Sunday, April 28, 2024

హమ్మయ్య శాంతించింది

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి వద్ద తగ్గిన గోదావరి ఉధృతి
61.7 నుంచి 51.5 అడుగులకు

మూడో ప్రమాద హెచ్చరిక వాపస్
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు
రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
సాగర్‌కు కొనసాగుతున్న వరద
ఎల్లంపల్లి 8 గేట్లు ఎత్తివేత
కొమురంభీం ప్రాజెక్టులోకి వరద
మూడు రోజుల్లో మళ్లీ భారీ వర్షాలు
హైదరాబాద్ వాతవరణ కేంద్రం ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు నీటితో నిండిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తున్నా.. వర్షాలు తగ్గుముఖం పట్టడం వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు సుమారు 8 అడుగుల మేర తగ్గింది. వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నా రామయ్య సన్నిధి సమీపంలోని అన్నదాన సత్రం, కల్యాణకట్ట, స్నానఘట్టాల ప్రాంతం ఇంకా నీటిలోనే మునిగి ఉంది. సోమవారం సాయ్రంతం 6 గంటలకు 61.7 అడుగులు ఉన్న నీటిమట్టం.. నేటి మధ్యాహ్నానికి 54.4 అడుగలకు చేరింది. నీటి మట్టం 53 అడుగులకు తగ్గితే మూడో ప్రమాద హెచ్చరికను ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం భద్రాచలంలో పలు కాలనీల్లో నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎంసీ కాలనీ, అయ్యప్పకాలనీ, సుభాశ్‌నగర్ రామాలయం సెంటర్లలో ఉన్న ప్రజలకు పునరావాస కేంద్రాల్లోనే వసతి ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రికి భద్రాచలం వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని జలసంఘం హెచ్చరించినప్పటికీ వర్షాలు తగ్గుముఖం పట్టిన దరిమిలా భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమేపి తగ్గుతూ వస్తోంది. మరోవైపు రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత పెద్ద నగరమైన వరంగల్ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద ధాటికి రోడ్లన్నీ కోతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో మంత్రులు కెటిఆర్, ఈటల రాజేందర్ వరంగల్ నగరంలో పర్యటిస్తున్నారు. మొదట ఏరియల్ వ్యూ ద్వారా పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి వరద ముంపునకు గురైన నయీంనగర్, సమ్మయ్యనగర్, సంతోషిమాత నగర్, బొందివాగు, కరీ మాబాద్ బ్రిడ్జి దిగువ ప్రాంతం, ఇదులవాడ, పెద్దమ్మగడ్డ నాలా, ఎంజీఎం ఆసుపత్రి, శివనగర్ నాలా పరిసరాలను మంత్రులు సంద ర్శించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంత వాసులకు అధైర్యపడొద్దు.. మేము అండగా ఉంటామని మంత్రులు హామీనిచ్చారు. ఇంకోవైపు వర్షాలు తగ్గినా వరంగల్ పట్టణంలో పరిస్థితులు కుదుటపడలేదు. ఇంకా వరంగల్ జలదిగ్భంధంలోనే ఉంది. కాగా, మరోమారు భారీ వర్ష సూచనతో ప్రజల్లో మళ్లీ ఆందోళనకు తెరదీసింది. ఇప్పటికే భారీ వర్షాలు కారణంతో వేల ఎకరాల్లో వరి, పత్తి, కంది పంటలకు నష్టం వాటిల్లింది. మళ్లీ వర్ష సూచన ఇటు ప్రజలను, అటు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సిఎం కెసిఆర్ ఆదేశాలతో వరంగల్ పట్టణంలో పర్యటించిన కెటిఆర్ వరంగల్‌లో నాలాలపై కట్టిన అక్రమ నిర్మాణాలను గుర్తించి తక్షణమే వాటిని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు వెనువెంటనే ఆ దిశగా చర్యలకు ఉపక్రమించారు.
జూరాల ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తివేత
కృష్ణానదికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువన ఉన్న ప్రాజెక్టులోకి వదులుతున్నారు. ఆల్మట్టి జలాశయానికి లక్షా 66 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 2 లక్షల 51 వేల 922 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1705 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1700 అడుగులుగా ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 106.52 టిఎంసీల నీటిని నిల్వ ఉంచారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 2 లక్షల 72 వేల 217 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 1615 అడుగులు కాగా.. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1607 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థం 37.64 టిఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 27.87 టీఎంసీలుగా ఉంది.
ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండిపోయిన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో వరదను నిల్వ చేసే అవకాశం లేక వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాల జలాశయానికి 3 లక్షల 45 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 1045 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి నిల్వ సామర్థం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.473 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. జూరాల జలాశయం నుంచి 39 గేట్లు తెరిచి 3 లక్షల 34 వేల 330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటి మట్ట క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 569.10 అడుగులకు చేరింది. గత నెలరోజుల నుంచి పరిశీలిస్తే ఇప్పటివరకు ప్రాజెక్టులో 40 అడుగుల మేర నీటిమట్టం పెరిగింది. సాగర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 254.31 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుదుత్పత్తి ద్వారా 40,259 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వారా 4,107 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ఇంకా 20 అడుగుల మేరకు నీరు చెరితే సాగర్ జలాశయం నిండు కుండలా మారనుంది.
నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తివేత
పెదపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి ప్రవాహం పెరగడంతో 8 గేట్లను 2 మీటర్లు ఎత్తి 82,488 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలకు చేస్తున్నారు. ప్రాజెక్టులోని 37 నుంచి 44 గేట్ల ద్వారా నీటి ప్రవాహం గోదావరి నదిలోకి వెళుతోంది. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. 147.59 మీటర్లకు చేరుకుంది. జలాశయం సామర్థం 20 టిఎంసీలకు గానూ.. 19.0362 టీఎంసీల నిల్వ ఉంది. ప్రస్తుతం 67,161 క్యూసెక్కుల నీరు చేరుతోంది. గేట్లు ఎత్తడం వల్ల లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ.. అక్కడి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం పెరగడం వల్ల ప్రాజెక్టు వద్దకు ప్రజలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉద్ధృతి
భారీ వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు మొత్తం 4 గేట్లు రెండున్నర ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు 2,4,7,9వ నెంబర్ గేట్లను అధికారులు ఎత్తివేశారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థం 645 అడుగులు(4.46టిఎంసీలు) కాగా… ప్రస్తుత నీటిమట్టం 643.20 అడుగులకు (3.99టీఎంసీలు) చేరింది. అలాగే ఇన్‌ఫ్లో 7,410 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో 7,630 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది.
పార్వతి బ్యారేజీ 50 గేట్లు ఎత్తివేత
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటి ఉద్ధృతి పెరిగింది. ఎగువ నుంచి పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురంలోని పార్వతి బ్యారేజీకి 83,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సోమవారం బ్యారేజీలో 20 గేట్లను ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మంగళవారం పార్వతి బ్యారేజీలోనికి ఎగువ నుంచి వరద అధికమవ్వడం వల్ల నీటిపారుదల శాఖ అధికారులు 50 గేట్లు ఎత్తి వేశారు. అక్కణ్నుంచి 83,529 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపివేశారు. పార్వతి బ్యారేజీ పూర్తిసామర్థం 8.83 టిఎంసీలుండగా..ప్రస్తుతం 7.24 టిఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి నది ప్రవాహం ఉద్ధృతమవ్వడం వల్ల తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కొమురం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద చేరిక
జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కొమురం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేసి 3240 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 241.500 మీటర్లుగా ఉంది. అలాగే ఇన్‌ఫ్లో 3240 క్యూసెక్కులుగా నమోదు అయింది.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 61,390 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 800 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు(90 టింఎసీలు), కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1080.10 అడుగులకు(52 టీఎంసీలు) చేరింది.
అలుగుపారుతున్న సింగీతం ప్రాజెక్టు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని సింగీతం ప్రాజెక్టు అలుగుపారుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 416.550 మీటర్లు చేరుకోవడం వల్ల గేట్ల ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాల్వలోకి వదిలారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం వల్ల అలుగు ద్వారా 500 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతంలోకి వెళుతున్నాయి.
స్థానికుల సాయంతో వాగులో చిక్కుకున్న రైతులను కాపాడిన పోలీసులు
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం, మోదులగడ్డ తండాలో ఆకేరు వాగు ప్రవహిస్తోంది. వాగు ఉద్ధృతిలో చిక్కుకున్న ఇద్దరు రైతులను స్థానికుల సహకారంతో పోలీసులు కాపాడారు. రెండు గంటల పాటు శ్రమించి తాళ్ల సాయంతో బాధితులను రక్షించారు. ఆకేరు వాగు ఉన్న వ్యవసాయ భూముల వద్ద విద్యుత్ మోటారు పనిచేయలేదు. అయితే మరమ్మత్తులు చేసేందుకు వెళ్లిన ఇద్దరు రైతులు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయారు. వాగు మధ్యలో ఉన్న చెట్టును పట్టుకుని 3 గంటల పాటు అలాగే ఉండి తమను రక్షించాలంటూ కేకలు వేశారు. వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాగు వద్దకు వచ్చిన పోలీసులు బాధితులను కాపాడారు.
చేపలకోసం చెరువులోకి వెళ్లి మత్సకారుడు గల్లంతు
చేపలను పట్టేందుకు వెళ్లిన ఓ మత్స కార్మికుడు ఆ చెరువులోనే గల్లంతైన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన నేదురి రవి అనే వ్యక్తి నాయిని చెరువులోకి చేపలను పట్టేందుకు వెళ్లాడు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులో భారీగా నీరు చేరింది. చేపలు పట్టేందుకు రవి చెరువులోకి దిగగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న తోటి మత్స కార్మికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న సిఐ సృజన్‌రెడ్డి, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పల్లె ప్రగతి ట్రాక్టర్‌పై వెళ్లి
క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన సంగారెడ్డి కలెక్టర్
గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాలినడకన కష్టంగా మారగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ట్రాక్టర్‌పై వెళ్లి అభివృద్ధి పనులు పరిశీలించారు. మునిపల్లి మండలం పిల్లోడి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణం వాగు పరిసరాల్లో చేపట్టడం వల్ల దారి బురదగా మారింది. నడవడానికి వీలులేక కలెక్టర్ పల్లె ప్రగతి ట్రాక్టర్‌పై వెళ్లి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం విధించిన గడువు ముగిసినప్పటికీ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల సర్పంచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా చెత్త నుంచి ఎరువుల తయారీ షెడ్లు పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పర్యవేక్షిస్తూ ఎండిన మొక్కల చోట కొత్తవి నాటాలని ఆదేశించారు.
జూరాల ఎడమకాల్వ చివరి ఆయుకట్టు స్థిరీకరణకు అనుమతులు
జూరాల ఎడమ కాల్వ చివరి ఆయుకట్టు స్థిరీకరణకు అనుమతులు మంజూరయ్యాయి. బీమా 16వ ప్యాకేజీలో భాగంగా చేపట్టనున్నారు. సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె అనుసంధానానికి రూ.147.10 కోట్ల వ్యయంతో లింక్ కాల్వ నిర్మాణానికి అనుమతులు లభించాయి. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
భారీ వర్ష సూచన
రాగల మూడు రోజులు తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాంతలో బుధవారం నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం 24 గంటల్లో ఇంకా బలపడి పశ్చిమ దిశగా ప్రయాణించొచ్చని అన్నారు. దీనివల్ల రాగల మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ పట్టణం, వరంగల్ గ్రామీణ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గురువారం ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కోయిల్ సాగర్‌కు పెరిగిన సందర్శకుల తాకిడి
రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో ఉన్న కోయిల్ సాగర్ డ్యామ్ గేట్లు ఇటీవలే తెరిచారు. దీంతో అక్కడ సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. కోవిడ్19 పరిస్థితులు, తీవ్రస్థాయిలో ఉన్న వర్షాల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరుగకుండా సందర్శకులను కట్టడి చేసేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్.పి. రమారాజేశ్వరి ఆదేశాలతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని వాగులు, ప్రవాహాలు ఇతర ప్రమాదకర ప్రదేశాలలో పోలీసు శాఖ గట్టి నిఘా పెట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో కోయిల్ సాగర్ కూడా ఒకటి కావడంతో పర్యాటకులు తరలివస్తున్నారు. కోయిల్ సాగర్ వద్ద ఉన్న కోయిల్ కొండ వద్ద గుడిలో కొలువై ఉన్న వీరభద్రుని గుడికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ కోయిల్ సాగర్ గ్రామస్థులు వేడుకలు నిర్వహిస్తుంటారు.

Godavari water level decreases at Bhadrachalam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News