Wednesday, May 8, 2024

వార్డుకు 4 కమిటీలు

- Advertisement -
- Advertisement -

 

అధికారులు బృందాలుగా పట్టణ ప్రగతిలో పాల్గొనాలి
ఫిబ్రవరి, మార్చికి జిహెచ్‌ఎంసికి రూ. 156 కోట్లు
మిగతా మున్సిపాలిటీలకు రూ. 140 కోట్లు మంజూరు
పట్టణ ప్రగతిపై సిఎస్ సోమేశ్‌కుమార్ సమీక్షా సమావేశం
మనతెలంగాణ / హైదరాబాద్ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో 15 మంది సభ్యులతో 4 కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి చేస్తున్న ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణ ప్రగతిపై పురపాలక పరిపాలన విభాగం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను మరింత సరళీకరించాలని, అందుకు ప్రత్యేకంగా కొన్ని అంశాలను, విషయాలను తెలిపారు. పట్టణ ప్రగతి సందర్భంగా ప్రతి వార్డు, మున్సిపాలిటీ, అధికారుల వివరాలు వెంటనే సేకరించాలని ఆయన చెప్పారు. వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

ఈ విషయంలో కొన్ని జిల్లాలు వెనుకబడ్డాయని ఆ జిల్లాలో వెంటనే 100 శాతం కమిటీలు ఏర్పాటు చేసి వాటి వివరాలను అప్‌లోడ్ చేయాలని సోమేశ్‌కుమార్ చెప్పారు. పట్టణ ప్రగతిలో పారిశుధ్యం, హరిత హారం, కమ్యూనిటీ టాయిలెట్ల ఏర్పాటు, శ్మశాన వాటికలు, నర్సరీలు, సమీకృత, శాఖహార, మాంసాహార మార్కెట్లు, ఆటల స్థలాలు, పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని అధికారులను ఆదేశించారు. నిరక్షరాస్యుల గుర్తింపు కోసం ప్రత్యేక సర్వే నిర్వహించాలన్నారు. పల్లె ప్రగతి తరహాలోనే నమూనా పత్రం(ప్రొఫార్మా)ను పంపుతామని తెలిపారు. జిహెచ్‌ఎంసి, కంటోన్మెంట్ ప్రాంతాల్లో కూడా సర్వే నిర్వహించాలని చెప్పారు. ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించి జిహెచ్‌ఎంసికి రూ. 156 కోట్లు, మున్సిపాలిటీలకు రూ. 140 కోట్లు 14వ ఆర్థిక సంఘం నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసిందని చెప్పారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణకు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు పూర్తిగా సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, కొన్ని జిల్లాల్లో జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొంటారని సోమేశ్‌కుమార్ వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ లోకేష్‌కుమార్, సిడిఎంఎ సత్యనారాయణ, టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CS Somesh Kumar Review Meeting on Pattana Pragathi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News