Sunday, May 12, 2024

ఎల్‌జెపి ఇరు వర్గాలకు ఇసి వద్ద చుక్కెదురు

- Advertisement -
- Advertisement -
Election Commission freezes LJP poll symbol
పార్టీ పేరు, గుర్తు ఉపయోగించొద్దని ఆదేశం

న్యూఢిల్లీ: లోక్‌జన్‌శక్తి పార్టీ(ఎల్‌జెపి) చీలిక వర్గాలు రెండింటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద చుక్కెదురైంది. ఎల్‌జెపి పార్టీ పేరునుగానీ, ఎన్నికల గుర్తునుగానీ ఏ వర్గమూ త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో ఉపయోగించడానికి వీల్లేదని ఇసి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్‌లోని కుశేశ్వర్‌ఆస్థాన్, తారాపూర్ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నిక జరగనున్నది. ఈ రెండు స్థానాల్లో నామినేషన్లకు తుది గడువు అక్టోబర్ 8. దాంతో, తమదే అధికారపక్షంగా గుర్తించాలంటూ గతంలో ఇసిని ఆశ్రయించిన ఇరువర్గాలు నామినేషన్ల గడువుకు ముందే నిర్ణయం వెల్లడించాలంటూ మరోసారి కోరాయి. ఈ నేపథ్యంలో ఇసి శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది ఎల్‌జెపి వ్యవస్థాపకుడు రామ్‌విలాస్ పాశ్వాన్ మరణించిన కొన్ని రోజులకే ఆ పార్టీ రెండుగా చీలింది. ఓ వర్గానికి రామ్‌విలాస్ కుమారుడు, ఎంపి చిరాగ్‌పాశ్వాన్ నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి చిరాగ్ బాబాయ్, కేంద్రమంత్రి పశుపతికుమార్‌పరాస్ నేతగా ఉన్నారు. ఉప ఎన్నికల కోసం కొత్త గుర్తుల్ని ఎంపిక చేసుకోవాలని ఇరు పార్టీలకు ఇసి సూచించింది. సోమవారంలోగా తమకు మూడు ఐచ్ఛికాల చొప్పున గుర్తుల పేర్లు తెలపాలని సూచించింది. ఎల్‌జెపి అధికారిక గుర్తు బంగ్లాను ప్రస్తుతం ఎవరికీ కేటాయించకుండా పక్కన పెట్టనున్నారు. పార్టీ గుర్తింపు తమకే ఇవ్వాలని సమర్థించే పత్రాలను నవంబర్ 5లోగా తమకు సమర్పించాలని ఇరు పక్షాలకూ ఇసి తెలిపింది. లోక్‌సభలో పశుపతి వర్గానికి ఐదుగురు ఎంపీలుండగా, చిరాగ్ తానొక్కడే తన వర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News