Saturday, April 27, 2024

మెజారిటీ మాటే అధికార మేనా

- Advertisement -
- Advertisement -

అధికుల అభిప్రాయమే శాసనం. అదే అందలానికి ప్రాతిపదిక. అది గమనించక ఏవో ఎత్తులు వేసి ఎదగాలని చూసినవారు చరిత్రలో ఎదగలేదు సరికదా, అధోపాతాళానికి చేరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, వాటి ఫలితాల మెతుకును పరీక్షించి అన్నం మొత్తం స్థితిని అంచనా వేసినట్లు ఎవరి రాజకీయ భవిష్యత్తు అంచనాలు వారు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ రాజకీయ చరిత్ర గత ఐదు వేల సంవత్సరాలలో మనకు చెప్పిన పాఠాలు ఏమిటో ఒకసారి నెమరు వేసుకుందాం. ఏ యుగంలోనైనా బుద్ధి బలానికి, భుజబలానికి మధ్య పోరు జరిగింది.

ఎప్పుడైనా, ఎవరైనా బుద్ధితోనైనా, భుజ బలంతోనైనా అత్యధిక వర్గాలను కలుపుకుని పోయినప్పుడే విజయం సాధించారు. సింధూ నదీ లోయలోని పట్టణాలలో లభించిన రుషి శిల్పాలు, రాత ముద్రికలు, వ్యవస్థీకృత నగర నిర్మాణాలు… ఇవన్నీ బుద్ధిబలం కలిగిన మేధావులే పాలకులని రుజువు చేశాయి. అయితే ఆ పాలకులు నగరానికి పశ్చిమం వైపున ఉచ్ఛస్థితిలో నివసించినప్పటికీ అత్యధికులైన పాలితుల సంక్షేమానికై వారికి కూడా నగరానికి కింది/ తూర్పు వైపున పక్కా గృహాలు నిర్మించారు; అందరి సంక్షేమం కోసం గొప్ప ధాన్యాగారాలు కట్టించారు. అలా క్రీ.పూ 3,000 సంవత్సరం ప్రాంతం నుండి వేయిన్నర సంవత్సరాలకు పైగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు. అందుకు నిదర్శనాలుగా ఆయా పట్టణాలలో వారు ఆడిపాడిన వస్తువులైన నర్తకి, పాచికలు (చదరంగం), చక్రాల బొమ్మలు మొ॥వి లభించాయి.

కన్ను కుట్టిన ఇంద్రుడు తన అంగ బలంతో ఆయా పట్టణాలను విధ్వంసం చేసి పురంధరుడు అని పేరు గాంచా డు.ఒక్క మొహెంజొదారో పట్టణంలోనే ధాన్యాగారాలను రక్షిస్తున్న ముప్పై వేల మంది రక్షక భటులను సంహరించాడట. మరో పక్క దివోదాసు కూడా ఇలాంటి విధ్వంసమే సృష్టించాడట. ఆ తరువాత ‘దశ రాజ’ యుద్ధం నలుపై సంవత్సరాలు జరిగిందట (ఈ వివరాలు రుగ్వేదంలో ఉన్నాయి). కాని విజేతలు సాధించింది ఏమీ లేదు. పైగా అద్భుతమైన నాగరికత శాశ్వతంగా నాశనమైంది. ఆ తరువాత ఇంద్రున్ని ప్రశంసించే యజ్ఞయాగాదుల పశుపాలక వేద యుగం మనుగడలోకి వచ్చింది. అంటే సింధూ నాగరికతకు ముందున్న జీవన విధాన స్థితికి వెనుకకు వెళ్ళింది. మళ్ళీ సింధూ నాగరికతా స్థితికి చేరుకోవడానికి భారత దేశానికి నాలుగు వేల సంవత్సరాల కాలం పట్టింది.

సింధూ నదీ లోయలోని నగరాలు విధ్వంసానికి గురయిన తరువాత ప్రజలు భారతదేశం తూర్పు వైపుకు, దక్షిణం వైపుకు జీవనాన్ని వెతుక్కుంటూ వలసలు పోయారు. దీనినే కలియుగం అన్నారు. కాని ఈ వెతుకులాటలో ఇనుము (గట్టి లోహం)తో పనిముట్లు చేసుకుని, వాటితో అడవులను నరికి వ్యవసాయం చేశా రు మలివేద కాలంలో. సారవంతమైన గంగా మైదాన భూములలో పంటలు బాగా పండడం వల్ల ‘మిగులు’ ఏర్పడి, తిండి కోసం ఎప్పుడూ పని చేసే అవసరం లేకుండా ఖాళీ సమయం దొరికి ధనికులు క్రమంగా గణ రాజ్యాలు, జనపదాలు, మహా జనపదాలు నిర్మించారు. కాని తమకు సమాంతరంగా ఎదిగిన మేధావులను పక్కన పెట్టకుండా అక్కున చేర్చుకుని తమకు, తమ జనపదాలకు పురోహితులుగా నియమించుకున్నారు. కానీ పురోహితులు రాజుల దగ్గర తమ దర్పం ప్రదర్శించుకోవడం కోసం వారి చేత ఎన్నో రకాల గొప్పగొప్ప యజ్ఞాలు చేయించి వేలు, లక్షల పశువులను బలిచ్చేవారు.

దాంతో పశుసంపద తగ్గి వాటి సహాయంతో వ్యవసాయం చేసే సామాన్య రైతుల జీవనానికి ప్రమాదం ఏర్పడింది. ఈ రెండు పరిణామాలు -రాజులపై పురోహితుల పెత్తనం, పశువధ బుద్ధుని ఉద్యమానికి కారణాలయ్యాయి. బుద్ధుడు, జైన వర్థమాన మహవీరుడు ‘అహింస’ అనే ఒకే భావనతో యావత్ బ్రాహ్మణత్వ బుద్ధిబలంపై దెబ్బకొట్టారు. పర్యవసానంగా పశుసంపద రక్షించబడి, వాటి ద్వారా వ్యవసాయం వృద్ధిచెంది, పంటల సుదూర అమ్మకాల ద్వారా వ్యాపారం ఇనుమడించి, ఆయా పన్నుల రాబడి పెరిగి భారత స్థాయి సామ్రాజ్యం (మగథ) ఉద్భవించింది. అయితే ఆ పన్నుల పిచ్చి ఎక్కువైనందుకే ధననందుడనే సామ్రాట్టును చాణక్యుడు అత్యధిక వర్గాల బాధలను తగ్గించడానికై గద్దె దించాడు. తనదైన నీతితో మరో చక్రవర్తి మార్య చంద్రగుప్తున్ని అందలమెక్కించాడు. వీరిద్దరి బుద్ధిబలం, భుజబలం ఒక్కటై వారి వారసుడు అశోకునిలో ప్రతిఫలించాయి. ఆయన క్రీ.పూ. మూడవ శతాబ్దంలో ‘దేశమంతటా మోగవలసింది యుద్ధభేరి కాదు, ధర్మ భేరి’ అని ప్రజలను తన కన్నబిడ్డలుగా చూస్తూ దేశమంతటా స్తంభాలను నిలబెట్టి, వాటి పైన, సమీప స్థలాలలోని శిలలపైన ధర్మశాసనాలను చెక్కించాడు.

ప్రజలే కాదు, పశువులు, పక్షులు, చెట్లను కూడా సంరక్షించే చర్యలు చేపట్టాడు. అలా ఇతనిది కేంద్రీకృత పితృస్వామిక పరిపాలనగా పేరు గడించింది. కాని అశోకుని తరువాత అతని వారసులు (దాయాదులు), సామంతులు, దక్షిణాదిన శాతవాహనులు స్వతంత్రించి దేశాన్ని అనేక రాష్ట్రాలుగా విభజించి పాలించారు. అంతేకాదు, దేశపు పశ్చిమోత్తర భాగంలో విదేశీయుల రాకను నిరోధించే చర్యలు చేపట్టకపోవడం వల్ల అక్కడి కనుమల నుంచి సుమారు అర డజను విదేశ జాతులు భారత దేశంలోకి చొరబడ్డాయి. అయితే అప్పటికి భారతదేశంలో వేళ్ళూనుకొని ఉన్న బుద్ధిబలానికి లోనయి ఆ విదేశీయులు కూడా భారత సంస్కృతితో మమేకమయ్యారు. పైగా వాసుదేవ కృష్ణ భక్తి శాఖకు ఊపిరి పోశారు. గాంధార శిల్పకళా రీతి ఉద్భవించి ప్రాచుర్యం పొందడానికి ప్రేరకులయ్యారు.

ఇదే స్ఫూర్తితో గుప్తులు భుజబలంతో మళ్ళీ భారత దేశం లో చాలా భాగాన్ని రాజకీయంగా ఏకం చేసి, బుద్ధిబలంతో సాంస్కృతికంగా ఏకం చేయడానికి విశేష కృషి చేశారు. అందులో భాగంగానే కాళిదాసు వంటి మహా కవి పండితులతో (నవ రత్నాలు) భారత దేశ సంస్కృతి అంతా ఒక్కటే అనే అర్థం వచ్చేలా పురాణాలు, ఇతిహాసాలు మొదలైన సాంప్రదాయ సాహిత్యాన్ని మళ్ళీ రాయించారు. ఈ క్రమంలో బౌద్ధ మతం ప్రత్యేక ఉనికి పోయి భారత బ్రాహ్మణ (హిందూ) మతంలో విష్ణువు దశావతారాల్లో ఒకటిగా కలుపబడింది.ఈ ఐక్యతా రాగాలతోనే గుప్తులు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నలంద వంటి విశ్వవిద్యాలయాలను నిర్మించి ఉన్నత విద్యను, పరిశోధనలను ప్రోత్సహించారు. దాంతో శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా ఎంతో ప్రగతి సాధ్యమై గుప్తుల యుగానికి స్వర్ణయుగం అనే పేరు వచ్చింది. గుప్తులు మౌర్యుల వలె పాలనను కేంద్రీకరించకుండా వికేంద్రీకరించి స్థానిక పాలనకు ప్రాధాన్యమిచ్చారు.

ఈ తంత్రం కొంతకాలం బాగానే పని చేసినా కాలక్రమంలో స్థానిక రాజులు బలపడడంతో కేంద్ర ప్రభుత్వం బలహీనపడింది. దాని స్థానంలో హర్షుని వంటి బలవంతులైన రాజులు వచ్చినా వారిని చాళుక్యుల వంటి రాజులు దక్షిణాన విస్తరించనీయలేదు. పైగా ఈ స్థానిక రాజులు తొలి దశలో తొలి చాళుక్యులు – పల్లవులు, మలి దశలో మలి చాళుక్యులు చోళులు సుమారు ఐదు వందల సంవత్సరాలు పరస్పరం కొట్లాడుకొని ఒకరినొకరు ఎదగనిచ్చుకోలేదు. ఎవరి ప్రాంతం లో వారే స్థానిక భాషా సంస్కృతులను అభివృద్ధి చేసుకున్నారు. అలాగే ఉత్తర భారతం, తూర్పు భారత దేశంలో కూడా స్థానిక రాజులు పరస్పరం కలహించుకొని పరాయి పర్షియన్ భాషా ప్రాంతీయులకు కూడా సహకరించడంతో వారు వాయువ్య భారత దేశం, ఢిల్లీ, తూర్పు భారతం, దక్షిణ భారతం ఇలా యావత్ భారత దేశ స్థాయి సామ్రాజ్యాన్ని స్థాపించి సుమారు మూడు వంద ల సంవత్సరాలు పాలించారు. వారి (ఢిల్లీ సుల్తానులు) తరువాత మొఘలులు మరో రెండు వందల సంవత్సరాలు పాలించారు. అయితే ఈ ముస్లిం రాజులు తమ పూర్వులు అయినట్లు భారత సనాతన (హిందూ) భాష, మత, సంస్కృతులతో మమేకం కాలేదు. వీరి అధికార భాషా ప్రభావం భారతీయ భాషలపై పడి హిందీ, ఉర్దూ (దక్కనీ) భాషలు రూపుదిద్దుకున్నాయి.

ముస్లింల లో సూఫీల వంటి మత బోధకులు / ప్రచారకులు, అక్బర్ వంటి చక్రవర్తులు దేవుడొక్కడే అని హిందూ -ముస్లిం ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించినా, ఆ తరువాత ఔరంగజేబు వంటి చక్రవర్తులు ఇస్లాం మతానికే ప్రాధాన్యమివ్వడంతో దక్షిణాదిన విజయనగర రాజులు, మహారాష్ట్రలో శివాజీ వంటి వీరులు హిందూ సామ్రాజ్యాన్ని పునఃస్థాపించాలనే లక్ష్యంతో ముస్లిం చక్రవర్తులతో పోరాడారు. వీరిరువురి పోరులను ఆసరాగా చేసుకొని యూరోపు వర్తకులు, తదనంతరం బ్రిటీషు వారి ఈస్ట్ ఇండియా కంపనీ ఇరు వర్గాలనూ ఓడించి తమ సామ్రాజ్యాన్ని స్థాపించి భారత దేశ సంపదను సుమారు రెండు వందల సంవత్సరాలు దోచుకున్నారు. తమ అనైక్యతే అందుకు కారణమని గుర్తించిన హిందువులు, ముస్లింలు బహదూర్ షా అనే మొఘల్ రాజును ఢిల్లీలో భారత చక్రవర్తిగా ప్రకటించి 1857లో సిపాయిల తిరుగుబాటు లేవదీశారు. కాని అత్యాధునిక ఆయుధాలు, సుశిక్షుతులైన సైన్యం గల బ్రిటిషువారు హైదరాబాద్ రాష్ట్ర పాలకుడైన నిజాం ప్రధానమంత్రి సాలార్‌జంగ్ వంటి స్థానిక పాలకుల సహకారంతో సిపాయిల తిరుగుబాటును అణచివేశారు. అయితే హిందూ-ముస్లిం సంస్కృతీ సాంప్రదాయాల జోలికి పోయి వారి తిరుగుబాట్లను కొని తెచ్చుకోవద్దని కొంత కాలం మిన్నకున్నారు. పైగా భారతీయ భాషా, సంస్కృతులను ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వంటి విద్యా సంస్థల ద్వారా అధ్యయనం చేశారు.

భారతీయులు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుచుకోవడానికో వేదిక ఉండాలని ఎ.ఒ. హ్యూమ్ బొంబాయిలో 1885 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించాడు. బ్రిటీషువారు చేసిన ఈ ప్రయత్నాలను భారతీయులు క్రమంగా తమకు అనుకూలంగా (సేఫ్టీ వాల్వ్) మలచుకొని, తమ మత, జీవన సంస్కృతులను సరిదిద్దుకొని మళ్ళీ ఏకం కావడానికి ప్రయత్నించారు. దీనిని పసిగట్టిన బ్రిటీషువారు ‘విభజించి పాలించు’ అనే విధానాన్ని అవలంబిస్తూ 1905లో ముస్లిం జన సంఖ్య ఎక్కువగా ఉన్న తూర్పు బెంగాల్ (ఈనాటి బంగ్లాదేశ్)ను హిందువులు ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్ నుంచి విభజించారు. ఈ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు స్వదేశీ (వందేమాతరం) ఉద్యమాన్ని లేవదీసి విజయం సాధించారు. తదనంతరం స్వరాజ్య (హోమ్ రూల్) ఉద్యమం, సంపూర్ణ స్వరాజ్యం ఉద్యమం లేవదీశారు.

బ్రిటీషు ప్రభుత్వం వాటిని అణచివేయడంతో ఆ హింసకు భారతీయులు బలైపోతున్నారని గాంధీ అహింసా మార్గంలో సహాయ నిరాకరణ, సత్యాగ్రహ ఉద్యమాలు నడిపాడు. వాటి ద్వారా ఆశించిన ఫలితాలు అంత త్వరగా రాకపోవడంతో భారతీయ ఉద్యమకారులందరూ గాంధీ ఇచ్చిన ‘డూ ఆర్ డై’ (పోరాడు లేదా చావు) అనే నినాదానికి స్పందించి 1942లో పెద్ద ఎత్తున బ్రిటీషు వారిని భారత్ నుంచి తరిమికొట్టే (క్విట్ ఇండియా) ఉద్యమం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఎదురవడంతో బ్రిటీషువారు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతీయులకు స్వాతంత్య్రం ఇచ్చి వెళ్ళిపోయారు. భారతీయులు అంబేడ్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రాయించుకుని తాము ఎన్నుకున్న ప్రతినిధుల చేత తమను తాము పాలించుకొనే (రిపబ్లిక్) స్వేచ్ఛను పొందారు. గాంధీ చెప్పినా ఏకాభిప్రాయం సాధ్యం కాని స్థితిలో ‘లౌకిక’ భావనను పెంపొందించుకున్నారు.

అయితే ఈ స్వేచ్ఛా స్వాతంత్య్ర ఫలాలను ఎక్కువ కాలం అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీని జనతాదళ్, భారతీయ జనతా పార్టీ, పార్టీల కూటములు, ప్రాంతీయ పార్టీలు ఎదిరించి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అంబేడ్కర్, ఆచార్య జయశంకర్ చెప్పారు ప్రాంతీయ రాజకీయ పార్టీ మాత్రమే తమ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకొని ప్రగతిలోకి తేగలదు అని. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పాలనను వద్దనుకొని తెలుగు ప్రజలు 1983లో నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని గెలిపించారు. అయితే కొంత కాలానికి అదే పార్టీ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రజా రైతు సమస్యలను పట్టించుకోవడం లేదని పాదయాత్ర ద్వారా ప్రచారం చేసి 2004లో వై.యస్.

రాజశేఖరరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఈ ఆంధ్ర- రాయలసీమ మూలాలున్న రాజకీయ నాయకులు తమ ప్రాంతాలు, ప్రజల ఆర్థిక, సాంస్కృతిక వికాసానికి తోడ్పడుతూ తమను మోసం చేస్తున్నారని గుర్తించి తెలంగాణ ప్రాంత ప్రజలు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. పైన పేర్కొన్న రాజకీయ చారిత్రిక గమనాన్ని పరిశీలిస్తే ఏ యుగం లోనైనా మెజారిటీ ప్రజాభిప్రాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని పావులు కదిపినవారే రాష్ట్రస్థాయిలోనైనా, దేశస్థాయిలోనైనా ప్రభుత్వాలను ఏర్పాటు చేశారనే విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఇక మీదట కూడా ఏ ప్రాంత ప్రజలైనా తమ మెజారిటీ అభిప్రాయాన్ని లక్ష్యపెడుతూ తమ ఆకాంక్షలను నెరవేర్చుతూ తమకు అందుబాటులో ఉండే పార్టీ ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారని జోస్యం చెప్పవచ్చు.

డా. ద్యావనపల్లి
సత్యనారాయణ
9490957078

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News