Monday, September 22, 2025

మిణుగురులు

- Advertisement -
- Advertisement -

ఇక్కడ.. వెలుగును శాసిస్తుంది చీకటి
మేముండగా మీరెందుకని
దీపాలార్పేస్తాయి మిణుగురులు
చెరపట్టబడి దుర్గంధపూరితమవుతుంది గాలి
నదుల్ని తాగేస్తాయి తిమింగలాలు
పెట్టుబడుల పెనుగాలికి
బంతుల్లా ఎగిరిపోతాయి కొండలు
ఇంకి ఎడారులై పోతాయి సముద్రాలు
కార్చిచ్చు దాహానికి ఆకుల కన్నీళ్లు కారుస్తూ ..
దగ్ధమైపోతాయి అడవులు

మనుషులు కలుషిత కాసారాలైపోతారు
ఆరిపోయిన కుంపట్లవుతారు
పగళ్లుదేరిన పంటపొలాలవుతారు
కన్నీటిచుక్కల్లా రాలిపోతాయి పూలు
పక్కనే సాయుధమై పహారా కాస్తుంది నీడ
గొంతులోంచి మాట పెగలదు
పెదాలకంకుల నుంచి పొల్లుగింజలు
రెక్కపురుగుల్లా ఎగురుతాయి
అనుమానించబడ్డ ఆడకూతురులా
వెలేయబడుతుంది నిజం
కోరలకంటిన నెత్తురు తుడుచుకొనీ
ధర్మసూక్ష్మాలు బోధిస్తాయి
మేకల మందల్ని ఏలుబడిజేస్తూ తోడేళ్లు
చేపల చెరువుకు
కాపలాదారులవుతాయి గూడ కొంగలు
గద్దెమీద ప్రవచనాలిస్తాయి పెద్దపులులు
చాంద్రాయణవ్రతం జేస్తాయి సింహాలు
కన్నీళ్లు కారుస్తూ కర్మసిద్ధాంతం ముందు
తలదించుతాయి లేళ్లు
అబద్దం కాళ్లకింద పచ్చిగా
నలిగిపోతుంది నిజం
అధర్మమే రాజ్యమేలుతుంది
అన్యాయమే తీర్పులిస్తుంది
స్వార్ధం పొగమంచులా కమ్ముకుంటుంది
ఇదంతా జూస్తూ..
ళ్లు మూసుకుంటాడు కొండమీద దేవుడు

Also Read : ట్రంప్ రహస్య లేఖ బట్టబయలు

  • సిరికి స్వామి నాయుడు
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News