భావించిన వీరికి నిరాశే మిగిలింది. ఫెదరర్ ఇప్పటికే పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ గెలిచిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఈసారి ఒకటి రెండు టైటిల్స్ సాధించి తన రికార్డును మరింత పటిష్టం చేసుకోవాలని భావించాడు. కానీ, అతని ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. మరోవైపు మహిళా టెన్నిస్ దిగ్గజం సెరెనాది కూడా ఇలాంటి పరిస్థితే. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న సెరెనా ఈ ఏడాది కనీసం ఒక టైటిల్‌నైనా సాధించాలనే లక్షంతో కనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బాగానే ఆడుతున్నా కేవలం రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది మాత్రం ఎలాగైనా గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే లక్షంతో సీజన్‌కు శ్రీకారం చుట్టింది. అయితే కరోనా వల్ల వింబుల్డన్ వంటి మెగా టోర్నీ పూర్తిగా రద్దయ్యింది. అంతేగాక ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలు జరగడం కూడా ప్రశ్నార్థకంగా తయారైంది.

ఇలాంటి సమయంలో సెరెనా గ్రాండ్‌స్లామ్ కల నెరవేరడం కష్టంగా మారింది. ఇక, స్పెయిన్‌బుల్, టెన్నిస్ రారాజు రఫెల్ నాదల్‌కు కూడా నిరాశ తప్పలేదు. కిందటి ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన నాదల్ ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో కనిపించాడు. తనకు ఎంతో అచ్చివచ్చే ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించి తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను మరింత పెంచుకోవాలని భావించాడు. అయితే ఈసారి టోర్నీ జరగడంపై నీలినీడలు కమ్ముకోవడంతో నాదల్ ఆవేదనకు గురవుతున్నాడు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ కూడా తన జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచి జోరుమీద ఉన్నాడు. అయితే కరోనా వల్ల ఎక్కడి టోర్నీలు అక్కడే నిలిచి పోవడంతో జకోవిచ్‌కు కూడా నిరాశ తప్పలేదు. ఇక, స్టార్ ఆటగాళ్లు సిట్సిపాస్, డొమినిక్ థిమ్, అలెగ్జాండర్ జ్వరేవ్, కచనోవ్, సిమోనా హలెప్, ప్లిస్కోవా, క్విటోవా తదితరులకు కూడా ఈ ఏడాది పెద్ద ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News