Sunday, April 28, 2024

ఆస్తుల నమోదులో గజ్వేల్ ఫస్ట్

- Advertisement -
- Advertisement -

Gajwel First place in Asset Registration

 

100 శాతం పూర్తయిన తొలి మున్సిపాలిటీగా ఘనత
రాష్ట్రవ్యాప్తంగా 60% ఆస్తుల వివరాలు నమోదు

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్తుల సర్వే యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. రాష్ట్రంలోనే ఆస్తుల గణన పూర్తయిన తొలి మున్సిపాలిటీగా గజ్వేల్ నిలిచింది. కలెక్టర్ వెంకట్రామరెడ్డి ప్రత్యేక కార్యాచరణ, మార్గదర్శనంలో గజ్వేల్ మున్సిపాలిటీకి అరుదైన ఘనత దక్కించుకుంది. జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు ఈనెల 9వ తేదీన ప్రాపర్టీ ఎన్యుమరేషన్ ప్రారంభించారు. 81 మందికిపైగా అధికారులు, స్బింది 27 బృందాలుగా ఏర్పడి బుధవారం వరకు ఆస్తుల నమోదు ప్రక్రియను వందశాతం పూర్తి చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 8700 ఆస్తులను ఐదు రోజుల్లో ముగించారు. రాష్ట్రంలోనే గజ్వేల్ మున్సిపాలిటీలో ప్రాపర్టీ ఎన్యుమరేషన్ పూర్తి చేసినందుకు కలెక్టర్ వెంకట్రామరెడ్డి స్థానిక, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.

వనపర్తి, మెదక్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, ములుగు ముందంజ

ఆస్తుల నమోదులో వనపర్తి, మెదక్, జోగులాంబ గద్వాల, ఖమ్మం, ములుగు జిల్లాలు ముందంజలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఒక్కో కార్యదర్శి సుమారు 70 ఆస్తులను నమోదు చేయాలని అధికారులు ఆదేశించడంతో ఆ దిశగా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లలతో పాటు కలెక్టర్లు సర్వేకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒక్కో ఆస్తికి సంబంధించిన వివరాలను టిఎస్ న్యాప్‌లో పొందుపరచాలంటే 30 అంశాలను నింపాల్సి ఉంటుంది. అనంతరం సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్తుల నమోదులో ఆలస్యం జరుగుతోందని సిబ్బంది పేర్కొంటున్నారు. రోజుకు 70 ఆస్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయని రోజుకు 20 నుంచి 30 వరకు ఆస్తుల నమోదును చేయగలుగుతున్నామని సిబ్బంది వాపోతున్నారు.

గ్రామాల్లో సుమారుగా 34 లక్షలకు పైగా ఆస్తుల నమోదు

గ్రామాల్లో సుమారుగా 34 లక్షలకు పైగా ఆస్తులు నమోదయినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఆస్తుల నమోదు ప్రక్రియ జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో డబుల్ ఎంట్రీలు నమోదు కావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరు మీద మ్యుటేషన్ చేయించుకోకపోవడంతో చాలా గ్రామాల్లో డబుల్ ఎంట్రీలు నమోదవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ సమస్య వలన ధరణిలో ఆస్తుల వివరాలను నమోదు చేయడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు వాపోతున్నారు.

వారసత్వంగా వచ్చే ఆస్తుల వివరాల నమోదులో ఇబ్బందులు

ప్రస్తుతం ఎడిట్ ఆప్షన్లు లేకపోవడంతో ఇద్దరి పేరు మీద పాసుబుక్‌లు వచ్చే అవకాశం ఉందని పంచాయతీ సెక్రటరీలు పేర్కొంటున్నారు. దీంతోపాటు వారసత్వంగా వచ్చే ఆస్తుల వివరాలకు సంబంధించి నమోదు చేయడంలో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉండడంతో ఆ ఆస్తులను తమ పేరు మీద రాయాలని ఎవరికి వారే సిబ్బందిపై ఒత్తిడి తీసుకువస్తుండడంతో వాటి వివరాల నమోదులో అధికారులు వెనుకంజ వేస్తున్నారు.

ఎన్‌ఆర్‌ఐ ఆస్తుల వివరాలపై సందిగ్ధత

ప్రస్తుతం ఆస్తుల నమోదులో ఆధార్ తప్పనిసరి అయ్యింది. చాలామంది ఆధార్ నంబర్ ఇవ్వడానికి ఆస్తకి చూపడం లేదు. ఇదే కోవలో ఎన్‌ఆర్‌ఐల ఆస్తులు కూడా ఉన్నాయి. ఆస్తిపన్ను రికార్డులోని పేరు, ఆధార్ కార్డులోని పేరులో ఒక అక్షరం తేడా ఉన్నా ఆస్తుల నమోదులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈకేవైసి ప్రక్రియను పూర్తి చేయడం క్లిష్టంగా మారింది. చాలామంది ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డు లేకపోవడంతో వారి ఆస్తులు నమోదు కావడం లేదు. త్వరలో దీనిపై సిఎం కెసిఆర్ నిర్ణయం తీసు కోనున్నట్టుగా తెలిసింది.

రోజుకు 30 ఆస్తుల కన్నా ఎక్కువగా నమోదు చేస్తే…

ఆస్తుల నమోదుకు సంబంధించి ఒక్కో లావాదేవికి రూ.5ల నుంచి రూ.10ల వరకు ప్రభుత్వం చెల్లిస్తున్నా సిబ్బందిలో ఉత్సాహం కనిపించడం లేదు. రోజుకు 30 ఆస్తుల కన్నా ఎక్కువగా నమోదు చేస్తే రూ.10లు అదనపు ప్రోత్సాహం చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొన్నా, సిబ్బంది ఆ దిశగా కృషి చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఆస్తుల నమోదకు మరో 10 రోజులు గడువు పెంచినా సిబ్బంది పూర్తిస్థాయిలో తమ పనితీరును కనబర్చడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిఎస్ సోమేష్‌కుమార్ పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులను, సిబ్బందిపై వేటు వేసినా పూర్తి స్థాయిలో ఆస్తి నమోదు ప్రక్రియలో సిబ్బంది సరిగ్గా పాల్గొనడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ సిబ్బంది, మెప్మా ఉద్యోగలు

ఆస్తుల నమోదకు ప్రైవేటు సిబ్బందిని నియమించుకోవాలని జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో కొందరు జిహెచ్‌ఎంసి సిబ్బంది ఆస్తుల వివరాలను నమోదు చేయడానికి ప్రైవేటు వ్యక్తులను నియమించుకొని వారికి రూ.30 నుంచి రూ.35లు చెల్లిస్తున్నట్టుగా సమాచారం. తాజాగా జిల్లా కేంద్రాల్లో ఆస్తుల నమోదుకు జిల్లా కలెక్టరేట్ సిబ్బందితో పాటు మెప్మా ఉద్యోగులు, అంగన్‌వాడీ సిబ్బందిని సైతం ప్రభుత్వం రంగంలోకి దించింది.

ఐటి శాఖ లింకులో మరిన్ని సవరణలు

దీంతోపాటు పౌరులు ఎవరికి వారే తమ ఆస్తుల వివరాలను సొంతంగా నమోదు చేసుకోవడానికి http://ts.meeseva.telangana.gov.in/TSPortaleef/Userlnterface/CitizenevenueServicesMSSendOTP.aspx లింకును అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ లింకులో కొన్ని ఇబ్బందులు ఉన్న దృష్టా ఐటిశాఖ ఈ లింక్‌ను ఆపివేసింది. రెండురోజుల్లో మరిన్ని సవరణలో లింక్‌ను పునరుద్ధరిస్తామని ఐటి శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆస్తుల వివరాలను నమోదు చేయడానికి జిహెచ్‌ఎంసి పరిధిలో 340 మంది బిల్‌కలెక్టర్లు, 170 మంది ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రైవేటు వ్యక్తులు మరో 300ల మంది ఇందులో పాల్గొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News