Tuesday, May 14, 2024

కుప్పకూలిన రూట్ సేన

- Advertisement -
- Advertisement -

England 147 all out, Ashes first Test

చెలరేగిన కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్ మ్యాజిక్, ఇంగ్లండ్ 147 ఆలౌట్, యాషెస్ తొలి టెస్టు

బ్రిస్బేన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు చెలరేగి పోయారు. ఆతిథ్య ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు ఆరంభం నుంచే చెలరేగి పోయారు. ఓపెనర్ రోరి బర్న్‌ను స్టార్క్ తొలి బంతికే క్లీన్‌బౌల్డ్ చేశాడు. యాషెస్ చరిత్రలోనే ఇన్నింగ్స్ తొలి బంతికే ఓ వికెట్ పడిపోవడం ఇదే తొలి సారి. కొద్ది సేపటికే డేవిడ్ మలాన్ (6) కూడా ఔటయ్యాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో మలాన్ వెనుదిరిగాడు. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ జో రూట్ కూడా నిరాశ పరిచాడు. అతను ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా హాజిల్‌వుడ్‌కే దక్కింది. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. ఐదు పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

దీంతో ఇంగ్లండ్ 29 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ దశలో ఓపెనర్ హసీబ్ హమీద్ (25) కొద్ది సేపు పోరాటం చేశాడు. అయితే కుదురుగా ఆడుతున్న అతన్ని కమిన్స్ వెనక్కి పంపాడు. ఇక ఒలిపోప్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. కానీ 5 ఫోర్లతో 39 పరుగులు చేసి బట్లర్‌ను స్టార్క్ ఔట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. కొద్ది సేపటికే పోప్ కూడా ఔటయ్యాడు. 35 పరుగులు చేసిన అతన్ని కామెరూన్ గ్రీన్ ఔట్ చేశాడు. ఇక క్రిస్ వోక్స్ 4 ఫోర్లతో 21 పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 50.1 ఓవర్లలో 147 పరుగుల వద్ద ముగిసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ ఐదు, హాజిల్‌వుడ్, స్టార్క్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత వర్షం మొదలు కావడంతో ఆట ముందుకు సాగలేదు.

భారీ వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు ఆటను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఇంకా ఆరంభం కాలేదు. ఇక యాషెస్ సిరీస్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ఐదు టెస్టు జరుగనున్నాయి. కోవిడ్ కఠిన నిబంధనల నేపథ్యంలో సిరీస్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇంగ్లండ్‌ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల మధ్య సయోధ్య కుదరడంతో షెడ్యూల్ ప్రకారమే సిరీస్ ఆరంభమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News