Sunday, May 5, 2024

కెపిహెచ్‌బి కాలనీలో ఖరీదైన ఖాళీ భూముల గుర్తింపు

- Advertisement -
- Advertisement -

హౌసింగ్ బోర్డు నుంచి సేకరించిన 33 ఎకరాల భూమి
హెచ్‌ఎండిఏకు అప్పగింత
ఎకరాకు రూ. 50 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా వచ్చే అవకాశం
ఈనెలలో నోటిఫికేషన్ !
పెద్ద సంస్థల ఆసక్తి

Costly land found in KPHB
మనతెలంగాణ/హైదరాబాద్:  కెపిహెచ్‌బి కాలనీలో ఉన్న ఖరీదైన ఖాళీ భూములను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 33 ఎకరాల భూములను ఇటీవలే హౌసింగ్ బోర్డు నుంచి సేకరించిన ప్రభుత్వం అమ్మకానికి నోడల్ ఏజెన్సీగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండిఏ)ను నియమించింది. అందులో భాగంగా హెచ్‌ఎండిఏ అధికారులు సైతం ఆ ప్రదేశాన్ని చదును చేయిస్తున్నారు. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ భూములను హెచ్‌ఎండిఏ, టిఎస్‌ఐఐసి సంస్థల ద్వారా విక్రయించగా భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. కెపిహెచ్‌బి భూముల విషయంలోనూ ఎకరాకు రూ. 50 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ఈ బాధ్యతను హెచ్‌ఎండిఏకు అప్పగించినట్టుగా తెలిసింది.

ఒకచోట 27 ఎకరాలు, మరోచోట 6 ఎకరాలు

పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు 1960లో అప్పటి ఎపి హౌసింగ్ బోర్డు కెపిహెచ్‌బి కాలనీని ఏర్పాటు చేసింది. 1500 ఎకరాల్లో విస్తరించిన ఈ కాలనీ ఆసియాలోకెల్లా అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. 1962 నుంచి -69 మధ్యకాలంలో రైతుల నుంచి భూసేకరణ పూర్తవ్వగా 1985 నుంచి 2005 మధ్యకాలంలో ఫేజ్‌ల వారీగా మొత్తం 15 ఫేజ్‌ల్లో సుమారు 1,400 ఎకరాల్లో ఇళ్లను నిర్మించి, లబ్ధిదారులకు అందజేశారు. ఇవన్నీ పోగా ఈ కాలనీలో ప్రస్తుతం 65 ఎకరాల మేర ఖాళీ స్థలం ఉన్నట్లు అధికారులు తాజాగా నిర్వహించిన సర్వేలో గుర్తించారు. సర్వే నెంబర్ 1,009లో 33 ఎకరాలు పెద్ద బిట్లుగా ఉండగా, ఒకచోట 27 ఎకరాలు, మరోచోట 6 ఎకరాలుగా ఉన్న భూములను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆ భూములను హెచ్‌ఎండిఏ అధికారులు చదును చేయిస్తున్నారు. 100 అడుగుల రహదారులు, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక సదుపాయాలకు నిర్ణీత భూమిని వదిలేసినా మిగతాది అమ్మేయాలని అధికారులు భావిస్తున్నారు.

మరో 32 ఎకరాలు రెండు, మూడు నెలల…

మల్టీప్లెక్స్, మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లకు కెపిహెచ్‌బి నిలయంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం వేలంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటగా 33 ఎకరాలను వేలం వేసిన తరువాత మిగతా 32 ఎకరాలను కూడా హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో రెండు, మూడునెలల తరువాత వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే కెపిహెచ్‌బిలో 33 ఎకరాల వేలంపై ఇప్పటికే పెద్ద సంస్థలు ఆసక్తి చూపుతున్నట్టుగా తెలిసింది. జాతీయ రహదారికి అనుకొని ఉండడంతో పాటు ఐటి సంస్థలకు దగ్గరగా ఉండడంతో ఈ వేలంపై అందరూ ఆసక్తిని చూపుతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ఎకరాకు సుమారుగా రూ.60 కోట్లు వచ్చే అవకాశం ఉందని హెచ్‌ఎండిఏ అధికారులు భావిస్తున్నారు. ఈ వేలం ప్రక్రియకు సంబంధించి ఈనెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News