Friday, April 26, 2024

ధనుర్మాస విశిష్టత

- Advertisement -
- Advertisement -

సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున 12 నెలలు 12 రాశులలో సంచరిస్తాడు. ఆ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అని పిలుస్తారు. ధనుర్మాసము దక్షిణాయణంలో చివరి మాసము. ఈ నెల 16న ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి 13న ముగుస్తుంది. సూర్యుడు రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణము అంటారు. సూర్యుడు జనవరి 14న మకర రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు సంచరించే పన్నెండు నెలలు కలిపి దేవతలకు ఒక సంవత్సరం. ఒక సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు.

మొదటిది ఉత్తరాయణం, రెండోది దక్షిణాయనం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు. దక్షిణాయనం అంటే రాత్రి వదలి పగలు ప్రవేశించే సమయం, ప్రాంతః కాలం వంటిది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటంతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. విష్ణువు ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాసం. ధనుర్మాసంలో శ్రీమహా విష్ణువును మధుసూదనుడిగా కొలుస్తారు. మొదటి పదిహేను రోజులు చెక్కర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పిస్తారు. తదుపరి పదిహేను రోజులు దద్యోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. ధనుర్మాసంలో ప్రతి ఇంటి ముందు సాయంత్రం రంగవల్లులు వేసి మరుసటి ఉదయం ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను రంగవల్లుల మధ్యలో ఉంచి పూజించడం ఆనవాయితీ.

మధ్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను మహాలక్ష్మిగాను చుట్టూఉన్న గొబ్బెమ్మలను గోపికలు గాను భావించి, పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ కొలుస్తారు. ఈ విధంగా గొబ్బెమ్మలను పూజించడం వల్ల పెళ్లి కాని కన్యలకు త్వరగా మంచి మొగుడు లభించి వివాహమవుతుందని నమ్మకం. హరిదాసులు, గుమ్మడి కాయ వంటి గిన్నెను నెత్తిన పెట్టుకొని, హరి సంకీర్తనలతో ప్రతి ఉదయం ఇంటి ముందుకు రావటం ధనుర్మాసం ప్రత్యేకత. హరి సంకీర్తనలతో శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తుంది. భూమిని నెత్తిన పెట్టుకొని వచ్చిన సాక్షాత్తు శ్రీమహావిష్ణుగా హరిదాసును భావిస్తారు. ధనుర్మాసం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రతం.

ప్రతి రోజు వైష్ణవాలయాలలో సాధారణంగా చేసే సుప్రభాత సేవకి బదులుగా గోదాదేవి శ్రీరంగనాధుని స్తుతించిన తిరుప్పావై పాశురములతో విష్ణువుని అర్చించటం ఆనవాయితీ. సాక్షాత్తు శ్రీమహా విష్ణువు కొలువై ఉన్న తిరుమలలో కూడా సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాశురములతో కలియుగ వెంకటేశ్వరుని అర్చిస్తారు. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి కళ్యాణంతో ముగుస్తుంది. ఆండాళ్ లేదా గోదాదేవి, శ్రీ విష్ణు చిత్తులకు పూల తోటలో లభించిన కుమార్తె. ఈమెను విష్ణుచిత్తుల దంపతులు చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. యుక్త వయస్సుకు వచ్చిన తరువాత గోదాదేవి, శ్రీవారు అయిన రంగనాథుడినే తన పతిగా పొందాలని తలచినది. గోదాదేవి, శ్రీ రంగనాథుని వివాహ మాడదలచి తిరుప్పావై వ్రతాన్ని ఆచరిస్తుంది. శ్రీ రంగనాథుని రోజుకు ఒక గీతం చొప్పున ముప్పది గీతాలను రచించి స్తుతిస్తుంది.

గోదాదేవి రచించిన గీతాలను పాశురాలు అంటారు. మొదటి అయిదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్యోద్దేశ్యాన్ని తెలియజేస్తాయి. తరువాతి పది పాశురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. తరువాతి ఐదు పాశురాలు గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. చివరి తొమ్మిది పాశురాలు భగవద్విభూతిని వర్ణిస్తాయి. చిట్టచివరి పాశురంలో గోదాదేవి తను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ ముప్ఫై పాశురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని ఉద్ఘాటిస్తుంది.

విష్ణుచిత్తుల వారికి ధనుర్మాసం చివరి రోజు ముందు రాత్రి శ్రీ రంగనాథుడు కలలో కనిపించి గోదాదేవిని సాలంకృతంగా కన్యాదానం చేయమని ఆదేశిస్తాడు. ధనుర్మాసం చివరి రోజున శ్రీరంగనాథుడు కోరిన విధంగా గోదాదేవిని సాలంకృతంగా కన్యాదానం చేసి వివాహం జరిపించాడు. కళ్యాణం జరిగిన వెంటనే గోదాదేవి శ్రీ రంగనాథునిలో లీనమైపోతుంది. ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారు జామునే నిద్ర లేచి స్నానమాచరించి శ్రీ మహావిష్ణువును ఆవు పాలు, కొబ్బరి నీళ్లు మొదలగు పంచామృతాలతో అభిషేకం చేసినట్లయితే స్వామి కటాక్షం లభిస్తుంది. ధాన్య లక్ష్మీ ఇంటికి చేరే సమయం కూడా ధనుర్మాసమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News