Saturday, April 27, 2024

ఆస్పత్రి డీన్‌తో టాయిలెట్లు కడిగిస్తారా?: ఐఎంఏ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

ఠాణే : మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రి డీన్‌తో శివసేన ఎంపీ హేమంత్ పాటిల్ మరుగుదొడ్లను శుభ్రం చేయించిన సంఘటనను వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఆస్పత్రి తాత్కాలిక డీన్ పట్ల ప్రజా ప్రతినిధులు వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఎం ఏక్‌నాథ్ షిండేకు వినతి పత్రం సమర్పించినట్టు మహారాష్ట్ర భారతీయ వైద్య సంఘం (ఐఎంఎ) ఓ ప్రకటనలో తెలిపింది. నాందేడ్ ఆస్పత్రిలో మరణాలపై సరైన విచారణ జరపాలని తాము కోరుతున్నట్టు చెప్పారు. అయితే వైద్య కళాశాల డీన్‌తో టాయిలెట్లు కడిగించడం ద్వారా ఓ ఎంపీ వ్యవహరించిన తీరు మాత్రం సమర్ధనీయంకాదని పేర్కొన్నారు. రోగుల రద్దీని పరిగణన లోకి తీసుకుంటే ఆస్పత్రిలో సిబ్బంది సంఖ్య సరిపోదని పేర్కొంది.

ఎంపీపై పోలీస్‌లకు డీన్ ఫిర్యాదు
ఇదిలా ఉండగా, ఒక ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం, తన పరువుకు నష్టం కలిగించారన్న ఆరోపణలపై ఎంపీ హేమంత్ పాటిల్‌పై డీన్ పోలీస్‌లకు బుధవారం ఫిర్యాదు చేశారు. మహారాష్ట్ర లోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో 48 గంటల వ్యవధిలో 31 మరణాలు సంభవించిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ ఆస్పత్రిని సందర్శించిన ఎంపీ హేమంత్ పాటిల్ మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నట్టు గుర్తించారు. ఆస్పత్రి డీన్ శ్యాం రావ్ వాకోడేను అక్కడికి పిలిపించి మరుగుదొడ్ల అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా డీన్‌తోనే మరుగుదొడ్లు శుభ్రం చేయించారు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News