Saturday, April 27, 2024

తుస్సుమన్న జి-20 వ్యవసాయ సదస్సు !

- Advertisement -
- Advertisement -
మొక్కుబడిగా చర్చలు ..ఊకదంపుడు ప్రసంగాలు
ప్రధాని ప్రసంగంపై రైతుల పెదవి విరుపులు

హైదరాబాద్: పంటల సాగులో పెరిగిన పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునే సూచనలేవి కనిపించలేదు. ఆధునిక శాస్త్ర సాంకేతక రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపొంతుంటే దేశ వ్యవసాయరంగంలో కనీసం యాంత్రీకరణకు ఏవిధమైన ప్రోత్సహాకాలు ప్రకటించలేదు. కొత్తగా యాంత్రీకరణకు ప్రోత్సాహం మాట అటుంచి ఇప్పటికే వినియోగిస్తున్న యంత్ర పరికరాలకు వినిగించే డీజిల్ పెట్రోల్‌లో జిఎస్టీ పన్నుల బాదుడు నుంచి కొంతయిన ఉపశమనం కల్పించలేదు. 2020నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలు ..వాటి అమలుపై సమీక్షలు లేవు. అధికారంలోకి రాగానే డా.స్వామినాధన్ వ్యవసాయరంంపై ఇచ్చిన నివేదికను యథాతధంగా అమలు చేస్తామని రైతులుకు ఇచ్చిన హామీలకు దిక్కు దివానం లేదు. క్షేత్ర స్థాయిలో పంటలసాగుకు అవుతున్న పెట్టుబడి ఖర్చలు అంచనా వేసి పంటలకు కనీస మద్దతు ధరలు నిర్ణయించాలని ఏళ్ల తరబడి రైతులు చేస్తున్న విజ్ణప్తుల ఊసే లేదు.

పండించిన పంటను అంతర్జాతీయ మార్కెట్లో లాభసాటి ధరలకు విక్రయించుకునే దిశగా మెరుగైన విధానాలు వాటి ప్రతిపాదనల ముచ్చట లేదు. దేశ వ్యవసాయ రంగం ఎన్నో ఆశలు పెట్టుకున్న జి20 సదస్సు రైతులకు స్పష్టమైన విదానాలేవి సూచించకుండానే తుస్సుమందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ వేదికగా హెచ్‌ఐసిసిలో ఈ నెల 15నుంచి ప్రారంభమైన జి20 సదస్సు శనివారం ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ద్వారా దేశ రైతులకు జరిగే మేలేమిటన్న దాంట్లో స్పష్టత లేదు. జి20 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దేశీయ వ్యవసాయ రంగానికి ఈ సదస్సు ద్వారా ఏవిధమైన మేలు చేస్తారో చెప్పాలన్న రైతుల ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానాలు లేవంటున్నారు.

దేశ వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం విప్లవాత్మక మార్పులతో పురోగమిస్తోంది. ఏటా 262లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. ధాన్యంతోపాటు పప్పుధాన్య పంటల ఉత్పత్తిలోనూ అదే ఒరవడి కొసాగిస్తోంది. నూనెగింజ పంటల సాగులో ఆయిల్ పామ్‌తోటల సాగుకు కేరాఫ్‌గా నిలుస్తోంది. మొక్కజొన్న పంటలో కూడా ఏటా 28.8లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో నిలిచింది. ప్రధాన వాణిజ్య పంటల్లో ఏటా 58లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తితోజాతీయ స్థాయిలో గుజరాత్ , మహారాష్ట్ర తరువాత తెలంగాణ మూడవ రాష్ట్రంగా నిలిచి దేశీయ వస్త్ర పరిశ్రమకు ప్రధాన ముడి సరుకును అందించటమే కాకుండా అంతర్జాతీయ ఎగుమతులతో దేశ ఖజానాకు పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతోంది. ఏటా 10.04లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తితో జాతీయ స్ధాయిలో 5వ స్థానంలో నిలిచింది. 16,670మిలియన్ల గుడ్ల ఉత్పత్తితో మూడవ స్థానంలో నిలిచింది. ప్రతి ఏటా అకాల వర్షాలు వడగండ్ల వానలు , ప్రకృతి విపత్తులకు ఎదురొడ్డి వ్యవసాయం చేస్తున్న తెలంగాణ రైతులకు కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు సహాయ సహకారాలు కూడా అందించటం లేదన్న అభిప్రాయాలు ఇప్పటికే బలంగా నాటుకున్నాయి. కనీసం తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగొలు చేయటంలో కూడా భారత ఆహార సంస్థ చేతులెత్తేస్తోంది.

ఇటు వంటి పరిస్థితుల్లతో జి20 సదస్సు ద్వారా తమకు ఏదైనా మేలు జరుగుతుందని ఎదరు చూసిన రైతులకు నిరాశే మిగిలిందన్న విమర్శలు వస్తున్నాయి. పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రకృతి సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్న సాయం ఎంత అని ప్రశ్నిస్తున్నారు. రసాయనిక ఎరువులు , క్రిమిసంహారక మందుల ధరలు ఏటా రెండు మూడు సార్లు పెంచుతున్న కేంద్రం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలు మాత్రం ఆదే రీతిలో పెంచటం లేదు.

దేశం నలుమూలలా ప్రకృతి వ్యయసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పిన ప్రధాని ఆ రైతుల సంఖ్య ఎంత, విస్తీర్ణం ఎంత అన్నది చెప్పలేదు. కనీసం ఈ విధానంలో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించటంలో కూడా విధాన పరమైన నిర్ణయాలు ఇప్పటిదాక ప్రకటించలేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచేందకు అనుసరిస్తున్న విధానాలు కూడా రైతులను ఆకట్టుకునే రీతిలో లేవు. సాయిల్ హెల్త్ కార్డులు దేశంలో ఎంత మంది రైతులకు ఇచ్చారో , అవి వినియోగంలో ఉన్నది ఎంతో కూడా తెలియని స్థితిలో ఉంది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం అంటూ ఎంతో అట్టహాసంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం చిరుధాన్య పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించాలని దేశవ్యాప్తంగా రైతుల పదే పదే విజ్ణప్తి చేసినా ఇంతవరకూ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదంటున్నారు. జి20 సదస్సులకు మీడియాలోనూ సరైన ప్రచారం లభించలేదు. ఆదిశగా వాటి నిర్వాహకులు కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. రవికిరణాలు సోకని చీకటి సదస్సుల వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవని రైతులు , రైతు సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News