Wednesday, May 1, 2024

టీమిండియా ఎంపికపై తీవ్ర విమర్శలు.. బిసిసిఐపై మాజీ క్రికెటర్ల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ముంబై: వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండియా వన్డే, టెస్టు జట్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ జట్ల ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిరీస్‌లో ఏకంగా నలుగురు ఓపెనర్లను ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లతో సహా విశ్లేషకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక టోర్నమెంట్‌లో విఫలమైనంత మాత్రాన చటేశ్వర్ పుజారా వంటి సీనియర్ క్రికెటర్‌ను జట్టులో నుంచి తప్పించడాన్ని పలువురు మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ తదితరులను విండీస్ సిరీస్‌కు దూరంగా ఉంచడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అలరిస్తున్న సర్ఫరాజ్‌పై మరోసారి సెలెక్టర్లు చిన్నచూపు చూడడాన్ని సంజయ్ మంజ్రేకర్, గౌతం గంభీర్, ఆకాశ్ చోప్రా తదితరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

దేశవాళీ క్రికెట్లో 79.65 సగటుతో అత్యంత నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్న సర్ఫరాజ్‌కు మరోసారి మొండిచెయ్యి చూపడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఆకాశ్ చోప్రా అయితే సెలెక్టర్లకు ముందు చూపు కొరవడిందని వ్యాఖ్యానించాడు. సర్ఫరాజ్, ఈశ్వరన్, పంచాల్ తదితరులు డొమెస్టిక్ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారని, అయినా వారికి జాతీయ జట్టులో చోటు ఇప్పటికీ అందని ద్రాక్షగానే మారిందన్నారు. ఐపిఎల్‌లో రాణించడం ప్రాతిపదికనే జట్టును ఎంపిక చేయడాన్ని వారు తప్పుపట్టారు. టెస్టులు, వన్డేలతో పోల్చితే టి20 చాలా ప్రత్యేకమైందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఐపిఎల్‌లో రాణించిన వారు వన్డేల్లో, టి20లలో సత్తా చాటడం అనుకున్నంత తేలికేం కాదని వారంటున్నారు. ఇక విండీస్ సిరీస్‌కు సీనియర్ బౌలర్ షమీని తప్పించడం కూడా పెద్ద పొరపాటని వారు పేర్కొంటున్నారు. బుమ్రా వంటి సీనియర్ ఆటగాడు జట్టుకు దూరమైన సమయంలో షమి సేవలు టీమిండియాకు చాలా కీలకమన్నాడు.

ఇలాంటి స్థితిలో అనుభవజ్ఞుడైన క్రికెటర్ షమి విశ్రాంతి పేరుతో పక్కన పెట్టడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. ఇక సీనియర్ బ్యాటర్ పుజారాను అవమానకరంగా జట్టులో నుంచి తొలగించడం సమంజసం కాదని హర్భజన్ వంటి స్టార్ క్రికెటర్ విమర్శించాడు. రుతురాజ్, యశస్వి తదితరులతో పోల్చితే పుజారా అత్యంత బలమైన బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అలాంటి క్రికెటర్‌ను ఫామ్ పేరిట జట్టుకు దూరంగా ఉంచడం తన దృష్టిలో సరికాదన్నాడు. ఇదిలావుంటే విండీస్‌తో జరిగే రెండు టెస్టులు, మూడు వన్డేల కోసం శుక్రవారం బిసిసిఐ టీమిండియాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో పలువురు యువ క్రికెటర్లకు చోటు కల్పించారు. అయితే జట్టు ఎంపికలో ఐపిఎల్‌లో ఆటగాళ్ల ఫామ్‌ను పరిగణలోకి తీసుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలెక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News