Wednesday, May 8, 2024

ఉద్యోగుల మదిలో ఉల్లాస వీణ

- Advertisement -
- Advertisement -

పదవీ విరమణ 61, 30% ఫిట్‌మెంట్?

ఎపిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తీసుకురావడం ఖాయం

పిఆర్‌సి సిఫారసు ఎలా ఉన్నప్పటికీ మీకు ఎంత రావాల్సి
ఉందో అంతా ఇస్తాం అని భరోసా ఇచ్చిన సిఎం

ఎపి కంటే ఎక్కువ ఇస్తామన్నారు, సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ స్కీం 
గత హామీలను సిఎం దృష్టికి తెచ్చాం, కోడ్ ముగియగానే ప్రకటన వెలువడే అవకాశం
ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి వచ్చిన తర్వాత ప్రకటించిన ఉద్యోగుల సంఘాల నేతలు, బిఆర్‌కె భవన్ వద్ద సంబురాలు
పిఆర్‌సి సిఫారసుల వచ్చిన తర్వాత తొలిసారిగా సిబ్బంది నేతలతో 3గంటల పాటు ప్రగతిభవన్‌లో కెసిఆర్ సమావేశం

మన తెలంగాణ/హైదరాబాద్: ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసిందని, ఉద్యోగుల వయో పరిమితి పెంపు, ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు సిఎ కెసిఆర్ అంగీకరించారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. మంగళవారం మధ్యా హ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ ఉద్యోగ సంఘాలతో సమావేశ మయ్యారు. మూడు గంటల పాటు జరిగిన ఈ సమా వేశంలో ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయన కూలంకషంగా చర్చించారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. తమకు ఇవ్వాల్సిన పిఆర్‌సి, వయో పరిమతిని 61 సంవత్సరాలకు పెంపు వంటి అంశాలపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న ఎంఎల్‌సి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేస్తుందన్నారు. ఫిట్‌మెంట్‌పై చర్చించిన సిఎం కెసిఆర్ దాదాపు 30 శాతం వరకు ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్లుగా వారు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నందున కొంత మెరుగ్గా పిఆర్‌సి ఇస్తామన్నారు.

కాగా, ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను కూడా ఈ సందర్భంగా సిఎం దృష్టికి తీసుకెళ్లిన్నట్లు వారు తెలిపారు. వాటిపై కూడా సిఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఇక వయోపరిమితిని కూడా 61 ఏళ్లకు పెంపునకు కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా సిఎం పేర్కొన్నారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పదవీ విరమణ పెంపును మార్చి నుంచే అమలు చేసేందుకు సిఎం స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. అదే విధంగా సిపిఎస్ ఉద్యోగుల అంశంలో కూడా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ స్కీంను వర్తింప చేయనున్నారని వారు తెలిపారు. వీటితో పాటుగా జూనియర్ పంచాయతి కార్యదర్శుల ప్రొబేషనరీ పీరియడ్‌ను రెండేళ్లకు కుదించేందుకు కూడా అవకాశాన్ని పరిశీలిస్తామని సిఎం హామీ ఇచ్చారన్నారు. విఆర్‌ఒలను సొంత శాఖల్లో సర్దుబాటు చేసేందుకు కూడా సిఎం సూచన ప్రాయంగా సుముఖత వ్యక్తం చేశారన్నారు. సిఎంతో భేటి అయిన వారిలో ఉద్యోగ సంఘాల జెఎసి ఛైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ మమత, కార్యదర్శులు ఏనుగుల రాజేందర్, రాయకంటి ప్రతాప్‌తో పాటు జెఎసి మాజీ ఛైర్మన్ కారం రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

కెసిఆర్‌పై సంపూర్ణ విశ్వాసం ఉంది
సిఎం కెసిఆర్‌పై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. ఉద్యోగులకు సంబంధించి ఏ విషయంలోనూ అన్యాయం జగరదన్న భరోసా సిఎంతో జరిగిన సమావేశంలో తమకు చాలా స్పష్టంగా కనిపించిందన్నారు. పిఆర్‌సి నివేదిక ప్రభుత్వానికి చేరిన తరువాత సిఎం ఉద్యోగ సంఘాలకు అపాయింట్ మెంట్ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులకు 11వ వేతన సవరణ ఇపిఆర్‌సిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు. ఎన్నికల నియమావళి ఉన్నందున ప్రకటన చేయలేకపోతున్నాం అని సిఎం చాలా స్పష్టంగా చెప్పారన్నారు. ఉద్యోగుల పదవి విరమణ 61 సంవత్సరాలకు పెంపును కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. అలాగే ఎపిలో ఉన్న ఉద్యోగులను తెలంగాణ కు తీసుకురావడానికి కెసిఆర్ అంగీకారించారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు కూడా జారీ చేశారని వివరించారు. ఎన్నికల నియమావళికి లోబడి సిఎం కెసిఆర్‌తో సమావేశం నిర్వహించామని ఒక ప్రశ్నకు సమాధానంగా వారు తెలిపారు. 2014 తరువాత దేశంలోనే తెలంగాణలో అత్యధిక పిఆర్‌సి సిఎం ఇచ్చారన్నారు. ఉద్యోగుల ప్రమోషన్‌లు కూడా చాలా త్వరితగతిన ఇచ్చారన్నారు. పిఆర్‌సిపై వేసిన కమిటి ఎంత రికమండ్ చేసినా.. మీకు ఎంతో ఇవ్వాలో అంత ఇస్తాం.. న్యాయపరంగా రావల్సిన పిఆర్‌సి వస్తుందని సిఎం కెసిఆర్ భరోసా ఇచ్చారని వారు వెల్లడించారు. ఎపి కంటే ఎక్కువ పిఆర్‌సి ఇస్తామని కెసిఆర్ ఇస్తామన్నారని పేర్కొన్నారు. అలాగే సిపిఎస్ ఉద్యోగుల కుటుంబలకు పెన్షన్ స్కిం అమలు చేస్తామన్నారు. అలాగే గతంలో ఇచ్చిన హామీలను సిఎం దృష్టికి తీసుకెళ్లామన్నారు.

బిఆర్‌కెఆర్ భవన్ వద్ద సంబురాలు
సిఎంతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై ప్రభుత్వం నుంచి సానుకూలత రావడంతో బిఆర్‌కెఆర్ భవన్ వద్ద ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున సంబురాలు జరిగాయి. బాణాసంచా కాలుస్తూ, పరస్పరం ఉద్యోగులు స్వీట్లు తినిపించు కున్నారు. ఆనందంతో నృత్యాలు చేశారు. సిఎం కెసిఆర్‌కు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.

Employee unions meets CM KCR at Pragati Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News