Sunday, April 28, 2024

రెండో జాబితాపై కాంగ్రెస్ మల్లగుల్లాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పూర్తయిన వెంటనే జాబితాను విడుదల చేస్తామని పార్టీ నేతలు ప్రకటించినప్పటికీ గురువారం కూడా మరోసారి సీఈసీ సమావేశం నిర్వహించింది. బుధవారం జరిగిన సీఈసీ సమావేశంలో 64 సీట్లకుగాను దాదాపు 50 సీట్లకుపైగా అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం. గురువారం మిగతా 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను గురువారం రాత్రి లేదా శుక్రవారం ఓకే చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ప్రధానంగా ఇద్దరు నేతలు పోటీ పడుతున్న సెగ్మెంట్లలో ఎవరిని ఫైనల్ చేయాలనే దానిపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. అందులోనూ పదికి పైగా నియోజకవర్గాలకు ఇద్దరు సమ ఉజ్జీలు ఉండడం, ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. స్క్రీనింగ్ కమిటీ రెండేసి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మొత్తం 64 నియోజకవర్గాలకు చెంది కసరత్తు పూర్తి అయినప్పటికీ చాలా నియోజకవర్గాలలో పోటీ అధికమై అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. గురువారం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు బిజీగా ఉండడంతో రెండోవిడత జాబితా ఓకే కాలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శుక్రవారం రాత్రి వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఈ జాబితాకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే దానిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ రెండోవిడత జాబితాలోనూ 40 మంది పేర్లను వెల్లడించి మిగిలిన వారి పేర్లను మూడో జాబితాలో వెల్లడించాలని అధిష్టానం సూచించినట్టుగా సమాచారం. ఆరు నియోజకవర్గాల్లోని ఒక్కో నియోజకవర్గానికి మూడు కంటే ఎక్కువ మంది ప్రధాన అభ్యర్థులు రేసులో ఉండడంతో ఆ నియోజకవర్గాల జాబితాను తరువాత ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఈ ఆరు నియోజకవర్గాలకు సంబంధించి కెసి వేణుగోపాల్ గురువారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ అయినట్టుగా సమాచారం.

అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి ఆశావహులు
గురువారం రాష్ట్రానికి చెందిన పలువురు ఆశావహులకు అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్న నేతలను ఏఐసిసి నేరుగా బుజ్జగిస్తోంది. అధిష్టానం పిలుపుమేరకు బుధవారం రాత్రే కొందరు నేతలు ఢిల్లీ చేరగా గురువారం మరి కొందరు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ పెద్దలను కలిశారు. పార్టీ సూచించిన అభ్యర్థికి సహకరించాలని, కచ్చితంగా న్యాయం చేస్తామని అధిష్టానం వారికి హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ అసంతృప్తి నేతలతో టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్‌లు భేటీ అయ్యారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన భూపతిరెడ్డి నర్సారెడ్డి, గోషామహల్ నుంచి టికెట్ ఆశించిన మెట్టు సాయికుమార్‌లతో మల్లు రవి టీమ్ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో టిక్కెట్లు రాని నేతలకు పదవులు లభిస్తాయని హామీలతో నేతలను సమన్వయం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కుత్బుల్లాపూర్ నుంచి కొలన్ హన్మంతరెడ్డికి టిక్కెట్ రాగా గోషామహల్ నుంచి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావుకు హైకమాండ్ టిక్కెట్ కేటాయించింది.

టికెట్ ఆశిస్తున్న నేతలతో
ఢిల్లీ చేరుకున్న పలువురు కాంగ్రెస్ ఆశావహులు టిక్కెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అటు తొలి జాబితా విడుదలైన తర్వాత పలువురు అసంతృప్తులు పార్టీకి గుడై చెప్పడంతో అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా కాంగ్రెస్ అధిష్టానంతోపాటు పిసిసి నేతలు టిక్కెట్ ఆశిస్తోన్న నేతలతో చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఖరారు అంశం కాంగ్రెస్ నేతలకు పెద్ద ఛాలెంజ్‌గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో విడత జాబితాకు సంబంధించి 15 రోజులుగా సస్పెన్స్ కొనసాగుతూ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News