Friday, May 3, 2024

కర్నాటకలో నలుగురు హైదరాబాదీ యువకులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Four Hyderabadi killed in Karnataka

చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత

మనతెలంగాణ/హైదరాబాద్ : కర్ణాటకలోని బీదర్ జిల్లా గోడవాడి గ్రామ చెరువులో ఆదివారం నాడు ఈతకు వెళ్లి హైదరాబాద్ నగరానికి చెందిన నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే…నగరంలోని బోరబండకు చెందిన ఓ కుటుంబం బీదర్ జిల్లా గోడవాడి గ్రామంలోని హజ్రత్ ఇస్మాయిల్ షా ఖాద్రి దర్గాను దర్శించుకునేందుకు వెళ్లారు. హజ్రత్ ఇస్మాయిల్ షా ఖాద్రి దర్గాను దర్శించుకున్న అనంతరం సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లిన సయ్యద్ అక్బర్ సయ్యద్ ఉస్మాన్(17), మహమ్మద్ జునైద్ ఖాన్(19), మహమ్మద్ ఫదాఖాన్ సలీంఖాన్(18), సయ్యద్ జునైద్ సయ్యద్ ఖలీద్(15)యువకులు జలసమాధి అయ్యారు.

వారిలో నలుగురు యువకులు దగ్గరలోని చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన క్రమంలో లోతు సరిగా అంచనా వేయలేకపోయారు. వారిలో ఒకరు నీటిలో మునిగిపోగా అతన్ని కాపాడేందుకు ముగ్గురు యత్నించారు. వారికి ఈత రాకపోవడంతో మృత్యువాత పడ్డారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అత్యవసర సేవల సిబ్బంది సాయంతో నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనతో బోరబండ వాసులు విషాదంలో మునిగిపోయారు.

గోదావరిలో ఇద్దరి గల్లంతు 

నిజామాబాద్ జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. ఈత సరదా నిండు ప్రాణాలను బలితీసుకుంది. గత పది రోజులుగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా, ప్రమాదకరంగా పారుతున్న నదిలో ఆదివారం మధ్యాహ్నం నందిపేట మండలం ఉమ్మెడ గోదావరి వంతెన వద్ద నదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అందులో ఒకరిని స్థానికులు కాపాడి ఒడ్డుకు చేర్చారు.గల్లంతైన వారు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన హీరా రామ్, కేతు రామ్‌గా గుర్తించారు. వీరు గత కొన్ని ఏండ్ల క్రితమే నందిపేటకు వచ్చి స్థిరపడ్డారు. తినుబండారాల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బోడకొండ జలపాతంలో ఇంకొకరు 

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బోడకొండ జలపాతం వద్ద చెక్‌డ్యామ్‌లో పడి యువకుడు మృతి చెందాడు. మృతుడు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన బుర్ర సాయివంశీ(24)గా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై మంచాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతంరం పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు పడిపోయాడా, మరేమైనా కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News