Friday, May 3, 2024

సంపాదకీయం: కొత్త చట్టాలు, నవ శతాబ్ది!

- Advertisement -
- Advertisement -

Question is when will corona vaccine come

కొత్త వ్యవసాయ చట్టాలపై భగ్గుమంటున్న రైతాంగం దేశ రాజధానిని చుట్టుముట్టి తన ప్రభుత్వానికి ఊపిరాడనీయకుండా చేస్తున్న తరుణంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ ఆర్థిక సంస్కరణల పట్ల తన మక్కువను దాచుకోకుండా మరోసారి మరింత స్పష్టంగా ప్రకటించారు. సోమవారం నాడు ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వీడియో వేదిక మీది నుంచి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ‘పాత చట్టాలతో కొత్త శతాబ్దిని తీర్చిదిద్దలేము’ అని ఆయన చేసిన ప్రకటన ఎట్టి పరిస్థితుల్లోనూ సంస్కరణల పరుగు ఆగదని చెప్పడమే తప్ప వేరొకటి కాదు. దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని వాస్తవ గణాంకాలు చాటుతున్నాయి. వీరు రోజుకి రూ. 150 ఆదాయంతో బతుకుతున్నారు. జనాభాలో 30 శాతం మంది రూ. 125 దినసరి రాబడితోనే గడుపుతున్నారు. ఏటా 14 లక్షల మంది బాలలు ఐదేళ్ల వయసు చేరుకోడానికి ముందే చనిపోతున్నారు.

20 కోట్ల మంది ప్రజలకు సరైన ఆహారం లభించడం లేదు. పోషకాహార లేమి, బాల కార్మికత, నిరక్షరాస్యత, బాల్య వివాహాలు వంటి రుగ్మతలు దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఆర్థికాభివృద్ధిలో దారుణంగా వెనుకబడిపోడమే ఇంతటి దుస్థితికి కారణమని, కనీసావసరాలకు కూడా చాలని బక్కచిక్కిన ఖజానాతో జాతి దురవస్థలపాలవుతున్నదని చెప్పి 1990వ దశకం ప్రారంభంలో ఆర్థిక సంస్కరణలకు తెర లేపారు. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు రెండూ వాటిని అమలు పరుస్తూ వచ్చాయి. మిగిలి ఉన్న కీలక సంస్కరణలను ప్రధాని మోడీ ప్రభుత్వం రెండవ హయాంలో త్వరత్వరగా ఆవిష్కరిస్తున్నది. అందులో భాగంగానే అత్యంత వివాదాస్పదమైన మూడు కొత్త వ్యవసాయ చట్టాలు ఊడిపడ్డాయి. తలచుకున్న దేనికైనా శాసన రూపమిచ్చి ప్రజల బతుకుల్లోకి విడిచిపెట్టడానికి అవసరమైనంత బలం మోడీ ప్రభుత్వానికి పార్లమెంటులో ఉన్నదన్న మాట వాస్తవం. కాని ఆ బలాన్ని ఆయన ప్రభుత్వం దేశ ప్రజల క్షేమానికి ఏ మేరకు ఉపయోగిస్తున్నది అనేది ఎప్పుడూ గీటురాయి మీద పరీక్షకు గురి అవుతూనే ఉంటుంది. ఆయన మొదటి ప్రభుత్వ కాలంలో అమలు పరిచిన పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను నిర్ణయాలు ప్రజలకు ఎటువంటి కష్టనష్టాలు దాపురింప చేశాయో తెలిసిందే.

పెద్ద నోట్ల రద్దు సామాన్య జనాన్ని చిన్న, చితక వ్యాపారులను నానాబాధలకు గురి చేసింది. వస్తు, సేవల పన్ను చట్టం పన్ను విధింపుపై రాష్ట్రాల అధికారాలను దాదాపు హరించి వేసి చిన్న, మధ్య తరహా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను దెబ్బ తీసింది. పర్యవసానంగా నిరుద్యోగం పెరిగిపోయింది. సంస్కరణలంటే వివిధ ఆర్థిక రంగాలపై ప్రభుత్వ అదుపును అంతమొందించడం, ప్రైవేటు పెట్టుబడులకు గేట్లు బార్లా తెరవడం, విదేశీ పెట్టుబడులను కూడా విరివిగా అనుమతించడం అనేది సుస్పష్టం. ఇది టెలికమ్యూనికేషన్ వంటి రంగాల్లో భారీ మార్పును తీసుకు వచ్చిన మాట వాస్తవం. అదే సందర్భంలో అప్పటి వరకు అత్యంత ఘనంగా నడుస్తూ వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ నీరసించిపోయింది. అంబానీల కోసం ప్రభుత్వమే దానిని నిర్వీర్యం చేసిందనే అభిప్రాయం ఏర్పడింది. అలాగే మరో గొప్ప ప్రభుత్వ రంగ సంస్థ ఒఎన్‌జిసికి కూడా అదే గతి పట్టింది. ఇప్పుడు ప్రజలు భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని ఆశిస్తూ ఆశ్రయిస్తున్న జీవిత బీమా సంస్థను కూడా మోడీ ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించబోతున్నది. సంస్కరణల వల్ల స్వదేశీ, విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడమేగాక ఒకప్పుడు వట్టిపోయిన విదేశీ మారక నిల్వలు అసాధారణ స్థాయిలో వృద్ధి చెందిన మాట కూడా నిజమే.

వృద్ధిరేటు ఒక దశలో 10 శాతానికి కూడా చేరుకుంది. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమని అంతర్జాతీయంగా అసాధారణమైన మెప్పును కూడా పొందాము. కాని ఇప్పటికీ 80 కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతూ ఉండడం లక్షలాది మంది బాలల జనన సమయ బరువు 2.5 కిలోల కంటే తక్కువగా ఉండడం, ఆరున్నర కోట్ల మంది పిల్లలు బడి బయటనే అక్షరం ముఖమెరుగక అఘోరిస్తూ ఉండడం వంటి చేదు వాస్తవాలు సంస్కరణలు తెచ్చే అభివృద్ధికీ, దేశ ప్రజల బాగుకీ ఏమాత్రం సంబంధం లేదని రుజువు చేస్తున్నాయి. ఇటువంటి సంస్కరణలు, కొత్త చట్టాలు, సరికొత్త శతాబ్ది దేశానికి అవసరమా అనే ప్రశ్న బలపడుతున్నది. స్వాతంత్య్రానంతరం దశాబ్దాల పాటు అమల్లో ఉన్న మిశ్రమ ఆర్థిక విధానంలో ప్రతి కీలక రంగంపైనా ప్రభుత్వానికి పట్టు ఉండడం వల్ల మెజారిటీ ప్రజల క్షేమానికి హామీ ఉండేది. వారి కనీస జీవనావసరాలకు సంక్షేమ కవచాలుండేవి. వాటిని ఊడబెరికి అమూల్యమైన ప్రభుత్వ సంస్థల ఆస్తులను కార్పొరేట్లకు కట్టబెట్టి వాటిని బలిపించడం ద్వారా పేదల బతుకుల్లో మరింత విషాదాన్ని కుమ్మరించినవారమే అవుతామని ప్రధాని మోడీ ఇప్పటికైనా తెలుసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News