భారత్-పాక్ ఘర్షణ ఆపింది నేనే మరోసారి ట్రంప్ వ్యాఖ్య
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే ఖచ్చితంగా నోబెల్ బహుమతి వస్తుందని ఆశాభావం
వాషింగ్టన్: భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే నివారించినట్లు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. వాణిజ్యం ద్వారా ఆవివాదాన్ని పరిష్కరించానన్నారు. ఈ ఏడాది ఏడు యుద్ధాలను నివారించిన తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం అమెరికన్ కార్నర్ స్టోన్ ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుల విందు సందర్భంగా ట్రంప్ ప్రసంగించారు. తాము శాంతి ఒప్పందాలను రూపొందించి, యుద్ధాలను నివారించామని, అలాగే, భారతదేశం- పాకిస్తాన్, థాయిలాండ్- కంబోడియా మధ్య యుద్ధాలను ఆపివేశామని ట్రంప్ అన్నారు.
భారతదేశం- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని వాణిజ్యం ద్వారా తాను ఆపిన విషయాన్ని వివరించారు. రెండు దేశాల నాయకులపట్ల తనకు గౌరవం ఉందని అంటూ, వారు అమెరికాతో వ్యాపారం చేయాలను కుంటున్నారని అన్నారు. తాను నివారించిన యుద్ధాలను ఏకరవు పెడుతూ, భారత్- పాకిస్తాన్, థాయిలాండ్- కంబోడియా, అర్మేనియా -కొసావో, సెర్బియా, ఇజ్రాయెల్ – ఉరాన్, ఈజిప్ట్- ఇథియోపియా, రువాండా – కాంగో యుద్ధాలు తన కారణంగానే ఆగిపోయాయని అమెరికా ప్రెసిడెంట్ చెప్పారు. వాటిలో 60శాతం వాణిజ్యం కారణంగానే ఆగిపోయాయని వెల్లడించారు. భారతదేశం-పాకిస్తాన్ అణ్వాయుధాలు గల దేశాలని, రెండు దేశాలు యుద్ధం ఆపని పక్షంలో వాణిజ్యం నిలిచిపోతుందని తాను హెచ్చరించడంతో వారు యుద్ధం నిలిపివేశారని ట్రంప్ మరో సారి పేర్కొన్నారు.
రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగితే, తనకు నోబెల్ బహుమతి ఇచ్చే అవకాశం ఉందని తనకు తెలిపారని ట్రంప్ వివరించారు. సరే మిగతా ఏడు యుద్ధాలను నివారించిన సంగతి ఏమిటని. ఒక్కో యుద్ధం నివారణకు ఒక్క నోబెల్ బహుమతి రావాలని ఆయన అన్నారు. కానీ, రష్యా -ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపివేస్తే, శాంతి బహుమతి పొందగలరని తెలిపారని అమెరికా ప్రెసిడెంట్ వివరించారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం చాలా పెద్దయుద్ధం అని ట్రంప్ అన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో తనకు మంచి సంబంధాలు ఉండడంతో ఆ యుద్ధం నివారణ సులభంగా జరగగలదని తాను భావించానని ట్రంప్ తెలిపారు. పుతిన్ వైఖరి నిరాశ కలిగించిందని చెబుతూ, ఏమైనా యుద్ధం నివారించి, శాంతి నెలకొల్పి తీరతాం అన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు.
Also Read: వచ్చే నెలలో మోడీ, ట్రంప్ భేటీ