Friday, May 10, 2024

చైనాను కమ్ముకుంటున్న కారు చీకట్లు

- Advertisement -
- Advertisement -

China Power Outages Close

విద్యుత్ కోతలతో అల్లాడుతున్న జనం
మూతపడుతున్న పరిశ్రమలు
పెరిగిన డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయలేక పోతున్న సంస్థలు

షెన్‌యాంగ్: అభివృద్ధిలో అగ్రరాజ్యంతో పోటీ పడాలనుకుంటున్న చైనాలో ఇప్పుడు చీకటి రాజ్యమేలుతోంది. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం అల్లాడి పోతున్నారు. ఒకటి, రెండు గంటలు విద్యుత్ కోతలంటే ఎలాగోలా సరిపెట్టుకోవచ్చు కానీ చాలా ప్రాంతాల్లో పగలంతా కరెంటు లేక పోవడంతో ప్రజలు నానా కష్టాల పడుతున్నారు. రాత్రిపూట కూడా హటాత్తుగా విద్యుత్‌కు అంతరాయంం కలుగుతోంది. స్కూళ్లలో లైట్లు లేక పోవడంతో పిల్లలు చదువుకోవడానికి బదులు ఆరు బయట ఆటలాడుకుంటూ ఉండే దృశ్యాలు చాలా ప్రాంతాల్లో సర్వ సాధారణమై పోయాయి. ఈ ఇలాంటి విద్యుత్ కోతలను తాము ఎప్పుడూ చూడలేదని లియావోనింగ్ ప్రావియన్స్ రాజధాని అయిన షెన్యాంగ్ నగరంలో ఓ మహిళ వాపోయింది. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఆమె 33 అంతస్థుల అపార్ట్‌మెంట్ భవనంలో ఉంటున్న వయోవృద్ధులైన తన తల్లిదండ్రుల గురించి ఎక్కువ ఆందోళన చెందుతోంది. కరెంటు లేకపోతే నీటి సరఫరా కూడా ఆగి పోతుంది. ఎలివేటర్లు పని చేయక, సెల్‌ఫోన్లు మూగబోయి, చీకట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపే వారిని ఊహించుకుని ఆమె తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నేటి ఆధునిక ప్రపంచంలో జనం ఇలా జీవించడం చాలా దుర్లభమని, కనీసం ప్రభుత్వం ముందుగానే పరిస్థితి గురించి తమను హెచ్చరించి ఉంటే బాగుండేదని ఆమె వాపోయింది.

దేశమంతటా ఇదే పరిస్థితి

విద్యుత్ సంక్షోభం ఆ ఒక్క రాష్ట్రానికో, నగరానికో పరిమితం కాదు. దేశవ్యాప్తంగా తీవ్రమైన విద్యుత్ కోతల కారణంగా వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. క్రమంగా దీని ప్రభావం కరోనా కారణంగా ఇప్పటికే దెబ్బతిన్న సప్త్లై చైన్‌పై కూడా పడింది. గత వేసవినుంచే ఈ సంక్షోభం కొనసాగుతూ వస్తోంది కానీ గత వారం చైనా ఈశాన్య ప్రావిన్స్‌లో నివాస ప్రాంతాలకు కూడా విద్యుత్ కోతలను ప్రకటించడంతో జనం ఇప్పుడు దీనిపై ఎక్కువ దృష్టిపెటుటడం మొదలు పెట్టారు. దేశంలోని మధ్య తరగతి ప్రజానీకం గృహవసతి, విద్య, తమ భవిష్యత్తుపై ఎక్కువ ఆందోళన చెందుతున్న సమయంలో ఈ విద్యుత్ సంక్షోభం పురుగు మీద పుట్రలాగా వారిని మరింత కలవర పెడుతోంది. దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ‘ఎవర్‌గ్రాండే’ దాదాపు 300 బిలియన్ డాలర్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దివాలా తీసే పరిస్థితిలో ఉందంటూ ఇటీవల వచ్చిన వార్త ముందు ఆ కష్టాలన్నీ చిన్నవై పోయాయి. క్రమంగా మందగిస్తున్న చైనా ఆర్థిక పరిస్థితికి ఇవన్నీ అద్దం పడుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. షెన్యాంగ్ నగరంలో గత వారాంతంలో ట్రాఫిక్ లైట్లు ఒక్క సారిగా నిలిచి పోవడంతో వందలాది కార్లు హైవేలపై కారు చీకటిలో చిక్కుపడి పోయాయి. గత నెల 24న పక్కనే ఉన్న లియావోయాంగ్ పట్టణంలో ఒక స్టీల్ క్యాస్టింగ్ పరిశ్రమలో విద్యుత్ నిలిచి పోవడంతో 23 మంది ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. చాలా పట్టణాల్లో జనం ఎలివేటర్లలో చిక్కుకు పోవడం, అర్ధరాత్రి ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు ఆగిపోవడంతో అస్వస్థతకు గురి కావడం, నీళ్లు లేక అవస్థలు పడడం లాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఈ వారం చాలా ఫ్యాక్ట్టరీలు విద్యుత్ కోతల కారణంగా మూతపడ్డాయి. అక్కడక్కడ ఒకటీ అరా పరిశ్రమలు జనరేటర్ల సాయంతో నెట్టుకొస్తున్నాయి.

పెరిగిన విద్యుత్ డిమాండ్.. చేతులెత్తేసిన కంపెనీలు

ఈ హటాత్ విద్యుత్ కోతలు చైనా విద్యుత్ , ఆర్థిక రంగాల లోపభూయిష్ట విధానాలను వెలుగులోకి తెస్తున్నాయి. కరోనా కారణంగా దెబ్బతిన్న ఉత్దాక రంగాన్ని తిరిగి పుంజుకునేలా చేయడం కోసం చైనా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని రెట్టింపు చేసింది. అయితే విద్యుత్ ఉత్పత్తి కోసం ఎక్కువగా బొగ్గుపై ఆధారపడ్డం, వృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పుడు సమస్యగా మారింది. ఉత్పత్తి పెంచడం కోసం విద్యుత్‌ను ఎక్కువగా వాడడం, దానికి తోడు ఈ ఏడాది బొగ్గు ధరలు ఆకాశాన్నంటడంతో బొగ్గు కొరత ఏర్పడింది. అమెరికా, యూరప్ దేశాల్లో కరోనానుంచి కోలు కోవడంతో పెరిగిన ఆర్డర్ల డిమాండ్‌ను తట్టుకోవడం కోసం చైనా కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచడంతో విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరిగి పోయింది. దీనికి తోడు వాయువ్య చైనాలో కరవు కారణంగా జల విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో కూడా బొగ్గుపై ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది.

అయితే చైనాలో నెగటివ్ ఆర్థిక షాక్ ఉన్న ప్రతిసారీ ఇలాంటి పరిస్థితులే తలెత్తుతున్నాయని సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఎనర్జీ, క్లీన్ ఎయిర్‌లో ప్రధాన విశ్లేషకుడు లారీ మిల్లివిర్ట్టా అభిప్రాయపడ్డారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ నిర్మాణం, మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని ఒక మార్గంగా ఉపయోగించుకుంటోంది. అదే ఈ సంక్షోభానికి కారణం ’అని ఆయన అన్నారు. చైనాలోని బొగ్గు గనుల్లో ప్రమాదాలు సర్వ సాధారణం. ఫలితంగా లోపభూయిష్టంగా ఉండే, సామర్థానికి మించి పని చేస్తున్న బొగ్గు గనులను ప్రభుత్వం మూసి వేస్తోంది.

కొవిడ్19 కారణమైన వైరస్ జన్మస్థానంపై ఆస్ట్రేలియా దర్యాప్తు జరుపుతోందన్న కారణంతో చైనా ఆ దేశంనుంచి బొగ్గు దిగుమతిని నిలిపి వేయడం కూడా సంక్షోభానికి ఆజ్యం పోస్తోంది. స్వదేశీ బొగ్గు కారణంగా కర్బన ఉద్గారాలు పెరిగిపోయి వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. పైగా ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సుఈ నెల 12 13 తేదీల్లో చైనాలోని కన్మింగ్‌లో జరగనుంది. ఆతిథ్య దేశంగా ఉంటూ ఈ స్థాయిలో ఇంధనాన్ని వినియోగిస్తే అంతర్జాతీయంగా విమర్శలు వస్తాయనే భయంతో అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై సంప్రదాయ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే రాజకీయ ఒత్తిడులు పెరిగి పోవడం కూడా విద్యుత్ కొరతకు ఒక కారణమని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సంక్షోభాన్ని చైనా ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి. అప్పటిదాకా ప్రజలకు ఇబ్బందులైతే తప్పవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News