Saturday, April 27, 2024

నెహ్రూ స్వావలంబ భారతం

- Advertisement -
- Advertisement -

 Gandhians socialists communists in National Movement

గాంధీయులు, సోషలిస్టులు, కమ్యూనిస్టులు కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు. గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నాయకులు గుడ్డి హిందువులు. సంఘ్ శ్వేతజాతి పాలనను సమర్థించింది. ఆంగ్లేయులు మతాలతో స్వాతంత్య్ర పోరాటాన్ని బలహీనపర్చారు. లౌకిక భారత నిర్మాణంపై ముస్లింల నమ్మకం తగ్గింది. ఈ దశలో దేశ విభజనతో భారత్ స్వతంత్రమైంది.
‘పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్య సమస్యల నిర్మూలనకు, శాస్త్రీయ ధోరణిలో వ్యవసాయ, పరిశ్రమల ఉత్పత్తి, నిరుపేదల వరకూ పంపిణీ సామ్యవాద పద్ధతుల్లో పెంచాలి. దేశ పునర్నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక, దేశ సమైక్యత, స్థానిక సాంస్కృతిక స్వతంత్రత, స్వయంప్రతిపత్తులు, భూసంస్కరణలు, గ్రామీణ రుణ విముక్తి, తక్కువ వడ్డీ రుణ సౌకర్యం, సహకార రంగ విస్తరణ, వ్యవసాయరంగ ఆధునీకరణ పేదరిక నిర్మూలన మూల సూత్రాలు.

ప్రభుత్వ యాజమాన్యంలో పారిశ్రామిక అభివృద్ధి అనివార్యం. కుటీర పరిశ్రమలు పునరుద్ధరించాలి. ‘1938లో కాంగ్రెస్ అధ్యక్షులు సుభాస్ చంద్ర బోస్ సందేశం. నెహ్రూ అధ్యక్షతన ప్రణాళిక సంఘం ఏర్పరిచారు. నెహ్రూ దార్శనికత: ప్రణాళిక సంఘంలో కార్మిక ప్రతినిధి ఉండాలి. కనీస జీవనస్థాయికి హామీనివ్వాలి. పదేళ్లలో జాతీయ ఆదాయం, సంపద 2, 3 రెట్లు పెరగాలి. ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ఏడాదికి 30 గజాల బట్ట, రోజుకు 2,400 2,800 కిలో క్యాలరీల ఆహారం అందించాలి. 100 చ.అడుగుల ఇంటి స్థలాన్నివ్వాలి. స్వయం సమృద్ధి, గ్రామీణ మార్కెట్ల విస్తరణ్, పరిశ్రమలకు ముడి సరుకు, శ్రామికుల అందుబాటు లక్ష్యంగా వ్యవసాయం వృద్ధి చేయాలి.

నిరక్షరతా నిర్మూలన, అంటువ్యాధుల అంతం, ఆరోగ్య సౌకర్యాల విస్తృతి, ఆయుర్ధాయ పెంపుకు కృషి చేయాలి. సామాన్యుని జీవన ప్రమాణాల మెరుగుదలకు ఆర్థికాభివృద్ధి ఉపయోగపడాలి. కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు, నిరుద్యోగ బీమా, కనీస వేతనాలు చట్టబద్ధంగా లభించాలి. ప్రాంతీయ అసమానతలు, వేర్పాటువాదశక్తులను రూపుమాపడానికి అనువైన కేంద్రాల్లో పరిశ్రమలు స్థాపించాలి. న్యాయబద్ధంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు ప్రగతి ఫలాలు పంచాలి. పీడిత వర్గాలకు ఉద్యోగాల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. స్వతంత్ర ఆర్థికవ్యవస్థ నిర్మించాలి. స్వయంసమృద్ధికి మాత్రమే ఆధునిక సాంకేతికతలు దిగుమతి చేసుకోవాలి. రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. భూసంస్కరణలు కఠినంగా అమలు చేయాలి. వనరుల హేతుబద్ధ వినియోగానికి సహకార వ్యవసాయం పాటించాలి.

స్వతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ సోషలిజం ప్రభావంతో ఆధునిక భారత శిల్పి అయ్యారు. స్వాతంత్య్రం తర్వాత గందరగోళ పరిస్థితులను సరిదిద్దారు. సమర్థ విదేశీ విధానం అమలు చేశారు. పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలన్నింటితో సహకార విధానం అవలంబించారు. అలీనోద్యమ వ్యవస్థాపకుల్లో నెహ్రూ ఒకరు. చైనాతో శాంతియుత సహజీవన ఐదు సూత్రాల పంచశీల పాటించారు. వలసవాదం, జాత్యహంకారం, వివక్షతలకు అతీతంగా మెలిగారు. ఐక్యరాజ్యసమితి బలోపేతానికి మద్దతిచ్చారు. బహుళార్థసాధక ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్నారు.

దేవాలయాలు ప్రభుత్వ ప్రణాళికల్లో లేవు. రష్యా సహాయంతో భిలాయి, బొకారొ ఉక్కు కర్మాగారాలు, తూర్పు యూరపు సోషలిస్ట్ దేశాల, పశ్చిమ దేశాల సహకారంతో కొన్ని పరిశ్రమలు స్థాపించారు. పూర్వానుభవంతో 15.03.1950న ప్రణాళిక సంఘం ఏర్పరచారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారు. 1950, 60 దశకాల్లో ఈ ఆశయ సాధనకు పరిశోధన పత్రాలు, గ్రంధాలు రచించారు. సోషలిష్ట్ రష్యా పంథాలో పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. లఘు, కుటీర పరిశ్రమలు స్థాపించారు. నెహ్రూ ప్రోద్బలంతో మంత్రి, కెమికల్ ఇంజినీర్, కేశవ్ దేవ్ మాలవీయ ప్రభుత్వ సంస్థ ‘చమురు, సహజ వాయువుల మండలి’ స్థాపించారు. పలు చోట్ల చమురు నిల్వలు శోధించారు. సోషలిస్ట్ పొడగిట్టని మోడీ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి (National Institute of Transforming India-NITI) ఆయోగ్ ఏర్పరిచారు.

గాంధీ హత్యకు తమను నిషేధించిన విపక్ష వల్లభ పటేల్‌ను సంఘ్ ఎందుకు కీర్తిస్తోంది? పటేల్ సనాతనాచారి. స్వతంత్ర భారతానికి ప్రగతిశీల విధానాల నెహ్రూ అవసరమని గాంధీ భావన. నెహ్రూ భౌతికవాది, అవిశ్వాసి. ఆయన వల్లనే భారత్ లౌకికమయిందని సంఘ్ అభిప్రాయం. పటేల్ ప్రధాని అయ్యుంటే దేశాన్ని హిందు రాజ్యంగా ప్రకటించేవాడని వారి అపోహ. ‘సంపూరక స్వభావాల, సుగుణాల వ్యక్తిత్వాల నెహ్రూ, పటేల్‌లు నాయకులుగా లభించడం దేశ సౌభాగ్యం. సంపూర్ణ మానవతావాదం, వాస్తవికత ఈ మహానుభావుల అద్భుత, అసాధారణ గుణసంపద. నెహ్రూ దశదిశల ప్రకాశించే సానబట్టిన వజ్రం.

పటేల్ అంతర్గత విలువల ముడి వజ్రం. ‘ఆల్ త్రూ ది గాంధియన్ ఎర’ పుస్తకంలో ప్రముఖ పత్రకారుడు ఎ.ఎస్. అయ్యంగార్ వివరించారు. ఇది కల్తీ లేని, భావజాల మాయాజాల ప్రభావాలకు లొంగని నిష్పక్షపాత నిజం. విదేశీ విధానంలో నెహ్రూ తప్పు చేశాడని సంఘ్ నిందిస్తోంది. పటేల్ ను స్వపక్షం ఉపేక్షించింది. విపక్ష సంఘ్ సొంతం చేసుకుంది. జీవితాంతం కాంగ్రెస్‌లో కలిసి బతికిన ఈ రాజనీతిజ్ఞులు ఆజన్మశత్రువులని వక్రీకరిస్తోంది. పటేల్ అంత్యక్రియలకు నెహ్రూ హాజరుకాలేదన్న తప్పుడు ప్రచారం చేస్తోంది. పటేల్‌ను చూడకుండా, సంప్రదించకుండా రోజు గడిచేదికాదని నెహ్రూ, నెహ్రూను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోలేదని పటేల్ బహిరంగంగా ప్రకటించారు. మైనారిటీలకు, స్త్రీలకు సమాన హక్కులు, సార్వత్రిక వయోజన ఓటు హక్కులివ్వడంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. సంస్థానాల విలీనానికి, దళితుల రిజర్వేషన్లకు పటేల్ విశేష కృషి చేశారు. ఇద్దరూ సమైక్యత సమగ్రతల దేశ ప్రేమికులు. వీరిలో ఎవరిని తక్కువ చేసినా భరతమాతకు అవమానమే. ఆంగ్లేయ పాలనలో దేశం సామ్రాజ్యవాద దోపిడీకి గురైంది. సమాజం, దేశం మత విభజనతో చీలాయి. దేశ పునర్నిర్మాణానికి నెహ్రూ 1946, 47ల్లో జాతీయ ప్రభుత్వాలు ఏర్పరిచారు. కాంగ్రెస్ నేతలతో పాటు ఆంబేడ్కర్, జస్టిస్ పార్టీ నాయకులు షణ్ముగం చెట్టి, శ్వేతజాతి పాలనను సమర్థించిన మతోన్మాద హిందు మహాసభ ప్రముఖుడు శ్యామప్రసాద్ ముఖర్జీ, అకాలీదళ్ బల్దేవ్ సింఘ్, వ్యాపారవేత్త భాభా, అధికారి గోపాల స్వామి అయ్యంగార్ వాటిలో ఉన్నారు. వీరంతా కాంగ్రెస్ తీవ్ర విమర్శకులే.

వైస్రాయ్‌ల సేవలో తరించిన బిఎన్ రావు, విపి మీనన్, సుకుమార్ సేన్, తర్లోక్ సింఘ్ లను దేశ నిర్మాణంలో కలుపుకున్నారు. కాంగ్రెస్ వాది అయిన కమ్యూనిస్టు ప్రణాళికతో సోషలిజానికి ప్రయత్నించిన నెహ్రూ నుండి దేశభక్తి, దార్శనికత నేర్చుకోవాలి. పటేల్, నెహ్రూల ప్రజా పథకాలు కొనసాగించాలి. అధోగతిలో తామూ సోషలిజం ప్రకటించిన సంగతి సంఘ్ మరువరాదు. కమ్యూనిస్టు వ్యతిరేకతతో సుపరిపాలన అవకాశం, సామాన్యజన భావజాలాలను వ్యతిరేకించరాదు. అరాచకాల ఎన్నికల్లో గెలుపు రాజకీయం. దేశభవిష్యత్తుకు పాటుపడటం రాజనీతి. ‘పటేల్ హీరో నెహ్రూ జీరో’ అన్న ప్రచారం సంఘ్ కుట్ర. గాంధీ, నెహ్రూల వారసత్వాన్ని మంటగలపడం తో ప్రయోజనం లేదు. లౌకికత్వ, ప్రజాస్వామ్య, రాజ్యాంగాల బలహీనత, సంఘ్ రాజకీయలబ్ధి తప్ప. నిన్నటి తరానికి నేటి తరం నీళ్ళొదిలితే నేటితరంపై రేపటి తరం బురద జల్లుతుంది.

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News