Saturday, April 27, 2024

ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులపై ప్రత్యేక బెంచ్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేయాల్సి ఉంది. ఇందుకు ప్రత్యేక ధర్మాసనాలను ఏర్నాటు చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ దిశలో రాష్ట్రాల హైకోర్టులు వెంటనే చర్యలు తీసుకుని స్పెషల్ బెంచ్‌ల ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉందని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యపు ధర్మాసనం కీలకమైన తీర్పు వెలువరించింది. చట్టాల రూపకల్పన బాధ్యతల్లో , ప్రజలకు జవాబుదారిలుగా ఉండటం ప్రజా ప్రతినిధుల బాధ్యత. అయితే ప్రజా ప్రతినిధులపై దాదాపుగా 5000కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిని ఫాస్ట్‌కోర్టుల విచారణ ప్రక్రియల తరహాలో పరిష్కరించాల్సి ఉంది. దోషులా? నిర్దోషులా తేల్చాల్సి ఉంది. ఇందుకు రాష్ట్రాల హైకోర్టులు వెంటనే తగు విధంగా బెంచ్‌ల ఏర్పాటుకు దిగాలని ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి కేసులపై ప్రత్యేక పర్యవేక్షణ అత్యవసరం. దీనితోనే ఇవి మూల్గకుండా సెటిల్ అయ్యేందుకు వీలేర్పడుతుందని ధర్మాసనం తెలిపింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాల్సిందే, అత్యంత అరుదైన తప్పనిసరి కారణాలు ఉంటే తప్ప ఇటువంటి క్రిమినల్ కేసులలో విచారణలను వాయిదా వేయడం చేయరాదని స్పష్టం చేశారు.

ప్రజా ప్రతినిధులపై వచ్చే అభియోగాలు తీవ్రమైన విషయాలు. వీటిలోని నిజానిజాలను నిగ్గుతేల్చాల్సి ఉంటుంది.ఇందుకు ఏళ్ల తరబడి వేచిఉండటం , సాచివేతకు దిగడం భావ్యం కాదని, దీని వల్ల చట్టసభలపై ప్రజలకు ఉండే నమ్మకం సన్నగిల్లుతుందని, తాము ఎంచుకున్న వారు చట్టబద్ధులైన వారేనా? దోషులా నిర్దోషులా అనేది వారికి ఎంతకు తెగని అనుమానంగా ఉంటే చేటుకు దారితీస్తుందని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్థివాలా, మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి తీసుకోవల్సిన చర్యలు, మార్గదర్శక సూత్రాల గురించి హైకోర్టులు, జిల్లా కోర్టులు, ఇతరత్రా కోర్టులకు ఆదేశాలు వెలువరించారు. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పెండింగ్‌లో ఉన్న పలు క్రిమినల్ కేసుల పరిష్కారం కీలక ఘట్టం కావల్సి ఉంది. న్యాయస్థానాలు వీటిని ప్రాధాన్యతా క్రమంగా మల్చుకుని తీరాలని ఆదేశించారు. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలితే హైకోర్టులు ఇతర కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు వెంటనే తమంత తాము సూమోటోగా స్పందించవచ్చు.

కేసుల తక్షణ విచారణను ప్రత్యేకంగా ఏర్పాటు అయ్యే కోర్టుల పరిధికి పంపించవచ్చు. దీని వల్ల ఈ క్రిమినల్ కేసుల తక్షణ పరిష్కారానికి దారితీస్తుందని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించి ప్రామాణిక, ఏకీకృత మార్గదర్శకాలను ట్రయల్ కోర్టులకు విధించడం అత్యున్నత న్యాయస్థానానికి వాస్తవికంగా , ప్రాక్టికల్‌గా ఇబ్బంది అవుతుంది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలలోని న్యాయస్థానాలు వెనువెంటనే ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణకు పూర్తి స్థాయి ప్రాధాన్యతను ఇచ్చి, వీటిని నాన్చకుండా విచారించి సంబంధిత ముద్దాయిల సంగతి తేల్చాల్సి ఉంటుంది. లేకపోతే ఇటు న్యాయవ్యవస్థ, అటు లెజిస్లేచర్ వ్యవస్థల పట్ల చివరికి ప్రజాస్వామిక వ్యవస్థల పట్ల కూడా నమ్మకం లేకుండా పోతుందని ధర్మాసనం హెచ్చరించింది. రాజ్యాంగంలోని 227వ అధికరణం పరిధిలో హైకోర్టులకు సంబంధిత విషయంలో పూర్తి అధికారాలు సంక్రమించి ఉన్నాయి. ఈ హైకోర్టులు దిగువ స్థాయి న్యాయస్థానాలలో విచారణలపై పర్యవేక్షణలకు దిగేందుకు వీలుంది.

ఈ క్రమంలో హైకోర్టులు ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను కింది స్థాయిలో మరింతగా వేగిరపర్చేందుకు పరిష్కరించేందుకు సరైన మార్గదర్శకత్వానికి దిగేశక్తివంతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. దేశంలోని ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల పెండింగ్ , ఈ క్రమంలోనే సదరు వ్యక్తులు పలు రకాలుగా అధికార స్థానాలలో ఉండటం వంటి పలు విషయాలపై ఆందోళన వ్యక్తంచేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ చేపట్టింది. అసాధారణ రీతిలో వెంటనే ప్రత్యేక బెంచ్‌ల ఏర్పాటుకు హైకోర్టులకు నిర్థిష్ట ఆదేశాలు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News