అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారించిందని ఎపి ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉద్యోగులు దాచుకున్న జిపిఎఫ్ సొమ్మునూ ఇతర అవసరాలకు వాడేసిందని అన్నారు. పిఆర్సి పునర్నిర్మాణం, బకాయిల చెల్లింపు అంశాలపై ఎపి శాసన మండలిలో ప్రశ్నోత్తరాలు చర్చ జరిగింది. ఎమ్మెల్సీల ప్రశ్నలకు పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడు వైసిపి నేతలు ఉద్యోగుల విషయంలో ప్రేమ ఒలకబోస్తున్నారని, ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసిపి అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలు అమలు చేసి ఉంటే వైసిపికి సింగిల్ డిజిట్ వచ్చేదికాదని, 94 కేంద్ర ప్రభుత్వ పథకాల సొమ్మునూ ఇతర పథకాలకు వైసిపి వాడేసిందని మండిపడ్డారు.
ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, గతంలో తెలంగాణ కంటే ఒకశాతం ఎక్కువ…43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని తెలియజేశారు. వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు రివర్స్ పిఆర్సి ఇచ్చిందని, ఐఆర్ కంటే తక్కువగా 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కరోనా పేరు చెబుతూ ఉద్యోగుల ఫిట్ మెంట్ ను సర్కారు తగ్గించిందని, వైసిపి పెట్టిన బకాయిల చెల్లింపునకు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పిఆర్సి కమిషన్ నియామకంపై సమయంలో సిఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటారని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
Also Read : మోడీ..ఫెయిల్