Friday, May 3, 2024

మళ్లీ రైతు ఆందోళన!

- Advertisement -
- Advertisement -

Farmers strike against modi govt

రైతు మళ్ళీ రోడ్డెక్కాడు. నిరుద్యోగ సమస్యపైనా ఇంకా ఆచరణకు నోచుకోని తమ గత ఉద్యమ డిమాండ్లపైనా రైతులు ఢిల్లీలో సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ‘మహా పంచాయత్’ నిర్వహించారు. నలభై రైతు సంఘాల మహావేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎమ్) దీనికి నాయకత్వం వహిస్తున్నది. ఎస్‌కెఎమ్ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి వద్ద 75 గంటల బైఠాయింపు నిరసన చోటు చేసుకొన్నది. గత అక్టోబర్ 3న అక్కడ రైతులను కార్లతో తొక్కించిన ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారుడు ఆశిష్ మిశ్రాను మళ్ళీ అరెస్టు చేయాలనే డిమాండ్‌పై ఈ బైఠాయింపు జరిగింది. అతడిని ఆలస్యంగా అక్టోబర్ 11న అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఆ ఘటనలో, ఆందోళనలో పాల్గొని వస్తున్న రైతు బృందం పైకి మూడు కార్లు దూసుకుపోగా నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతి చెందారు. ఈ మూడు కార్లలో ఒకటి మంత్రి తేనీకి చెందినది. అందులో ఆయన కుమారుడు ఆశిష్ కూడా వున్నట్టు తేలింది. అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈసారి రైతులు ప్రధానంగా నిరుద్యోగ సమస్యపై ఆందోళన చేపట్టాలనుకొన్నారు. ఇంతలోనే గత ఏడాది ఆందోళన సమయంలో ప్రభుత్వం హామీ ఇచ్చి అటకెక్కించిన మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, తదితర డిమాండ్లతో పంజాబ్ రైతుల ఆందోళన మొదలైంది. ఆ డిమాండ్‌ను ఇతర మరికొన్ని తమ అపరిష్కృత సమస్యలను కూడా చేర్చి ఢిల్లీలో సోమవారం నాడు ఆందోళన జరిపారు. 2020-2021లో మూడు కార్పొరేట్ వ్యవసాయ చట్టాలు, విద్యుత్తు సంస్కరణల బిల్లు రద్దుకోసం ఢిల్లీ మహానగర సరిహద్దుల్లో ఏడాది పాటు జరిగిన చరిత్రాత్మక రైతు ఉద్యమం తెలిసినదే.

ఆ ఉద్యమంలో 700 మందికి పైగా రైతు ఆందోళనకారులు వీర మరణం పొందిన సంగతీ తెలుసు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎట్టకేలకు ప్రధాని మోడీ దిగివచ్చి ఆ మూడు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. అయితే మెరక రైతుల ప్రాణాలతో చెలగాటమాడే విద్యుత్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల అభ్యంతరాలు ఆందోళన తర్వాత ఈ బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపించారు గాని అది రైతుల మెడ మీద సునిశితమైన కత్తిలా వేల్లాడుతుంది. ఎప్పుడైనా వారి మీద దాడి చేస్తుంది. వ్యవసాయానికి విద్యుత్ సాయం వెనుక ఎన్నో సముద్రాల రైతు కన్నీళ్లున్నాయి. పల్లపు ప్రాంత రైతుకు వాలు ప్రవాహాల నీరు సునాయాసంగా లభిస్తుంటే, మెరకు రైతు సాగు నీరు కోసం నానాకష్టాలు పడుతున్న నేపథ్యంలో బోర్ల మోటార్లకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం ఎంతో మానవీయ చర్య. తెలంగాణలో ఈ సౌకర్యం 24 గంటలు కొనసాగుతుంది. ఈ విద్యుత్తుకు రైతు నుంచి ముక్కు పిండి వసూలు చేయాలని మోటార్లకు మీటర్లు బిగించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించుకున్నది.

మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల పడగ నీడలోకి నెట్టేసి రైతుల విషాదాశ్రువుల్లో స్నానం చేయాలన్న దుర్బుద్ధి గూడుకట్టుకొన్న ప్రధాని మోడీ ప్రభుత్వం మద్దతు ధరల వ్యవస్థకు చట్టబద్ధత కల్పించడానికి బొత్తిగా సిద్ధంగా లేదు. భవిష్యత్తులో ఏ మాత్రం సందు దొరికినా మొత్తంగా రైతులను కార్పొరేట్లకు బలి ఇవ్వాలని, పంజాబ్, హర్యానాలలో వేళ్లూనుకొన్న మండీలకు మంగళం పాడాలని వాటికి మూలంలో గల మద్దతు ధరలకు పూర్తిగా తెర దించాలని చూస్తున్నది. అటువంటప్పుడు వాటిని శాసనబద్ధం చేయడం, వాణిజ్య పంటలకు కూడా మద్దతు ధరలు కల్పించడం అది కలలో సైతం చేయదు. మద్దతు ధరను చట్టబద్ధం చేస్తామని రైతు ఉద్యమ సారధులకు హామీ ఇవ్వలేదని ఇటీవలే ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటించింది. అలాగే గత ఉద్యమంలో తమపై మోపిన కేసులను ఉపసంహరించుకుంటామని ఇచ్చిన హామీని అమలు చేయకపోడం రైతులను తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురి చేస్తున్నది. అందుచేత రైతులు మరో మహోద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఎప్పటి మాదిరిగానే మొన్న సోమవారం నాడు ప్రభుత్వం పోలీస్ బలగాలను భారీగా మోహరింపజేసింది. ఆందోళనలో పాల్గోడానికి వచ్చిన భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్‌ను ఆదివారం నాడు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 114 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించిన పోలీసులు రైతులను జంతర్ మంతర్‌లో ప్రవేశించనీయలేదని చెప్పారు. ప్రభుత్వం ఇటువంటి కవ్వింపు చర్యలు మానుకొని రైతు నాయకులతో నిజాయితీ కూడిన చర్చలు జరపాలి. మళ్ళీ మరో ఉద్యమం రగలకుండా చూసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News