Sunday, May 5, 2024

ఎలిజబెత్ రాణి భర్త ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Elizabeth Queen husband Prince Philip's Died

 

లండన్: బ్రిటన్ రాణి రెండవ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్(99) కన్ను మూశారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆయన ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే గుండె సంబంధిత ఆపరేషన్ తర్వాత కోలుకుని ప్యాలెస్ చేరుకున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. విండ్సర్ క్యాజిల్‌లో ఈ ఉదయం ఆయన ప్రశాంతంగా కన్ను మూసినట్లు తెలిపింది. గ్రీకు రాకుమారుడైన ఫిలిప్ 1947లో ఎలిజబెత్‌ను వివాహం చేసుకుని బ్రిటన్ రాజ్యానికి వచ్చారు. అప్పటినుంచి రాణి వెన్నంటి ఉంటూ పాలనాపరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. 2017లో రాజరిక విధులనుంచి వైదొలిగారు.

‘ నా భర్తే నాకు కొండంత అండ’ అని 1997లో తమ 50వ వివాహవార్షికోత్సవం సందర్భంగా రాణి ఎలిజబెత్ తన ప్రసంగంలో తెలిపారు. అయితే గత కొన్నేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిలిప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఆస్పత్రిలో చేరారు. నాలుగు వారాల చికిత్స అనంతరం మార్చి 16న డిశ్చార్జి అయ్యారు. బ్రిటన్‌లో కరోనా విజృంభణ సమయంలో లాక్‌డౌన్ సమయం దాదాపు అంతా ఫిలిప్, ఎలిజబెత్ దంపతులు కొద్ది మంది సిబ్బందిలో విండ్సర్ కాజిల్‌లోనే ఉన్నారు. గత జనవరిలో ఈ దంపతులు తమ తొలి కొవిడ్ వ్యాక్సిన్‌ను కూడా తీసుకున్నారు.

ప్రధాని మోడీ సంతాపం
డ్యూక్ ఆఫ్ ఎడింబరో ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం ప్రకటించారు. ఫిలిప్ సైన్యంలో విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. ఈ కష్ట కాలంలో బ్రిటన్ ప్రజలకు, రాజకుటుంబానికి ట్విట్టర్ వేదికగా సంఘీభావం ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News