Tuesday, May 7, 2024

కొవిషీల్డ్ గడువు పెంపుదల సబబే

- Advertisement -
- Advertisement -

Extended gap between 2 doses of Covishield reasonable approach: Fauci

భారత్ సర్కారుకు ఫౌచీ కితాబు
వనరులు వాడుకుంటే అందరికీ టీకా
ఇతరుల సాయంతోనే దేశానికి మేలు

వాషింగ్టన్ : భారతదేశంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోస్‌ల మధ్య వ్యవధిని పొడిగించడం సరైన నిర్ణయమే అని అమెరికా వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ తెలిపారు. భారత ప్రభుత్వం నిపుణుల సలహాలు, సిఫార్సుల మేరకు ఈ విషయంలో తగు విధంగానే వ్యవహరించిందని తెలిపారు. డోస్‌ల మధ్య అంతరాన్ని పెంచడం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎటువంటి ప్రతికూలత ఉండబోదని ప్రపంచ స్థాయి వైద్య ప్రముఖుడుగా పేరొందిన డాక్టర్ ఫౌచీ వివరించారు. ప్రస్తుత నిర్ణయం సహేతుకమైనదే అని అన్నారు. ఇందులో తప్పుపట్టాల్సిందేమీ లేదని వైట్‌హౌస్ ప్రధాన వైద్య సలహాదారు అయిన ఫౌచీ చెప్పారు. టీకాలు అందరికీ అందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యధిక శాతం మంది కనీసం ఒక్క డోస్‌ను తీసుకున్నా కరోనా వైరస్ నియంత్రణంలో ఇది కీలక మలుపు అవుతుందని విశదీకరించారు. ఎక్కువ మందికి ఒక్కడోస్ అయినా అందేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దారితీస్తుందని, రెండో డోస్‌కు సమయం ఎక్కువగా ఉండటం వల్ల తొలిడోస్ ఎక్కువ మందికి అందుతుందని తెలిపారు.

కొవిషీల్డ్ డోస్‌ల మధ్య ఎడంను పెంచుతూ గురువారం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న ఆరు నుంచి 8 వారాల వ్యవధిని ఇప్పుడు 12 నుంచి 16 వారాలకు పొడిగించారు. భారతదేశం ఇతర దేశాల సాయం తీసుకుని దేశంలో వ్యాక్సినేషన్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సి ఉందని డాక్టర్ ఫౌచీ చెప్పారు. ఇతర దేశాలతో సహకార ధోరణిలో ఉండటం వల్ల టీకా లక్షం తొందరగా నెరవేరుతుందని తేల్చిచెప్పారు. ప్రపంచంలోనే ఔషధ ఉత్పత్తిలో ఇండియా పేరుగాంచిందని, సంబంధిత వనరులను సొంత ప్రజల వినియోగానికి భారత ప్రభుత్వం ఇప్పుడు విరివిగా వాడుకోవల్సి ఉందని వ్యాఖ్యానించారు. భారత్ అత్యధిక జనాభా దేశం, దాదాపుగా 140 కోట్ల జనాభా ఉంది. పూర్తిస్థాయి వ్యాక్సిన్లు పొందిన వారు అతి తక్కువ శాతంలో ఉన్నారు. దాదాపుగా పది శాతం అంతకు మించిన జనం ఇప్పటివరకూ ఒక్కడోస్ టీకా కూడా పొందలేదని ఫౌచీ చెప్పారు. ఇతర దేశాలతో కలిసి వ్యవహరిస్తే సాధ్యమైనంత త్వరగా ఎక్కువ మందికి టీకాలు వేసేందుకు వీలేర్పడుతుందని డాక్టర్ ఫౌచీ చెప్పారు. భారత్‌కు అత్యంత అపరిమిత వనరులు ఉన్నాయి. వీటిని సరిగ్గా వాడుకుంటే ప్రత్యేకించి అక్కడి వనరులను ప్రజల కోసం వాడుకోవడం జరిగితే మంచిదని వ్యాఖ్యానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News