Tuesday, April 30, 2024

వైర్డ్ జనరేషన్: విలువలు, వైఖరులు

- Advertisement -
- Advertisement -

‘Being sent to your bedroom used to be a punishment: now it’s a teen dream.Through personal computers, mobile phones and gaming consoles, teenagers are spurning antisocial angst for a culture of ‘connected cocooning’. –MTV music channel
‘Younger people now have a wider range of communication available and their parents don’t necessarily understand the technolo gy. But they are not talking about different things, they are just perhaps talking about it in a slightly different context. Aisha Walker, Leeds University
జ్ఞానం, అనుభవాల నుండి సమాజ వికాసం సుస్థిరత లక్ష్యంగా మానవ సమూహాలు ఏర్పరచుకున్న పాటింపులు పద్ధతులే విలువలు (Values), వైఖరులు (Attitudes). ఈ విలువలు వైఖరుల విషయంలో పిల్లలకూ పెద్దలకూ మధ్య తలెత్తితున్న ఘర్షణ ఇప్పుడు చెప్పనలవి కానిది. ‘ఉన్నచోట ఉండరు, చేయమన్న పని ఒక్కటీ చేయరు’ అంటూ పిల్లల గురించి పెద్దలు, ‘ఇదిట్లా అదట్లా అంటూ ప్రతి దానికీ రిస్టిక్షన్స్, ఇండిపెండెట్‌గా మమ్మల్ని ఆలోచించనివ్వరు, ఎదగనివ్వరు’ అంటూ పెద్దల గురించి పిల్లలుచేసే ఆరోపణలు ఇరువర్గాలకూ ఎంతకూ రాజీ కుదరని ఒక వైరుధ్యం.

ఈ పరిస్థితి, విలోమత్వం ఇప్పుడేనా? క్రిందటి తరరాల మధ్య కూడా ఉండేదా? అంటే ఏకాలంలోనైనా పిల్లలకూ పెద్దలకూ మధ్య ఏదో ఒక మేరకు భేదాభిప్రాయాలుంటాయి. దీన్నే జనరేషన్ గ్యాప్ అంటారు. అయితే ఇప్పుడున్నంత తీవ్ర స్థాయి భేదాభిప్రాయాలు గత శతాబ్దంలోనూ, అంతకు ముందటి శతాబ్దంలోనూ లేవు. ఎందుకంటే నాగరికతలు వెంటవెంటనే మారింది గతంలో ఇంతలా లేదు. నాగరికతలు ఎకానమీ ఆధారంగా మనగలుగుతాయి. ఎకానమీని పాలిటిక్స్ ప్రభావితం చేస్తాయి. ఎకానమీ, పాలిటిక్స్, సివిలైజేషన్ ఈ మూడింటి నిర్మితి, చలనం సంస్కృతి కేంద్రంగా వుంటాయి. సంస్కృతిలో సోషల్ స్ట్రక్చర్ భాగస్వామిగానే కాకుండా నిర్ణాయకశక్తిగా వుంటుంది. రాజకీయాలు ఎకానమీని, ఎకానమీ సివిలైజేషన్‌ను, సివిలైజేషన్ సోషల్ స్ట్రక్చర్‌ను మార్చేసే క్రమంలో సంస్కృతి కూడా ఉన్నతినో, పతనాన్నో అనుభవిస్తుంది. అందుకే కొందరి ప్రవర్తనలు నడవడికలను గురించి మాట్లాడే క్రమంలో వాళ్లది బ్యాడ్ కల్చర్, గుడ్ కల్చర్ అంటుంటాం. ఇవాళ నగరాల్లో, పట్టణాల్లో స్థిరపడిన పెద్దవాళ్లంతా సమిష్టి శ్రమ- సహకారం, సామాజికత వారధిగా యాంత్రికతకూ, సాంకేతికతకూ దూరంగా జీవనం గడిపినారు. ఇప్పటి టీనేజర్స్ ఇండస్ట్రియల్ ఎకానమీ, అర్బన్ ఎకానమీ మరీ ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ హంగూఆర్భాటాలు శాసిస్తున్న కాలనీల్లో మార్కెట్ ఛా యా ప్రచ్ఛాయల్లో పుట్టినవాళ్లు లేదా పెరిగినవాళ్లు. వీళ్లనే ఇప్పుడు సామాజికవేత్తలు సరికొత్తగా ‘వైర్డ్ జనరేషన్ (Wired generation )’ అని సంబోధిస్తున్నారు.

అంటే పెద్దవాళ్లు Non Wired generation. అందుకే పెద్దవాళ్లకూ పిల్లలకూ మధ్య జీవితాచరణలో, ఆలోచనల్లో, విశ్వాసాల్లో, ఆదర్శాల్లో భారీ వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. సుప్రసిద్ధ అమెరికన్ పిల్లల మనో విశ్లేషకుడు ఎరిక్ ఎరిక్సన్ తన ‘థియరీ ఆన్ సైకలాజికల్ డెవలప్ మెంట్ ’లో ‘ఐడెంటిటీ క్రైసిస్’ గురించి చర్చిస్తూ వైర్డ్ జనరేషన్ లక్షణాలను ప్రత్యేకంగా పేర్కొన్నాడు. కౌమారాన్ని ‘ఐడెంటిటీ v/s రోల్ కన్ఫ్యూషన్’ దశగా అభివర్ణించారు. పిల్లల భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించిన ఈ కీలక దశలో పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే బాధ్యత తీసుకొని జాగ్రత్తగా మౌల్ చేయాల్సిన అవసరం ఉందని ఎరిక్సన్ సూచించారు. ఇక వైర్డ్ జనరేషన్ విషయానికొస్తే ఈ పదాన్ని మొదటగా వినియోగించి బాగా ప్రచారంలోకి తెచ్చింది అమెరికన్ కేబుల్ ఛానెల్ MTV. వయోవర్గం దృష్ట్యా పదహారు నుండి ఇరవై నాలుగు సంవత్సరాలున్న వాళ్లంతా వైర్డ్ జనరేషన్ కింది వస్తారు. వీళ్లు వెనుకటి తరాలకు మించి ‘Digitally active’ గా ఉంటారు. వీళ్ల నిత్యకృత్యాలన్నీ ఎలక్ట్రానిక్ మీడియాతో గాఢంగా పెనవేసుకుంటాయి. ఇ-మెయిల్, ఇన్‌స్టాగ్రామింగ్, స్మార్ట్‌ఫోన్ కమ్యూనికేషన్, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్, వీడియోల్లో తలమునకలై ఉంటారు.

పెద్దవాళ్లలా భూమి, శ్రమ, ఉత్పత్తి తత్సంబంధిత సామాజిక సంబంధాల భావనలు, సంపద కాకుండా వీళ్లదంతా టెక్ మానియా, డొపమైన్ ఎకానమీ ఊహోప ఊహలు, లింబిక్ కాపిటలిజం తాలూకు భావోద్వేగ చర్యా ప్రతిచర్యలు. వీళ్ల శ్రద్ధలు ఆసక్తులు, ఆలోచనలు, ప్రవర్తన, శరీర పని విధానం సంప్రదాయాలకు పూర్తిగా భిన్నం. అయితే వీళ్లలోని ఒకటి రెండు 1. మల్టీటాస్కింగ్ (హోంవర్క్ చేస్తూనే స్నేహితులకు మెస్సేజ్ పంపడం, ఇష్టమైన వీడియోలు చూడటం, మ్యూజిక్ డౌన్లోడ్), 2. వెల్ ట్రావెల్ (కొత్త ప్రదేశాల సందర్శన), 3. టెక్నాలజీ యాక్సెస్’ వంటి పాజిటివ్ అంశాలనూ పెద్దవాళ్లు గుర్తించాల్సి వుంది. వీళ్లు ఏయే భావోద్వేగాలను ఎందుకు అనుభవిస్తున్నారో, రాడికల్‌గా ఎందుకు అనుభూతి చెందుతున్నారో అర్థం చేసుకోగలిగితేనే తల్లిదండ్రులు, అధ్యాపకులు వైర్డ్ జనరేషన్‌తోఇమడగలుగుతారు. భావోద్వేగ ప్రజ్ఞ వుంటేనే వాటి అదుపు సాధ్యం. కాబట్టి ఆధిపత్యం చెలాయించే వారుగా కాకుండా సలహాదారులుగా స్నేహపూర్వకంగానే పిల్లలతో పెద్దవాళ్లు వ్యవహరించాల్సి వుంటుంది. ఎవరెన్ని మాట్లాడినా అది ఆ కాసేపే ఊరట నివ్వగలదే తప్ప సాంకేతికశాస్త్రం బతుకుపొరల్లో ఇంచు ఇంచుకూ ఎగబ్రాకిన ప్రస్తుత తరుణంలో పిల్లలతో ప్రత్యక్షంగా వేగడం కష్టంమే మరి.

అయితే, ప్రతి సమస్యకూ దాని ఉత్పన్నత తాలూకు కారకాల్లోనే పరిష్కారం కూడా దొరుకుతుందంటారు ప్రముఖ ఫ్యామిలీ ఎడ్యుకేటర్, టెక్ కన్సల్టెంట్ జానెల్ బి.హాఫ్మన్. ఈమె ఇటీవల వెలువరించిన ‘iRules: What Every Tech Healthy Family Needs to Know about Selfies, Sexting, Gaming, and Growing Up’ అనే గ్రంథం ప్రత్యేకించి వైర్డ్ జనరేషన్‌తో పాటు, వారిలో చేరబోయే ముందరి దశ చిన్నారుల పెంపకానికి ఎంతగానో పని కొస్తుంది. ఈమె ఏకంగా తన పదమూడేళ్ల కూతురుకు iphone కొనిస్తూ పద్దెనిమిది నియమాలతో కూడిన వాడకాన్ని అనుమతించింది. ‘వైర్డ్’ మ్యాగజైన్ సంపాదకులు డేవిడ్ రోవన్ పన్నెండు- పదహారు సంవత్సరాల మధ్య పిల్లలతో దశాబ్దం క్రితం లండన్ నగరంలో ‘న్యూ థింకింగ్: వైర్డ్ నెకస్ట్ జనరేషన్ 2013’ సదస్సును నిర్వహించి తల్లిదండ్రులకు యాప్ క్లినిక్ మేనేజర్లతో శిక్షణ ఇప్పించారు. ఈ సదస్సు పిల్లలు అనుసరించవలసిన విలువలు, వైఖరులపై తగు సూచనలు చేసింది. అపరిమితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చిన డిజిటల్ యుగంలో పిల్లలు పరస్పరం సంభాషించే, సమాజీకరించే, పని చేసే, వినోదించే విధానంపై విప్లవాత్మక ప్రభావాన్ని ఎట్లా చూపగలవో వివరించింది.

అప్పటితో పోల్చితే పిల్లల్లో మార్పులిప్పుడు భయానక రూపం దాల్చాయనే చెప్పాలి. మరిప్పుడు? మనం చేయగలిగిందేమిటనే దానికి సమాధానంగా యువ సామాజిక శాస్త్రవేత్త, ‘విలువలు -వైరుధ్యాల (ValCon)’ పరిశోధకురాలు, భారతీయ జర్నలిస్టు డా. కావ్యాంజలి కౌశిక్ తన పరిశోధనా వ్యాసం ‘Keeping up with the wired generation: The five cornerstones of raising children in the digital age’ లో ‘ఐదు మూల స్తంభాల (ఫైవ్ కార్నర్ స్టోన్స్)ను ప్రతిపాదించింది. అవి: 1.హద్దులను నెలకొల్పడం (Build Boundaries), 2. నియమావళిని రూపొందించడం (Set Rules), 3. బహిరంగ చర్చను ఆహ్వానించడం (Allow Open Conversation), 4. గోప్యతను గౌరవించడం (Respect Privacy), 5. సాంకేతిక విజ్ఞానాన్ని అర్థం చేసుకోవడం (Under stand Technology). సామాజిక పండితులు, ప్రజా వైద్యులు చెబుతున్నట్టు ఇప్పుడు ‘నాగరికతా వ్యాధులు’ ప్రబలి సరికొత్త సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పెద్దలకూ పిన్నలకూ మధ్య ఇంతకు ముందెన్నడూ లేనట్టి అంతరాలు వైరుధ్యాలతో భూగ్రహం ఇప్పు డు తల్లడిల్లుతోంది.

సమాచార సాంకేతిక విజ్ఞానం పరంగా ఇది విప్లవాల యుగంకావొచ్చుగాక, తల్లీబిడ్డల, తండ్రీ కొడుకుల, గురుశిష్యులపరంగా చూస్తే ఇది ‘పరిహార యుగమే’ మరి. స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యులు వైద్యులు అన్నా లెంబ్కీ తన అనుభవాల అక్షర రూపం ‘డొపమైన్ నేషన్’ గ్రంథంలో విచారపడుతున్నట్టు ఎల్డర్స్ కూ వైర్డ్ జనరేషన్‌కూ మధ్య సమతౌల్యం ఇప్పుడు తక్షణావసరం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News