Wednesday, May 1, 2024

అంతరిస్తున్న అటవీ జాతి మొక్కలను రక్షించాలి

- Advertisement -
- Advertisement -

జలమండలి ఆధ్వర్యంలో కోటి వృక్షార్చన కార్యక్రమం
మొక్కలు నాటిన ఎండి దానకిశోర్

మన తెలంగాణ/ హైదరాబాద్:  భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవంలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా జలమండలి ఎండి దానకిశోర్ శనివారం హిమాయత్ సాగర్ లోని జలమండలి గార్డెన్ లో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంతరిస్తున్న అటవీ జాతి మొక్కల్ని రక్షించడం కోసం మియావాకీ పద్ధతిలో వనాలను పెంచేందుకు జలమండలి కృషి చేస్తుందని పేర్కొన్నారు. బోర్డు పరిధిలో పలు ఖాళీ ప్రాంతాల్లో ఇప్పటికే మొక్కలు నాటుతున్నామన్నారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటేలా ఈ విధానాన్ని అనుసరిస్తున్నామని మొక్కల పెంపకంతో స్వచ్ఛమైన గాలితోపాటు వర్షపాతమూ పెరుగుతుందన్నారు. అంతేకాకుండా పచ్చదనం పెరిగి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుతాయని వివరించారు.
ఇప్పటికే పలు మొక్కల సంరక్షణ..
జలమండలి గార్డెన్‌లోని మినీ అడవిలో ఇప్పటికే రావి, బాదం, అల్లనేరేడు, కానుగ, ఏగిస, ఉసిరి, తాని, జామ, సంపంగి, సీతాఫల్, బూరుగ, జిట్రేగి, వెదురు, నెమలినార, మోదుగ, ఇప్ప, మర్రి, బహినియా, మద్ది, చింత తదితర మొక్కల్ని పెంచుతున్నారు. ఇప్పటికే మల్లారం, కొండపాక మంచినీటి శుద్ది కేంద్రాల్లో, ఉస్మాన్ సాగర్ జలమండలి పార్కు, హిమాయత్ సాగర్ జలమండలి గార్డెన్, అంబర్ పేట్ ఎస్టీపీ తదితర ప్రాంతాల్లో ఈ మియావాకీ పద్దతిలో ఒక హెక్టార్ లో 10 వేల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నారు. జపాన్‌కు చెందిన పర్యావరణ శాస్త్రవేత్త అకిరా మియావకీ 1990 లోనే శాస్త్రీయ పరిశోధనలో తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ మొక్కలు నాటి మినీ అడవిని అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. సాధ్యమైనంత ఎక్కువ మొక్కలను నాటి దట్టమైన అడవి మాదిరిగా పెంచడమే మియావాకీ విధానం.

ఈ కార్యక్రమంలో ఈడి డా.ఎం.సత్యనారాయణ, ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్ – 1 అజ్మీరా కృష్ణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, ఆపరేషన్స్ డైరెక్టర్ – 2 స్వామి, సీజీఎంలు వినోద్ భార్గవ, విజయరావు, డిఎఫ్ వో మోహన్, జలమండలి ఫారెస్టు ప్లాంటేషన్ సెల్ అధికారులు ముత్యం రెడ్డి, రవి, జిఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News