Sunday, April 28, 2024

ముమ్మరంగా అటవీ ఉత్పత్తుల సేకరణ

- Advertisement -
- Advertisement -

Forest products collection in Telangana

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని మైదాన ప్రాంతాలకు సమీపంలోని అడవుల్లో ముమ్మరంగా అటవీ ఉత్పత్తుల సేకరణ జరుగుతోంది. సమీప ప్రాంతాల్లో నివాసముండే స్థానికులు అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరిస్తున్నారు. వేసవిలో ఆకురాల్చే సమయం కావడంతో అడవుల్లో సహాజ సిద్ధంగా పెరిగే వృక్షాల నుంచి వివిధ ఉత్పత్తులు లభిస్తాయి. వీటిని సేకరించి.. శుద్ధి చేసి స్థానికులు వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. అడవిలో దొరికే ఇప్పపువ్వు, మొర్రిపండ్లు, తాప్సిబంక, నల్ల జీడిగింజలు, లక్క, కుంకుడు కాయల సేకరణ పనుల్లో గిరిజనులు, చెంచులు, మైదాన ప్రాంతాలకు చెందిన యువకులు నిమగ్నమయ్యారు. అడవుల్లో సహజంగా లభించే ఉత్పత్తులను సేకరించే పనుల్లో వీరు నిమగ్నమయ్యారు. అటవీ ఉత్పత్తులను సేకరించి ఉపాధి పొందుతున్నారు. తెల్లవారుజామునే లేచి పిల్లలు, పెద్దలు అడవిలోకి పోయి సహజంగా దొరికే ఉత్పత్తులను సేకరిస్తున్నారు. అడవుల్లో ఇప్పపువ్వు పుష్కలంగా లభిస్తుంది. అటవీ ఉత్పత్తులకు బహిరంగ మార్కెట్‌లో మద్దతు ధర లభిస్తుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తునికాకుపై ఉపాధి ప్రభావం…

వేసవిలో అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా నిర్వహించే తునికాకు సేకరణ ఈ సారి మందగించింది. దశాబ్దాలుగా తునికాకు సేకరణ అడవుల్లోకి వెళ్లేందుకు సమీప ప్రాంతాల గిరిజనులు, స్థానికులు ముందుకొచ్చేవారు. తునికాకు సేకరణకు అడవుల్లోకి వెళ్లడం.. కొంత శ్రమతో ఉండడంతో ఇటీవల చేపట్టిన సేకరణకు స్థానికులు విముక్త చూపుతున్నారు. ఇందుకు మరో కారణంగా.. గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటున్న స్థానికులు.. తునికాకు సేకరణకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. దీనికి తోడు సమీప రాష్ట్రాల్లో తునికాకు లభిస్తున్న ధర చెల్లింపు.. ఇక్కడ లభించడం లేదన్నది మరో కారణం. తునికాకు సేకరించిన వారికి అందజేసే మొత్తాన్ని నెలల తరబడి చెల్లించక పోవడంతో.. గిరిజనులు ఉపాధి హామీ పనులకు ఆసక్తి చూపుతున్నారు.

పులుల గణనపై తర్ఫీదు..

రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పులుల గణనకు క్షేత్రస్థాయిలో కార్యచరణ చేపట్టారు. ఈ నెల 4వ తేదీ నుంచి అఖిల భారత పులుల గణన జరుగుతోంది. నెల రోజుల పాటు నిర్వహించే ఈ గణనకు వివిధ జిల్లాల ఆటవీశాఖ అధికారులు, సిబ్బందికి పులుల గణన, సిసి కెమెరాల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పులుల గణనలో ఎలాంటి నిర్లక్ష్యం చూపొద్దని సిబ్బందికి అవగాహన కార్యక్రమాల్లో సూచించారు. ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించి నిర్ధారణకు రావాలన్నారు. పులుల గణనకు అడవిలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను క్రమం తప్పకుండా పరిశీలించాలని సిబ్బందిని ఆదేశించారు. అడవుల్లో ఏర్పాటు చేసిన కెమెరాలు చోరీకి గురికాకుండా దృష్టి సారించాలన్నారు. పులులు మాత్రమే| కాకుండా ఇతర జంతువుల గణన కూడా చేపట్టాలన్నారు. పులులు ఉన్నట్లు ఎక్కడైనా నమోదైతే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. సిసి కెమెరాల్లో చిక్కిన పులి ఆడదో. మగదో పరిశీలించాలన్నారు. అడవిలో ఎన్ని పులులు ఉన్నాయో కెమెరా ఫుటేజీల ద్వారా నిర్ధారించాలని పేర్కొన్నారు. ఫీల్డు డైరెక్షన్ ఆఫ్ ప్రాజెక్టు టైగర్ బృందం సభ్యులు పలు సూచనలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News