Sunday, April 28, 2024

రెండు సందర్భాలు

- Advertisement -
- Advertisement -

Controversy between the Central govt and Social Media

కాలం గిర్రున తిరిగి రెండు ప్రముఖ సందర్భాలను గుర్తు చేసుకోవలసిన అగత్యాన్ని కలిగించింది. ఇందులో ఒకటి, ఏడేళ్లు నిండిన ప్రధాని నరేంద్ర మోడీ పాలన, రెండోది, మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ప్రారంభించిన మహోద్యమానికి ఆరు మాసాలు పూర్తి కావడం. 2004 నుంచి 2014 వరకు వరసగా రెండు విడతలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వాన్ని ఓడించి మోడీ నాయకత్వంలో బిజెపి (ఎన్‌డిఎ) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 30వ తేదీకి ఏడేళ్లు నిండుతాయి. ప్రభుత్వ నిర్వహణలోని వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థ నుంచి, కమిషన్ ఏజెంట్ల నుంచి రైతులకు విముక్తి కలిగించబోతున్నామంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెంటు ఆమోదాన్ని ఆదరాబాదరాగా పొంది మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చింది.

వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ల పాదాక్రాంతం చేయడానికే ఈ చట్టాలను తెచ్చారంటూ వాటి సమూల రద్దును కోరుతూ రైతులు చేపట్టిన చరిత్రాత్మకమైన ఉద్యమానికి గురువారం నాటితో ఆరు మాసాలయ్యాయి. మోడీ ఏడేళ్ల పాలన, ఒక్క రైతు ఉద్యమ సుదీర్ఘతకే కాకుండా ఇంకా అనేక ప్రజా ఉద్యమాలూ, నిరసనలతోనూ, దేశం అంతకు ముందెన్నడూ ఎరుగని స్థాయి వైఫల్యాలతోనూ ముడిపడి ఉన్నది. యుపిఎ పాలనలోని అవినీతిని గట్టిగా ఎత్తిచూపి, అన్నా హజారే జనలోక్‌పాల్ ఉద్యమాన్ని కూడా ఉపయోగించుకొని ఆ కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అవినీతిని అరికట్టలేకపోయింది. కనీసం శక్తివంతమైన లోక్ పాల్ వ్యవస్థను కూడా నెలకొల్పలేదు. ఏడేళ్ల ఎన్‌డిఎ పాలనను తరచి చూస్తే హిందుత్వ అజెండాను, గతంలో వివాదాస్పద అంశాలుగా పరిగణించి పక్కన పెట్టిన వాటిని అమల్లోకి తేవడం పట్ల చూపించిన శ్రద్ధను ప్రజల నిరసనలను, మనోభావాలను పట్టించుకొని జనహిత నిర్ణయాలు తీసుకోడం పట్ల చూపలేదనే విషయం స్పష్టపడుతుంది.

అయోధ్యలో ఆలయ నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు, దాని రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలక ప్రాంతాలుగా విభజించడం, అసోంలోని విదేశీయుల గుర్తింపు, బహిష్కరణ అవకతవక ప్రక్రియ వంటి వాటికిచ్చిన ప్రాధాన్యాన్ని ప్రజల సమస్యలైన అధిక ధరలు, నిరుద్యోగం, కొవిడ్ విజృంభణ వంటి వాటిని ఎదుర్కోడానికి ఇవ్వలేదు. కొవిడ్ సంక్షోభ తీవ్రత దృష్టా మోడీ ప్రభుత్వ సప్త వర్ష సంబురాలను జరుపుకోబోవడం లేదని ప్రకటించి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఒక మంచి పని చేశారు. అయితే ఇందుకు గత నెలలో జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా బెంగాల్, తమిళనాడు, కేరళలలో బిజెపి ఘోర పరాజయం పాలు కావడమే అసలు కారణమని భావించాలి. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ బాహువులు చాచుకొని ఆత్మస్తుతికి పాల్పడి ఉంటే జుగుప్సాకరంగా ఉండేది. దేశ ప్రజలు లోక్‌సభలో స్వయంగా బిజెపికి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి సుస్థిర పాలనా దండాన్ని అందించినందుకు ఈ ఏడేళ్లలో మోడీ ఎన్నో జనహిత నిర్ణయాలు గైకొని దేశాన్ని ఎక్కడికో తీసుకునిపోయి ఉండవలసింది.

పెద్దనోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అవకతవక అమలు వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థను అత్యధమ స్థాయికి తొక్కేశారు. ఉద్యమం చేపట్టి ఆరు మాసాలు గడిచిన సందర్భంగా 40 సంఘాల ఆధ్వర్యంలో రైతులు గురువారం నాడు దేశ వ్యాప్త విషాద నిరసన దినాన్ని (బ్లాక్ డే) పాటించారు. దేశంలోని సగానికి పైగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. ఏడాదికి 10,000 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. 1988లో మహేంద్ర సింగ్ తికాయత్ (బికెయు భారతీయ కిసాన్ యూనియన్) నాయకత్వంలో ఢిల్లీ బోట్ క్లబ్ వద్ద లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లతో వచ్చి అతి పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో ఆరు మాసాలుగా సాగుతున్న రైతు ఉద్యమం అంతకంటే బలమైనది. దేశంలోని రైతుల, వ్యవసాయ కార్మికుల ఉనికికే ముప్పు తలపెట్టిన మూడు వ్యవసాయ చట్టాల అంతు చూస్తేగాని కదలబోమని రైతులు భీష్మించుకున్నారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలు దేశంలో గల 15 కోట్ల మంది రైతులను, మరి పద్నాలుగున్నర కోట్ల మంది వ్యవసాయ కార్మికులను దిక్కులేని వారుగా మారుస్తాయి.

కార్పొరేట్ శక్తుల మేలే ప్రజల మేలని ప్రధాని మోడీ నమ్ముతున్నారు. అది ముమ్మాటికీ తప్పు అని ప్రజలు పదేపదే ఉద్యమాల ద్వారా, సమ్మెల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు. ప్రజలను అనునిత్యం అశాంతిలో, ఆందోళనలో ఉంచడం ద్వారా ఏ ప్రభుత్వమూ మంచి పాలనను అందించజాలదు.పార్లమెంటులో తిరుగులేని మెజారిటీని, సుస్థిరమైన పాలనా దండాన్ని ఒకే పార్టీకి కట్టబెట్టడం, అందులోనూ ప్రజాస్వామ్య వ్యతిరేక సిద్ధాంతాలు, విధానాలు గల పార్టీకి అప్పజెప్పడం ప్రజలకు శ్రేయస్కరం కాదని ప్రధాని మోడీ ఏడేళ్ల పాలన చాటింది అనడం ఆక్షేపణీయం కాదు. ఇప్పటికైనా మోడీ తన వైఖరిని మార్చుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణమైన పాలనను ఇవ్వడం ప్రారంభిస్తారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News