Saturday, May 4, 2024

ఆ ముగ్గురితో చాలా ప్రమాదం: రషీద్ ఖాన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్‌లో ఆ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లకు బౌలింగ్ చేయడం చాలా కష్టంతో కూడుకున్న విషయమని అఫ్గానిస్థాన్ బౌలింగ్ సంచలనం రషీద్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీన్ హార్డ్ హిట్టర్లు క్రిస్ గేల్, ఆండ్రీ రసెలతో పాటు భారత స్టార్ హార్దిక్ పాండ్యకు బౌలింగ్ చేయడంలో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని రషీద్ వివరించాడు. ఓ జర్నలిస్ట్‌తో ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న రషీద్ ఈ విషయం చెప్పాడు. ఐపిఎల్‌తో పాటు అంతర్జాతీయ ట్వంటీ20 క్రికెట్‌లో ఈ ముగ్గురికి బౌలింగ్ చేసిన ప్రతిసారి తాను ఇబ్బందులను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశాడు.

ముఖ్యంగా రసెల్, గేల్‌లను నిలువరించడం ఏమాత్రం తేలిక కాదన్నాడు. బంతి ఎలా వేసిన వారు కొట్టే ప్రతి షాట్ దాదాపు బౌండరీ చేరుకుంటుందన్నాడు. ఐపిఎల్‌లో గేల్, రసెల్‌లను కట్టడి చేసేందుకు తాను తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నాడు. ఐపిఎల్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరిగే పలు లీగ్‌లలో గేల్, రసెల్‌లు పాల్గొంటారని అక్కడ కూడా తనకు వీరి నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని రషీద్ గుర్తు చేశాడు. ఇక, హార్దిక్ కూడా వీరికి దీటుగా విధ్వంసక బ్యాటింగ్ చేస్తాడన్నాడు. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకు పడడంలో హార్దిక్ వీరికి ఏమాత్రం తీసి పోడన్నాడు. ఇక, కరోనా వల్ల ఐపిఎల్‌తో సహా పలు సిరీస్‌లు, టి20 లీగ్‌లు రద్దు కావడం తనను ఎంతో బాధకు గురి చేసిందన్నాడు. పరిస్థితులు మాములుగా మారి క్రికెట్ ఎప్పుడూ ప్రారంభమవుతుందా అని తాను ఎదురు చూస్తున్నట్టు రషీద్ వివరించాడు.

Gayle and Russell Toughest batsmen to bowl:Rashid khan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News