Friday, April 26, 2024

రోగికి సర్జరీ కోసం 3 కిలోమీటర్లు డాక్టర్ పరుగు

- Advertisement -
- Advertisement -

Doctor runs 3 kilometers for surgery on patient

బెంగళూరు : ట్రాఫిక్ కీకారణ్యపు బెంగళూరులో ఓ డాక్టరు తన విద్యుక్త ధర్మం నిర్వహించేందుకు 3 కిలోమీటర్లు పరుగు తీశారు. తాను చేయాల్సిన సర్జరీని సకాలంలో చేయడంతో రోగి ఆరోగ్యంగా డిశ్చార్జి అయ్యారు. గత నెల చివరిలో జరిగిన ఘటనఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇతర ప్రముఖ నగరాల మాదిరిగానే బెంగళూరు కూడా రోజువారి రాదారుల గందరగోళపు ట్రాఫిక్ చిక్కుల్లో కూరుకుపోయింది. స్థానిక సర్జాపూర్‌లోని మణిపాల్ హాస్పిటల్‌లో డాక్టర్ గోవింద్ నందకుమార్ గాస్ట్రో ఎంట్రాలజీ సర్జన్‌గా ఉన్నారు. గత నెల 30న ఉదయం పది గంటలకు ఆసుపత్రిలో మధ్య వయస్కురాలైన మహిళకు ఈ డాక్టరు అత్యవసరంగా లాప్రోస్కోపిక్ గాల్‌బ్లాడర్ శస్త్రచికిత్సచేయాల్సి ఉండగా ఈ డాక్టరు తమ కారులో కిలోమీటర్ల పొడవు ట్రాఫిక్‌లో చిక్కుపడ్డారు. దీనితో ఈ డాక్టరు ఎక్కువగా ఏమీ ఆలోచించకుండా వెంటనే తన కారు దిగి దీనిని డ్రైవర్‌కు అప్పగించి, పక్కనే ఉన్న సన్నటి రోడ్ మీదుగా ఆసుపత్రికి పరుగులు తీశారు.

3 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి చేరుకుని తన రోగికి ఆపరేషన్ నిర్వర్తించారు. తాను ప్రతిరోజూ ఈ ట్రాఫిక్ చిక్కులు ఎదుర్కొంటున్నానని రోజూ సెంట్రల్ బెంగళూరు నుంచి మణిపాల్ హాస్పిటల్ ఉండే సర్జాపూర్‌కు కారులో వెళ్లుతానని , ఆపరేషన్ రోజు అంతా సిద్ధం అయి ఉన్న దశలో ట్రాఫిక్ తనకు పెద్ద ఆపరేషన్‌గా మారిందని, దీనిని ఛేదించుకుంటూ పరుగులు తీశానని వివరించారు. తాను ట్రాఫిక్‌లో చిక్కుపడి కారులో ఉండిపోయి ఉంటే సమయానికి ఆపరేషన్ జరిగేది కాదని, దీనితో రోగి ప్రాణాలకు ముప్పు ఏర్పడి ఉండేదని , ఆమె క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగానని అప్పటి తన అనుభవాన్ని ఈ డాక్టరు వీడియోగా ట్వీటు చేశారు. బెంగళూరులో ఇటీవలి భారీ వర్షాలు వరదలతో రోడ్లు పూర్తిగా దెబ్బతిని రోజూ మైళ్లకొద్దిదూరం ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ దశలో రోజువారి ప్రయాణికులు ప్రత్యేకించి అత్యవసరంగా విధులకు వెళ్లే వారి పరిస్థితి నరకయాతనగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News