Sunday, April 28, 2024

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రూ.31,105 కోట్లు

- Advertisement -
- Advertisement -

Funding from the Center to State is Rs 31105 crore

కేంద్రానికి రికార్డు స్థాయిలో రూ.5లక్షల కోట్ల అదనపు ఆదాయం
రాష్ట్రానికి మాత్రం మొండిచెయ్యి

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల పేరుతో ప్రజల నుంచి నిధులను వసూలు చేసుకొని రికార్డుస్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకొందని, ఈ నేపధ్యంలో ఇకనైనా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను ఇకనైనా విడుదల చేస్తారా? లేదా? అని ఉన్నతాధికారుల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2021-22వ ఆర్ధిక సంవత్సరానికి రూపొందించుకొన్న బడ్జెట్ పన్నుల రూపంలో 22.17 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసిందని, కానీ ఆర్ధిక సంవత్సరం ముగిసేనాటికి అంటే గత నెల మార్చి 31వ తేదీ నాటికి రికార్డుస్థాయిలో 27.07 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఇది అంచనాల కంటే ఏకంగా అయిదు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చిందని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖాధికారులు అధికారికంగా ప్రకటించడంతో రాష్ట్రంలోని ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు ఇకనైనా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు, నిధులను విడుదల చేస్తుందా? అనే ఆశాభావంతో చర్చింకుకొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా 31,105 కోట్ల 77 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉందని, అందుచేతనే ప్రస్తుతం కేంద్రం ఆర్ధికంగా పరిపుష్టితో ఉంది గనుకనే తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేస్తారా? లేదా? అనే చర్చించుకొంటున్నామని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి 2020-21వ ఆర్ధిక సంవత్సరంలో 20.27 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఒక్క ఏడాది కాలంలోనే కరోనా లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్నప్పటికీ 2022 మార్చి నెలాఖరుకు ఏకంగా 27.07 లక్షల కోట్ల రూపాయల ఆదాయం రావడమంటే ఆషామాషీ విషయం కాదని, ఈ ఒరవడి చూస్తుంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరమైన 2022-23 ముగిసే నాటికి కేంద్ర ప్రభుత్వ పన్నుల ఆదాయం 32 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తంచేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల వసూళ్ళల్లో ఏకంగా 49 శాతం పెరుగుదలతో 14.10 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, పరోక్ష పన్నుల వసూళ్ళల్లో 30 శాతం పెరుగుదల నమోదయ్యిందని, దీంతో 12.90 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ ప్రకటించడంతో తమకు కాస్త ఆశలు రేకెత్తాయని వివరించారు. పన్నుల ఆదాయంలో ఇంకా పెరుగుదల నమోదు కావాల్సి ఉందని, పన్నుల రూపనంలో ఆదాయాన్ని చూపిస్తే రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుందనే నెపంతోనే సెస్, సర్‌చార్జీల పేరుతో ఆదాయాన్ని సమకూర్చుకొంటున్న కేంద్రం రాష్ట్రాలను బురిడీ కొట్టిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సెస్, సర్‌చార్జీల నిధులను కూడా పన్నుల ఆదాయంలో కలిపితే కనీసం మరో 2.50 లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం కేంద్ర ఖజానాకు వచ్చి ఉండేదని ఆ అధికారులు వివరించారు.

ఇకనైనా కేంద్రం ఎలాంటి భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇకనైనా న్యాయం చేస్తుందేమోనని ఆశలు చికుగురించాయని ఆ అధికారులు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం న్యాయంగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు, బకాయిలు అన్నీ కలిపి సుమారు 31,105 కోట్ల 77 లక్షల రూపాయల వరకూ ఉన్నాయని, ఈ నిధులను ఇకనైనా విడుదల చేయాలని కోరుతూ మరోసారి లేఖ రాసే ప్రతిపాదన ఉందని ఆ అధికారులు వివరించారు. తెలంగాణలో ఫార్మాసిటీ, ఇతర పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి 14 వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందని, ఆ నిధులను కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదని అధికారులు తెలిపారు. మిషన్ కాకతీయ పథకాన్ని దేశం యావత్తూ కొనియాడిందని, చివరకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా మెచ్చుకొన్నారేగానీ ఆ పథకానికి ఇవ్వాల్సిన 5,205 కోట్ల రూపాయల నిధులను కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదు.

నీతి ఆయోగ్ సిఫారసులను అమలు చేయాలని, ఆ మేరకు నిధులను విడుదల చేయాలని కోరుతూ ఆర్ధికశాఖామంత్రి టి.హరీష్‌రావు కేంద్రాన్ని కోరుతూ లేఖలు కూడా రాశారు. మున్సిపాలిటీలు, నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, రవాణా రంగానికి 7,800 కోట్ల రూపాయల నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, ఆ నిధులను విడుదల చేయాలని మున్సిపల్ శాఖా మంత్రి కే.టి.ఆర్. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నాలుగు లేఖలు రాశారని ఆ అధికారులు గుర్తుచేశారు. అంతేగాక చేనేత, టెక్స్‌టైల్స్ పరిశ్రమల కోసం 954 కోట్ల 96 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉందని తెలిపారు. స్పెషల్ గ్రాంట్ కింద 723 కోట్లు, రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి చెందాల్సిన నిధులను కేంద్రం అవగాహనా రాహిత్యంతో ఆంధ్రప్రదేశ్‌కు మళ్ళించిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను కూడా ఇవ్వలేదని, ఇకనైనా విడుదల చేయాలని కోరుతున్నారు.

వీటికితోడు పెండింగ్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ జీ.ఎస్.టి. నిధులు 210 కోట్లను కేంద్రం తెలంగాణాకు ఇవ్వాల్సి ఉండగా ఆ నిధులను కూడా ఇవ్వకుండా సతాయించడం అన్యాయం కాదా అని ఆర్ధికశాఖ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. స్థానిక సంస్థలకు కూడా కేంద్రం నుంచి తెలంగాణకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులు రావాల్సి ఉందని, బీఆర్‌జీఎఫ్ బకాయిలు 900 కోట్లు ఉన్నాయని, ఇవన్నీ కలిపితే 31,105 కోట్ల 77 లక్షల రూపాయలుగా తేలిందని ఆ అధికారులు వివరించారు. కేంద్రం దగ్గర నిధులు లేనప్పుడు, కేంద్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వలేదంటే అర్ధం చేసుకోవచ్చుగానీ, ఇలా లక్షలాది కోట్ల రూపాయలు ఖజానాలో మూలుగుతున్నాయని, వాటిల్లో నుంచి తమ రాష్ట్రానికి రావాల్సిన నిధులను మాత్రమే అడుగుతున్నామని అంటున్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణకు అగ్రస్థానం ఉన్న సంగతి తెలిసి కూడా ఇలా వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వకుండా మొండికేస్తే ఎలా? అని ఆ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలే ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే 41 శాతం నిధులు కూడా తగ్గిపోయాయని, ఆ వాటా నిధులను కూడా పెంచాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా నిధులు పెరగాల్సిందిపోయి తగ్గిపోతున్నాయని ఆ అధికారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2022-23వ ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి కేవలం 23,165 కోట్ల రూపాయలు మాత్రమే పన్నుల వాటా నిధులు వస్తాయని, వాస్తవానికి కనీసం 30 వేల కోట్ల రూపాయల వరకూ రావాల్సి ఉందని అంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News