Sunday, April 28, 2024

శామీర్‌పేటలో కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నగర శివారులోని శామీర్‌పేటలో శనివారం కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపిన యువకుడిని శామీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి, ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చెల్ డిసిపి సందీప్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిసా రాష్ట్రం బరంపురానికి చెందిన దంపతులు సిద్దార్థ్ దాస్, స్మీత భార్య భర్తలు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో 2019 నుంచి విడిగా ఉంటున్నారు. సిద్ధార్థ్ ఎపిలోని విశాఖపట్టణంలోని హిందూజా థర్మల్ కంపెనీలో పవర్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా, స్మిత ఒరాకిల్‌లో కంపెనీలో ఉద్యోగి. వీరి ఇద్దరు పిల్లలు స్మీత వద్ద ఉంటున్నారు, పిల్లలతో శామీర్‌పేటలోని సెలబ్రిటీ రిస్టాలో ఉంటోంది. కుమారుడు ఫిడ్జ్ కాలేజీలో 12వ తరగతి చదువుతుండగా, కూతురు శామీర్‌పేటలోని శాంతినికేతన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది.

ఇద్దరి విడాకులు కేసు కూకట్‌పల్లి కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలోనే స్మీత తన కంటే చాలా చిన్నవాడైన ఎపిలోని విశాకపట్టణానికి చెందిన మనోజ్‌తో సహజీవనం చేస్తోంది. మనోజ్ తనపై దాడి చేస్తున్నాడని, ఇబ్బంది పెడుతున్నాడని కొద్ది రోజుల క్రితం స్మీత కుమారుడు(17) సిడబ్లూసి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అధికారులు బాలుడిని తమ వద్ద ఉన్న హాస్టల్ చేర్పించారు. అలాగే తమ చెల్లిని కూడా మనోజ్ ఇబ్బందులు పెడుతున్నాడని వెంటనే తన వద్దకి రప్పించాలని కోరాడు. వేధింపుల విషయం బాలుడు తన తండ్రి సిద్ధార్థ్‌కు చెప్పాడు. దీంతో తన కూతురిని తీసుకుని వెళ్లాలని సిద్ధార్థ్ శనివారం రిసార్ట్‌కు వచ్చాడు. తన కూతురిని తీసుకుని వెళ్లే విషయంలో స్మీత, సిద్ధార్థ్ మధ్య గొడవ జరిగింది.

ఈ సమయంలో ఇంట్లోనే ఉన్న మనోజ్ ఎయిర్ గన్‌తో సిద్ధార్థ్‌పై కాల్పులు జరిపాడు. కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ వెంటనే డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పులు జరిపిన మనోజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై ఆర్మ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, గన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి సందీప్ తెలిపారు.

తల్లి వద్ద ఉండలేంః సిద్ధార్థ్ కుమారుడు
మనోజ్ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నారని సిద్ధార్థ్ దాస్ కుమారుడు జులై 12వ తేదీన అల్వాల్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. తమను మనోజ్ తనను, చెల్లిని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడని, చిత్రహింసలు పెడుతున్నాడని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాము తల్లి వద్ద ఉండలేమని, వారి బంధువుల వద్ద కూడా ఉండమని చెప్పారు. దీంతో బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తమ సంరక్షణలో ఉంచుకున్నారు.
ఇద్దరు కలిసి మోసాలకు తెర…
స్మీత, మనోజ్ కలిసి పలువురిని మోసాలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. యాక్టింగ్ పేరుతో అందమైన యువతులకు ఎర వేసి ట్రాప్ చేస్తున్నట్లు తెలిసింది. ఇద్దరు కలిసి బంజారాహిల్స్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎప్పుడు పార్టీల పేరుతో ఇద్దరు తిరిగేవారు, ఆ సమయంలో పలువురు యువతులకు మాయమాటలు చెప్పి తమ బుట్టలో వేసుకునే వారు. ఇద్దరు కలిసి ఓ సంపన్న యువతిని ట్రాప్ చేసిందని, ఇద్దరు కలిసి ఆమె వద్ద నుంచి రూ.50లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇలా వీరి బారినపడిన వారిలో ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది.

నేను కాదు….కార్తీక దీపం మనోజ్
సిద్ధార్థ్ దాస్‌పై కాల్పులు జరిపింది కార్తీక దీపం నటుడు మనోజ్ కుమార్ అని మీడియాలో ప్రచారం అయింది. దీనిపై నటుడు మనోజ్‌కుమార్ స్పందిస్తూ గతంలో కార్తీక దీపం సీరియల్‌లో నటించానని, ఇప్పుడు మౌనపోరాటం సీరియల్‌లో నటిస్తున్నానని మనోజ్ తెలిపారు. కొన్ని మీడియా సంస్థలు కాల్పులు జరిపింది తానేనని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తాను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని చెప్పారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మనోజ్‌కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News