Monday, May 6, 2024

ఢిల్లీలో కరోనా విలయం.. వారాంతపు కర్ఫ్యూ విధింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలో కరోనా విలయం … వారాంతపు కర్ఫూ విధింపు
ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోమ్
ప్రైవేట్ సంస్థలు 50 శాతం కెపాసిటీతో పనిచేస్తాయి
మెట్రో, బస్సుల సర్వీసులు వంద శాతంతో నడుస్తాయి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో తాజాగా మరికొన్ని ఆంక్షలను విధించడానికి ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డిడిఎంఎ) ఢిల్లీలో వారాంతపు కర్ఫూ విధించడానికి మంగళవారం నిర్ణయించింది. గత మూడు రోజులుగా అక్కడ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ఎల్లో అలర్ట్‌ను అమలు చేస్తోన్న ఢిల్లీ సర్కారు తాజాగా మరికొన్ని ఆంక్షలను విధించింది. ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకూ వీకెండ్ కర్ఫూ అమలులో ఉంటుంది. ఆన్‌లైన్ పాత్రికేయ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని యోచిస్తున్నట్టు, అత్యవసర సేవల విభాగంలో పనిచేసే ఉద్యోగులు మినహా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం వెసులుబాటు కల్పించే దిశగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని వెల్లడించారు. ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో పనిచేస్తాయని చెప్పారు.

డిసెంబర్ 29నుంచి ఢిల్లీలో ఎల్లో అలర్ట్‌ను అమలు చేస్తున్నారు. స్కూళ్లు కాలేజీలు, సినిమాహాళ్లు, జిమ్ సెంటర్లు మూసివేశారు. దుకాణాలు, మాల్స్‌ను సరిబేసి పద్ధతిలో తెరుచుకునేందుకు అనుమతించారు. మెట్రో, బస్సు సర్వీసులను సగం సామర్ధంతో నడపాలని మొదట ఆదేశించినప్పటికీ మెట్రో, బస్సు స్టేషన్ వద్ద రద్దీ పెరిగి, క్యూలు పెరగడంతో స్టేషన్లు వైరస్ సూపర్ స్ప్రెడర్లుగా మారతాయని ప్రభుత్వం భయపడి బస్సులు, మెట్రోలను వందశాతం సామర్ధంతో నడపాలని నిర్ణయించినట్టు సిసోడియా వెల్లడించారు. అయితే మాస్కులు లేనివారిని అనుమతించరు. ఢిల్లీలో 11,000 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, 350 మంది ఆస్పత్రిలో చేరగా, వారిలో 124 మందికే ఆక్సిజన్ అవసరమైందని, వెంటిలేటర్ సహాయంతో ఏడుగురు చికిత్స పొందుతున్నారని సిసోడియా చెప్పారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.46 శాతానికి చేరింది. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యమంత్రి సత్యేందర్ జైన్ నగరంలో విధించిన వారాంతపు కర్ఫూను లాక్‌డౌన్‌గా పరిగణించబోమని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో కరోనా తాజా కేసులు 5500 వరకు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 8.5 శాతంగా ఉంది.

Delhi Govt imposes weekend Curfew

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News