Saturday, May 4, 2024

టిఎస్‌పిఎస్‌సి లీకేజీ కేసులో మరో నలుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా, టిఎస్‌పిఎస్‌సి ఎఇఇ పేపర్ కూడా లీక్ కావడంతో ఈ కేసులో సిట్ మరో నలుగురిని అరెస్టు చేసింది. ఈ నలుగురు ప్రధాన నిందితుడు ప్రవీణ్ దగ్గర ఎఇఇ పేపర్‌ను కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది. వీరితో కలిపి పేపర్ లీక్ కేసులో మొత్తం అరెస్ట్‌ల సంఖ్య 27కి చేరింది. ఈ నలుగురు నిందితులు కూడా ప్రవీణ్, డాక్యా నుంచి ప్రశ్నాపత్రాలు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్‌లను రెండు సార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి పెద్దగా వివరాలు వెల్లడించలేదు.

దీంతో సిట్ అధికారులు సాంకేతికతను ఆధారంగా చేసుకొని దర్యాప్తు నిర్వహించారు. బ్యాంకు ఖాతాలను పరిశీలించడంతో పాటు, నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు. అనుమానాస్పద లావాదేవీతో పాటు గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు నిందితులు చేసిన ఫోన్ కాల్స్‌ను పరిశీలించారు. ఇందులో భాగంగా అనుమానాస్పద ఫోన్ కాల్స్ వివరాలు సేకరించి దర్యాప్తు చేశారు. సదరు వ్యక్తులను పిలిచి ప్రశ్నించడంతో అసలు విషయాలు బయటికి వస్తున్నాయి. ఇలా ఇప్పటి వరకు పోలీసులు డివిజినల్ అకౌంట్స్ అధికారి ప్రశ్నాపత్రం లీకైనట్లు తేల్చారు.
ఏఈఈ ప్రశ్నాపత్రం సైతం మురళీధర్ రెడ్డి, మనోజ్‌లు కొనుగోలు చేసినట్లు కాల్ డేటా, బ్యాంకు లావాదేవీల ద్వారా గుర్తించారు. మంగళవారం అరెస్ట్ చేసిన నలుగురు సైతం ప్రశ్నాపత్రాల కోసం ప్రవీణ్, డాక్యానాయక్‌లకు డబ్బులు చెల్లించినట్లు సిట్ అధికారులు తేల్చారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. సరైన ఆధారాలు లభిస్తే వాళ్లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

గ్రూప్ 1 పేపర్ తో పాటు అసిస్టెంట్ ఇంజినీర్ ఏఈ పేపర్ లీకైందని తేలగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏఈఈ ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు సిట్ టీమ్ సోమవారం తెలిపింది. ఈ కేసులో న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ మినహా మిగిలిన వారిని ఒక్కక్కరిగా సిట్ టీమ్ అరెస్ట్ చేస్తోంది. కేసు వివరాలు పరిశీలిస్తే… ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కుమార్‌కు 16 లక్షలు రూపాయలు అందాయి. అతను ఎఇ పేపర్‌ను రేణుకా రాథోడ్‌కు అమ్మాడు. సోదరుడు రాజేశ్వర్ కోసం దీన్ని కొనుగోలు చేసింది. తర్వాత రాజేశ్వర్, డాక్యా నాయక్ కలిసి ఆ పేపర్‌ను మరో ఐదుగురికి బేరం పెట్టారు. ఈ ఐదుగురిలో నిలేశ్ నాయక్ 4.95 లక్షలు, గోపాల్ నాయక్ 8 లక్షలు, ప్రశాంత్ రెడ్డి 7.5 లక్షలు, రాజేంద్రకుమార్ 5 లక్షలు, వెంకట జనార్దన్ 1.95 లక్షలు ఇలా 27.4 లక్షలు ముట్టజెప్పారు.

ఇందులో పది లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చారు. డిఎవో పేపర్‌ను ఖమ్మంలో ఉంటున్న సాయిలౌకిక్, సాయిసుస్మితకు ఆరు లక్షలకు అమ్మాడు ప్రవీణ్. దీంతో రెండు పేపర్లు అమ్మినందుకు ప్రవీణ్‌కు 16 లక్షలు వచ్చాయి. డాక్యానాయక్, రాజేశ్వర్‌కు 17.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు. వచ్చిన డబ్బులతో రాజేశ్వర్ కొన్ని కాంట్రాక్ట్ పనులు చేశాడని సిట్ అధికారులు కోర్టుకు తెలియజేశారు. మన్సూర్‌పల్లి తండాలో వీధిలైట్లు ఫిట్ చేయడం, డ్రైనేజీ పనులు పూర్తి చేశాడు. 4.5 లక్షలతో అప్పులు తీర్చాడు. మిగతా ఇద్దరు నిందితులు ప్రవీణ్, డాక్యా నాయక్ మాత్రం తమ అమౌంట్‌ను బ్యాంకులోనే ఉంచుకున్నారు. ప్రవీణ్ తన దగ్గర బంధువుకు అప్పుగా కొంత మొత్తాన్ని ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News