Sunday, April 28, 2024

కాందిశీకుల భూములు అన్యాక్రాంతం !

- Advertisement -
- Advertisement -

ఒక వైపు కేంద్రం…మరోవైపు కబ్జాదారులు
వేలల్లో నిర్మాణాలు వాటికి ఇంటి నెంబర్‌లు..
ఆ ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్తులపై ప్రభుత్వం ఆరా

మనతెలంగాణ/హైదరాబాద్: కాందిశీకుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఒకవైపు కేంద్రం ఆ భూములు తమకే చెందుతాయని రాష్ట్రాలకు లేఖ రాయగా, కొందరు కబ్జాదారులు ఇప్పటికే వాటిని కబ్జాచేసి అందులో అక్రమ కట్టడాలను నిర్మించి రిజిస్ట్రేషన్‌లను చేసుకోవడం గమనార్హం. కాందిశీకుల ఆస్తులు అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మ, నల్లగొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణతో పాటు ఎపిలోని కాందిశీకుల భూముల్లో కొన్నింటిని అమ్మి ఆ ఆదాయాన్ని కేంద్రం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాల్లో ఉన్న కాందిశీకుల ఆస్తులపై తమకే హక్కు ఉంటుందని అన్ని రాష్ట్రాలతో కేంద్రం పేర్కొనడంతో ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయన్న దానిపై ఆయా ప్రభుత్వాలు లెక్కలు తీస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాందిశీకుల భూ-ములకు సంబంధించి పక్కాగా లెక్కలు తీయడంతో పాటు ఆయా ఆస్తుల్లో ఎలాంటి క్రయ, విక్రయాలు జరగొద్దని అధికారులను ఆదేశించింది. అయినా కొందరు అక్రమార్కులు ఆయా ఆస్తులకు దొంగపత్రాలను సృష్టించి వాటిని అమ్మేస్తున్నారు.
2016లో పార్లమెంట్‌లో బిల్లు కేంద్రానికి హక్కులు
1947లో దేశ విభజన అనంతరం భారత దేశం నుంచి చాలా మంది ప్రజలు పాకిస్థాను వలస వెళ్లారు. వారి భూములు, ప్యాక్టరీలు, ఇళ్లు, ఇతర నిర్మాణాల స్థిరాస్తులను ఇక్కడే వదిలిపోయారు. ఈ ఆస్తులనే కాందిశీకుల ఆస్తులు (ఎనిమీ ప్రాపర్టీస్)గా పరిగణిస్తారు. దీనిని అనునరించి భారత రక్షణ చట్టం కింద రూపొందించిన డిఫెన్స్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా పాకిస్థాన్ జాతీయతను పొందిన వ్యక్తుల ఆస్తులు. కంపెనీలను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులను కేంద్రానికి బదలాయించాలంటూ 2016లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది.
గతంలో కాందిశీకుల ఆస్తుల అమ్మకంతో కేంద్రానికి రూ.3,400 కోట్లు
గతంలో కాందిశీకుల ఆస్తుల అమ్మకంతో కేంద్ర ప్రభుత్వం రూ.3,400 కోట్లు ఆర్జించింది. వీటిలో ఎక్కువగా బంగారం, షేర్లు వంటి చరాస్తులు ఉన్నాయి. భారత్-, పాకిస్థాన్ విభజన, 1962, 1965 యుద్ధ సమయాల్లో దేశాన్ని విడిచి పాకిస్థాన్, చైనా పౌరసత్వాలు తీసుకుని వెళ్లిన వారి ఆస్తులను అప్పట్లో ఈ జాబితాలో ప్రకటించారు. వాటిని కస్టోడీయన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా (సీఈపిఐ) సంరక్షణలో ఉంచారు. వాటిలో సీఈపీఐ రూ. 3,407.98 కోట్ల ఆస్తులను విక్రయిం చింది. అందులో 2018 నుంచి 2022 సంవత్సరాల మధ్య కాలంలో అమ్మకం చేసిన 152 సంస్థలకు చెందిన రూ.2,708.9 కోట్ల విలువ గల 7,52,83,287 షేర్లు, రూ. 699.08 కోట్ల మేర రెవెన్యూ రిసిప్టు ఉన్నాయి. వీటితోపాటు 1699.79 గ్రాముల బంగారం అమ్మకంతో రూ.49,14,071, వెండి ఆభరణాల విక్రయం ద్వారా రూ.10.92.175 కేంద్రానికి ఆదాయం సమకూరింది. అమ్మకం చేసిన వాటిలో 12.611 కాందిశీకుల ఆస్తులు ఉండగా అందులో 12,485 పాకిస్థాన్, 126 మంది చైనా పౌరులున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 6.255 ఆస్తులను, ఆంధ్రప్రదేశ్‌లో 1, తెలంగాణలో 158, తమిళనాడులో 67, కర్ణాటకలో 24 ఆస్తులను కేంద్రం విక్రయించింది.
రికార్డులు అందుబాటులో లేకపోవడంతో కబ్జాలు
ఇప్పటికే తెలంగాణలో కాందిశీకులకు సంబంధించిన ఆస్తుల వివరాలు సిసిఎల్‌ఏ సేకరించింది. వాస్తవానికి 2016లోనే ఈ భూములను అమ్మకానికి పెట్టాలని, కొంత భూమిని డబుల్ బెడ్రూం ఇళ్లకు కేటాయించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములను గుర్తించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. అయితే ఈ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో కొందరు కబ్జాదారులు వాటికి రికార్డులు సృష్టించి వాటిని కాజేయడానికి పక్కాగా స్కెచ్ వేసినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఆయా ఆస్తుల వివరాలను సైతం ప్రభుత్వం సేకరించి వాటిని ఎలా స్వాధీనం చేసుకోవాలన్న దానిపై అధికారులతో చర్చలు జరుపుతోంది. అంశం మళ్లీ తెరపైకి
రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలోని దాదాపు 15 వేల ఎకరాలకు పైగా కాందిశీకులకు సంబంధించిన భూములు ఉన్నట్లు సిసిఎల్‌ఏ ప్రాథమికంగా సమాచారం సేకరించింది.
వారసత్వ హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన వారసులు
వీటితోపాటు 5.11,68,011.20 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు (భవనాలు) నిర్మించినట్టు వీటి విలువ రూ.11,641 కోట్లకు పైగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. గతంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో దాదాపు 1300 ఎకరాలు తమవేనంటూ కేంద్ర హోంశాఖ ఆ గ్రామస్తులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు మేడ్చల్, దుండిగల్, శామీర్‌పేట, మహేశ్వరం, కందుకూరు, శేరిలింగంపల్లి మండలాల్లో, ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లోనూ కాందిశీకులు భూములు ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఈ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే చాలా చోట్ల ఈ ఆస్తులకు సంబంధించిన వివాదాలు కోర్టులో నడుస్తున్నాయి. తామే వారసులమంటూ కొందరు వారసత్వ హక్కుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఆయా వారసులతో కొందరు అక్రమార్కులు కుమ్మక్కై వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే శంషాబాద్‌కు చెందిన ఓ సబ్ రిజిస్ట్రార్ ఇలాంటి ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేయడంతో ఆయనపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడం గమనార్హం. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులను ఎలా క్యాన్సిల్ చేయాలి, వాటిని తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం అధికారులతో చర్చిస్తోంది.

Enemy Property Act

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News