Friday, May 3, 2024

సిఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటీ

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలతో పాటు అభివృద్ధి పనులకు,
అవసరమైన నిధుల సమీకరణకు చేపట్టాల్సిన విధానాలపై సూచనలు
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఆదివారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన సమావేశం అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై వారిద్దరూ చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు సిఎం రేవంత్‌కు ఆర్బీఐ మాజీ గవర్నర్ పలు సూచనలు చేశారు. కేంద్రం, ఆర్బీఐ, బ్యాంకులతో ప్రభుత్వ ఆర్థిక సంబంధాలు, అప్పుల విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై వారిద్దరూ చర్చించారు.

ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలతో పాటు అభివృద్ధి పనులకు, అవసరమైన నిధుల సమీకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవలంభించాల్సిన విధానాల గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ సిఎం రేవంత్‌కు సూచించినట్టుగా తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురాం రాజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నట్టుగా సమాచారం.

వరుసగా సమీక్షలు, సమావేశాలు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది, కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలోనే ఓ వైపు ఆర్థికపరమైన ఇబ్బందులు, మరోవైపు రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు, సహచర మంత్రులతో భేటీ అయి సమాలోచనలు చేస్తున్నారు. శాఖల వారీగా వివిధ అంశాలపై రేవంత్‌రెడ్డి అధికారులతో చర్చిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, రాష్ట్ర అభివృద్ధిపై సిఎం రేవంత్ కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా ఇందుకు అవసరమైన నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిఎం రేవంత్‌రెడ్డి ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, సిఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News