Tuesday, April 30, 2024

దివాలీ నజరానా

- Advertisement -
- Advertisement -

Festival Advance To Central Government Employees

 

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు రూ 10000 అడ్వాన్స్

ఎల్‌టిసి బదులు నగదు ఓచర్లు పలు ప్యాకేజీలు

వినిమయ శక్తిని పెంచేందుకు ఉద్దీపన చర్యలు

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రధానఘట్టంగా ఉండే దసరా పండగ వేళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు పలు ప్రత్యేక పథకాల వరాలను ప్రకటించింది. కరోనాతో కకావికలమైన దేశ ఆర్థిక వ్యవస్థతో సతమతమవుతున్న వేళ వినిమయ శక్తిని పెంచడం, డిమాండ్ కొరత తీర్చడం ప్రధాన సమీకరణలుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రత్యేక ప్రణాళికలను ఖరారు చేసింది. ఈ నిర్థిష్ట చర్యలలో భాగంగా పండగ సందర్భంగా పలు ప్యాకేజీలను ప్రకటించారు. ప్రయాణ ఓచర్లు, ప్రతి ఉద్యోగికి పండగ అడ్వాన్స్ ఇవ్వాలని సంకల్పించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ బొనాంజా వివరాలను ప్రకటించారు. ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ వివరాలను తెలిపారు. ఇందులో అన్నింటి కన్నా ప్రధానమైనది పండుగ అడ్వాన్స్ కింద ప్రతి ఉద్యోగికి కేంద్రం రూ 10,000 రుణాన్ని వడ్డీ లేకుండా ఇవ్వనుంది. ప్రీపెయిడ్ రూపే కార్డుల్లో ఈ నగదు ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలలో జమ అవుతుంది.

దీనిని వచ్చే ఏడాది మార్చిలోగా వాడుకోవాలి. దీనిని ఉద్యోగులు పది వాయిదాలలో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిర్మలా సీతారామన్ పండగ వేళ పరమ శుభవార్త తెలిపారు. పండుగ రోజులలో సెలవులను సద్వినియోగం చేసుకునే ఉద్యోగులకోసం ప్రత్యేకంగా ప్రయాణ ఓచర్లను అందించనున్నారు. ఆర్థిక మంత్రి సోమవారం ప్రకటించిన పథకాలలో ఎల్‌టిసి (లీవ్ ట్రావెల్ కన్సెషన్) సంబంధిత ఓచర్ అందిస్తారు. ఉద్యోగికి ప్రతి నాలుగేళ్లకు ఓసారి వారు విహార యాత్రలు లేదా తీర్థయాత్రలకు వెళ్లేందుకు ఎల్‌టిసిలు ఇస్తుంది. కరోనా క్లిష్ట దశలో చాలా మంది ఈ రాయితీని సకాలంలో వాడుకోలేకపొయ్యారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఈ ఎల్‌టిసిలను నగదు ఓచర్ల రూపంలోకి మార్చింది. ఉద్యోగులు ఈ ఓచర్లను వచ్చే ఏడాది మార్చి 31 వరకూ వాడుకోవచ్చు . ఎల్‌టిసి పరిధిలో ఇచ్చే ఈ నగదు ఓచర్లపై కొన్ని పరిమితులు విధించారు. ఉద్యోగులు కేవలం ఆహారేతర వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అవి కూడా జిఎస్‌టి 12 శాతం, అంతకు తక్కువ పరిధిలోకి వచ్చే వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జిఎస్‌టి నమోదిత కేంద్రాలలో డిజిటల్ రూపంలో వీటిని కొనుక్కోవల్సి ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు,కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, సంబంధిత కంపెనీలు కూడా ఉద్యోగులకు ఈ ప్రయోజనాలను కల్పించవచ్చునని సూచించారు. వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచే దిశలో ఈ పండుగ సీజన్‌లో కన్సూమర్ డిమాండ్ ఉద్దీపన ప్రక్రియగా ఎల్‌టిసికి బదులుగా నగదు, ఫెస్టివల్ అడ్వాన్స్‌లు ఇస్తున్నట్లు వెల్లడించారు. పండుగ వేళ అంతా కొనుగోళ్లకు దిగుతుంటారు. కరోనా సంబంధిత ఆర్థిక చిక్కుల దశలో ఉద్యోగుల కొనుగోళ్ల శక్తి దిగజారింది. వారికి తగు ఆర్థిక ఊతం ఇవ్వడం ద్వారా అటు వారు వినిమయానికి దిగడం, ఇటు ఆర్థిక వ్యవస్థకు అవసరం అయిన డిమాండ్‌ను ఇతోధికం చేసేందుకు రంగం సిద్ధం అవుతుందనే ఆర్థిక విశ్లేషణల నేపథ్యంలో ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కరోనాతో ఈ ఏడాది ఎల్‌టిసిని వాడుకోకుండా ఉన్న ఉద్యోగులకు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకుండా ఉండే క్యాష్ ఓచర్లను అందిస్తారు. ఫెస్టివల్ అడ్వాన్స్‌గా ప్రతి ఆఫీసర్‌కు, ఉద్యోగికి రూ 10వేలను రుణంగా అందిస్తారు. దీని వల్ల , ఎల్‌టిసి బదులునగదు ఓచర్ల ప్రకియ వల్ల దాదాపుగా రూ 28000 కోట్ల మేర కన్సూమర్ డిమాండ్ ఏర్పడుతుందని నిర్మలా సీతారామన్ అంచనావేశారు.డిమాండ్ ప్రోత్సాహకానికి ప్రభుత్వం తీసుకునే చర్యలతో సామాన్య మానవుడిపై మరింత ద్రవ్యోల్బణ భారం పడకూదదని, ప్రభుత్వ రుణభారం అస్థిరత్వ దశకు చేరుకోకూడదని, దీనికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. ఇప్పటికిప్పటి సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలతో రేపటిరోజున చిక్కులు సంక్లిష్టతను తెచ్చిపెట్టరాదన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News