ఇరవయ్యవ శతాబ్దంలో అత్యంత పాఠకాదరణ పొందిన రచయితల్లో ప్రముఖుడు ఫ్రెంచి రచయిత జార్జెస్ సిమినోన్. తన పేరుతో 192 నవలలు, ఇంకో 200 నవలలు రకరకాల కలం పేర్లతోనూ రాశారు. 1903లో బెల్జియంలో జన్మించిన ఈయన 1989లో కాలం చేసేటప్పటికీ అతను రాసిన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల (50కోట్ల కాపీలు) కాపీలకు పైగా అమ్ముడుపోయాయి. ఈయన పుస్తకాల ఆధారంగా 171 సినిమా లు, టెలివిజన్ చిత్రాలు తీశారు. ఈ నవలలు కాక కథలు, నాలుగు స్వీయ చరిత్రలు, తన జ్ఞాపకాల ఆధారంగా ఇంకో 21 పుస్తకాలు రాశారు. జర్నలిస్టుగా ఉద్యోగం మొదలు పెట్టిన సిమినోన్ రోజుకు ఎనభై పేజీలు రాసేవారు. అంత వేగంగా ఎలా రాస్తున్నారని అడిగిన వాళ్ళకు ఆయన ఇచ్చిన సమాధానం – నిదానంగా రాయడానికి కావల్సిన తెలివితేటలు, ఆలోచనాశక్తి తనకు లేవని,ఒకసారి నవల మొదలెడితే పదకొండు నించి పదిహేను రోజుల్లో పూర్తిచేసి ప్రచురణకు పంపించేవారు.
ఆయన సృష్టించిన డిటెక్టివ్ ‘జూల్స్ మిగ్రే’ పాత్ర అత్యంత ప్రజాదరణ పొందింది. మిగ్రే ప్రధాన పాత్రగా 75 నవలలు, 28 కథలు రాశారు. షెర్లాక్ హోమ్స్, పోయిరో పాత్రల్లా పాఠకుల మనస్సులో నిలిచిపోయిన పాత్ర ‘మిగ్రే’. మిగ్రే నవలల్లో ఏదీ 200 పేజీలకంటే మించదు. రచనాశైలి సరళంగా ఉంటుంది. ఆయన తన రచనల్లో వాడిన వేర్వేరు పదాల సంఖ్య 2వేల పదాలకు కంటే మించదంటారు. షెర్లాక్ హోమ్స్ ఇతర డిటెక్టివ్‌లా కాక అపరాధ పరిశోధనలో మిగ్రేది ప్రత్యేకమైన శైలి. నేరస్థుడి మానసిక పరిస్థితి, నేరానికి దారితీసి న పరిస్థితులు, వాతావరణం మీద ఎక్కువ ధ్యాసపెట్టి పరిశోధిస్తాడు. నేరస్థుడిని బాధ్యుణ్ణి చేయడం కంటే అర్థం చేసుకోడానికి ప్రయత్ని స్తాడు డిటెక్టివ్ మిగ్రే. న్యాయ వ్యవస్థలో, రక్షణ వ్యవస్థలో రాజకీయాల జోక్యం, ధనిక వర్గాల నేర ప్రవృత్తి వంటి అంశాలను స్పృశిస్తాయి మిగ్రే నవలలు. ఎక్కువ నవలలు పారిస్ నగరం మాధ్యమంగా రాశారు రచయిత.
Also Read : కొత్త ధరలొచ్చేశాయ్
ఉదాహరణకు ఒక సంపన్నుల ఇంట్లో జరిగిన ఓ నేరపూరిత సంఘటనను ఆధారంగా చేసుకుని రాసిన నవల ‘మిగ్రే మొదటి కేసు’. జుస్టిన్ మినార్డ్ అనే ఒక ఫ్లూటు వాయించే కళాకారుడు అర్థరాత్రి ఒంటరిగా రోడ్డు మీద నడుస్తూ జాందో బాల్తజార్ అనే ధనికుడి ఇంట్లోనుంచి ఒక ఆడమనిషి గట్టిగా కేక పెట్టడం వింటా డు. ఇంట్లోకి వెళ్ళడానికి అతను ప్రయత్ని స్తే ఇంటి బట్లర్ బయటికి తోసేస్తాడు. దెబ్బలు తగుల్తాయి. ఇదంతా వెళ్ళి పోలీసు స్టేషన్లో రిపోర్ట్ చేస్తే, ఆ కేసు అప్పుడప్పుడే ఉద్యోగంలో చేరి శిక్షణ పూర్తిచేసుకుంటున్న జూల్స్ మిగ్రే పరిశీలనకు వస్తుంది. మినార్డ్ చెప్పిన వివరాలను బట్టి అతన్ని నమ్ముతాడు మిగ్రే. పరిశోధిస్తూ వెళ్తుంటే విచిత్రమైన విషయాలు బయటపడతాయి. మిగ్రే పై అధికారి లెబ్రే, మిగ్రేకు చేయూతనిచ్చేందుకు సుముఖంగా కనపడడు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని నేరాన్ని చేధిస్తాడు మిగ్రే.
సిమినోన్ రాసిన డ్బ్బై ఐదు మిగ్రే నవలలని ఇంగ్లీష్‌లోకి అనువదించి ప్రచురించింది పెంగ్విన్ సంస్థ. ఈ అనువాదకుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ప్రముఖ అనువాదకురాలు రాస్ స్వాట్జ్ గురించి. మిగ్రే మొదటి కేసు నవలను ఇంగ్లీష్‌లోకి అనువదించింది ఈమే. రాస్ స్వాట్జ్ ఫ్రెంచినించి ఇంగ్లీష్ లోకి వందకు పైగా పుస్తకాలను అనువదించింది. ప్రపంచవ్యాప్తంగా అనువాదాల మీద ఆమె అనేకానేక వర్కుషాపులు నిర్వహించింది.
ఈ మధ్యనే TILT పేరుతో ఛాయ, అజు పబ్లికేషన్స్ సంయుక్తంగా నిర్వహించిన తెలుగు నించి ఇంగ్లీష్ అనువాదపు ఆరునెలల వర్క్ షాప్‌లను నిర్వహించింది. యూకే ట్రాన్సిలేట ర్స్ అసోసియేషన్, బ్రిటిష్ సెంటర్ ఫర్ లిటరరీ ట్రాన్సిలేషన్, ఇంగ్లీష్ పెన్ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో, బాధ్యతాయుతమైన అనేక పదవుల్ని పోషించింది. ప్రస్తుతం బ్రిస్టల్ ట్రాన్సిలేషన్ సమ్మర్ స్కూల్‌కి ఆమె డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
‘మిగ్రే మొదటి కేసు’ నవల త్వరలో ఛాయా పబ్లికేషన్స్ ద్వారా తెలుగులోకి వస్తుంది.
- హర్షణీయం బృందం
ఫ్రెంచి రయయిత సిమినోన్
అనువాదకురాలు రాస్ స్వాట్జ్