Friday, May 3, 2024

రాహుల్ గాంధీ నివాసంలో ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఆదివారం ఉదయం ఢిల్లీ పోలీసు బృందం స్థానికంగా ఉన్న12 , తుగ్లక్ లేన్‌లోని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లాయి. భారత్ జోడో యాత్ర దశలో ఆయన జమ్మూ కశ్మీర్‌లో పర్యటించినప్పుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయన నుంచి వివరణ తీసుకునేందుకు వచ్చి ఆయనను కలిసినట్లు వెల్లడైంది. మహిళలపై ఇప్పటికీ దారుణరీతిలో లైంగిక అత్యాచారాలు జరుగుతున్నట్లు, వారు చెప్పలేని స్థాయిలో లైంగిక దాడులకు గురవుతున్నట్లు రాహుల్ ఓ దశలో చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఆయన నుంచి వివరణ తీసుకునేందుకు శాంతి భద్రతల విభాగంలో ప్రత్యేక పోలీసు కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా ఆధ్వర్యంలో పోలీసు బృందం రాహుల్ నివాసానికి చేరుకోవడం సంచలనానికి దారితీసింది. మహిళలపై లైంగిక దాడుల అంశంప తాము దర్యాప్తు చేపట్టినట్లు, సంబంధిత విషయంపై రాహుల్ నుంచి వివరణ తీసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. బాధితులైన వారి సమాచారం ఆయనకు తెలిసి ఉంటుంది. తెలిసి ఉంటే సమాచారం అందిస్తే వారి నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు, సరైన దర్యాప్తు సాగించేందుకు వీలేర్పడుతుందని , అందుకే రాహుల్ ఇంటికి వచ్చామని పోలీసు అధికారి వివరించారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండే తుగ్లక్ లేన్‌లోకి ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ పోలీసు బలగాల శకటం వచ్చింది. రెండు గంటల నిరీక్షణ తరువాత రాహుల్‌ను పోలీసు బృందం కలుసుకుంది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పోలీసు వ్యాన్లు ఇక్కడి నుంచి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. రాహుల్ నివాసం వద్ద భద్రతను పెంచారు. లోపల పోలీసు బలగాలు ఉన్నప్పుడే సమాచారం అందగానే రాహుల్ నివాసానికి పవన్ ఖేరా, అభిషేక్ మనూ సింఘ్వీ, జైరాంరమేష్ ఇతర నేతలు తరలివచ్చారు, మరో వైపు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలకు దిగారు. దీనితో ఇక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. నలుగురైదుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఠాణాల్లో కొద్ది సేపు ఉంచి వదిలిపెట్టారని అధికారులు తెలిపారు. శ్రీనగర్ ప్రాంతంలో రాహుల్ భారత్ జోడో యాత్ర దశలో ఉన్నప్పుడు ఆయన మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఆయన ఏ ప్రాతిపదికన చేసింది తెలుసుకోవడానికి , సంబంధిత ఘటనలపై దర్యాప్తునకు అప్పటి నుంచి తాము రాహుల్ వివరణ కోసం చూస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఎవరైనా బాధితురాళ్లు ఆయనకు ఫిర్యాదు చేశారా అనేది తమకు అవసరం అని చెప్పారు. విషయాలు తెలిస్తే బాధితులకు తాము తగు రక్షణ కల్పించేందుకు వీలవుతుందని వివరించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవని, ఆయన వ్యాఖ్యలు చేసిన వెంటనే శ్రీనగర్‌లో స్థానికంగా ఇటువంటి ఘటనల ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి హూడా తెలిపారు. అయితే సంబంధిత ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదని చెప్పారు. దీనితో రాహుల్ నుంచి సంబంధిత విషయంపై ఆరా తీసుకునేందుకు యత్నించినట్లు, అయితే ఆయన విదేశాలకు వెళ్లడం తరువాత తీరిక లేకుండా ఉండటంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్లు హూడా చెప్పారు. వివరాలు అందించాలని ఆయనను అభ్యర్థించినట్లు తెలిపారు. సమాచారం తెలిస్తే సంబంధిత విషయంపై తాము చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు వీలేర్పడుతుందని అన్నారు.

ఇక ఇప్పుడు పోలీసు బలగాలను కూడా దింపారా : విపక్షాలు

కేంద్ర ప్రభుత్వ చర్య గర్హనీయం అని కాంగ్రెస్ మండిపడింది. రాజకీయ కక్ష వేధింపు చర్యలలో భాగంగానే ఇప్పుడు పోలీసు బృందాలు వాహనాలలో రాహుల్ నివాసానికి తరలివచ్చాయని వ్యాఖ్యానించారు. ఈ వాదనను బిజెపి ఖండించింది. పోలీసులు కేవలం తమ విధులు నిర్వర్తించారని తెలిపారు. ఉదయం రాహుల్ గాంధీ నివాసానికి పోలీసు బృందాలు తరలివచ్చిన విషయంపై తరువాత ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో సంయుక్త విలేకరుల సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తన దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ఈ విధంగా దురుసు చర్యలకు దిగుతున్నాయని కాంగ్రెస్ , ఇతర విపక్షాలు విమర్శించాయి. రాజకీయ ప్రత్యర్థులపై ఇప్పుడు పోలీసు బలగాలను కూడా ఉసిగొల్పుతున్నారని నిరసన వ్యక్తం చేశారు.
రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లోట్ స్పందిస్తూ ఇది కేవలం రాహుల్‌ను వేధించేందుకు, కాంగ్రెస్‌ను ఏదో విధంగా భయపెట్టేందుకు జరిపిన చర్య అని విమర్శించారు. రాజకీయ యాత్రల దశలో విపక్షనేతలు చేసే ప్రకటనపై బిజెపి ఈ విధంగా దాడులకు పాల్పడుతోందని గెహ్లోట్, జైరాం రమేష్ ఇతర నేతలు స్పందించారు.

పోలీసు రాకను సమర్థించిన బిజెపి

రాహుల్ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించినవి, ఆయన వద్దకు మహిళలు వచ్చి తాము లైంగికంగా దాడికి గురి అయినట్లు చెప్పారని ఆయనే తెలిపినప్పుడు సంబంధిత సమాచారం ఆయన (రాహుల్) ఇస్తే పోలీసులు సరైన దర్యాప్తు జరిపి, దోషులకు శిక్షపడేలా చూస్తారని, ఈ క్రమంలో రాహుల్ నుంచి సమాచారం తీసుకుంటే తప్పేమిటని బిజెపి అధికార ప్రతినిధి సంబంత్ పాత్ర స్పందించారు. పోలీసు బృందాలు చట్టపరంగా స్పందిస్తే దీనిపై కాంగ్రెస్ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అంటోందని, దారుణాలపై చర్యలకు ఉపక్రమించేందుకు దిగితే వీటిని ప్రశ్నిస్తే ఇక ఏది మంచి ఏది చెడు అని బిజెపి ప్రశ్నించింది. మహిళలు తాము బాధితులమయ్యామని తమకు న్యాయం దక్కలేదని చెప్పినప్పుడు దీని వివరాలు ఢిల్లీ పోలీసుకు తెలియచేస్తే తప్పేమిటి? అని బిజెపి నేతలు నిలదీశారు. ఆయన నిజాలు చెప్పి ఉంటే మహిళలకు సరైన న్యాయం జరగాలని అనుకుంటే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు నిరాకరిస్తే ఆయన చిత్తశుద్ధిని శంకించాల్సి ఉంటుందని బిజెపి సమాచార ఐటి వ్యవహారాల ఇన్‌చార్జి అమిత్ మాలవ్యా స్పందించారు.

ఎందుకీ తక్షణ అత్యవసరం

పోలీసు బృందం రాకపై ఘాటుగా స్పందించిన రాహుల్

తన నివాసానికి వచ్చి పోలీసు బృందాలు ఉన్నట్లుండి వివరణ కోరడం అసాధారణ చర్య అని రాహుల్ గాంధీ స్పందించారు. జోడో యాత్రలో వ్యాఖ్యలపై వివరణకు పోలీసులు వెలువరించిన నోటీసుకు రాహుల్ ఆదివారం మధ్యాహ్నం నాలుగు పేజీల తొలి సమాధానం వెలువరించారు. తనను కలిసేందుకు పోలీసులు అనుసరించిన వైఖరి పద్థతిని ముందుగా ఆయన తప్పుపట్టారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు తనకు తెలిసిందని తాను చెప్పి ఇప్పటికీ 45 రోజులు అయిందని, మరి ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఉన్నట్లుండి వారు ఎందుకు వచ్చారని రాహుల్ ప్రశ్నించారు. పోలీసు బృందం తన ఇంటికి ఐదురోజులలో మూడోసారి వచ్చి తలుపు తట్టిందని, ఇప్పుడు తిరిగి వచ్చారని , జనవరి 30వ తేదీన తన వ్యాఖ్యలపై తగు సమాధానం ఇచ్చేందుకు తనకు కనీసం పది రోజుల సమయం అవసరం అని తాను వారికి ముందుగానే చెప్పానని రాహుల్ తెలిపారు. రాజకీయ నేతల వ్యాఖ్యలన్నింటిపై పోలీసు బృందాలు తరలివచ్చి ఆరా తీస్తాయా? అని ప్రశ్నించారు. ఇంతకు ముందు ఇటువంటివి ఏమైనా జరిగాయా? తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News