Saturday, October 12, 2024

తీరు మారని అధికారులు.. నమ్మి బాధ్యతలు అప్పచెబితే కోట్లలో స్వాహా

- Advertisement -
- Advertisement -

అసలు కమర్షియల్ ట్యాక్స్‌లో ఏమి జరుగుతోంది.? ఎవరికి దొరికినంత వారు దోచుకుంటున్నారా..? అంటే అవునన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ రిజ్వీ అధికారులను పరుగులు పెట్టిస్తారని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబడుతారన్న నమ్మకంతో ఆయన్ను ప్రభుత్వం ఈ శాఖలో నియమిస్తే, ఆయన నమ్మి బాధ్యతలు అప్పచెప్పిన అధికారులు మాత్రం అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంపై అధికారులను పరుగులు పెట్టిస్తున్నా అవినీతి అధికారులు మాత్రం ఉన్నతాధికారుల మాటలను పెడచెవి పెడుతూ అందినకాడికి దండుకోవడం విశేషం. గతంలో కమిషనర్‌గా పనిచేసిన శ్రీదేవి తప్పించి ఆమె స్థానంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహారిస్తున్న రిజ్వీకి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగిస్తే ఆయనకు తెలియకుండానే ఈ అవినీతి బాగోతం జరుగుతుందా అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారిందని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఇద్దరికి డబ్బులొచ్చే బాధ్యతలను అప్పచెప్పడంతో….
గతంలో శ్రీదేవి ఈ శాఖ కమిషనర్‌గా రాకముందు ముగ్గురు అదనపు కమిషనర్‌లపై అవినీతి ఆరోపణలు రావడం, వారిలో ఒకరిపై సోమేష్‌కుమార్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో ఆ ముగ్గురిని కీలక బాధ్యతల నుంచి కమిషనర్ శ్రీదేవి వారిని తప్పించి వారి స్థానాలను వేరే వారికి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే 9 నెలల కాలంలో ఆ శాఖకు ఆదాయం తగ్గడం, కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం,

వ్యాపారుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం లాంటి ఆరోపణలతో శ్రీదేవిని కమిషనర్‌గా ప్రభుత్వం తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రిజ్వీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టగానే గతంలో పక్కన బెట్టిన ముగ్గురు అదనపు కమిషనర్‌లలో ఇద్దరికి డబ్బులొచ్చే బాధ్యతలను అప్పచెప్పడంతో వారు తమ వసూళ్లను మళ్లీ మొదలుపెట్టినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News