Wednesday, May 1, 2024

ఎంజిఎంలో కొవిడ్ వార్డు సందర్శన

- Advertisement -
- Advertisement -

 పిపిఇ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు పలకరింపు, గాంధీ తరహాలో ఎంజిఎం
 750కి ఆక్సిజన్ బెడ్లను పెంచుతాం
 వరంగల్‌కు ప్రత్యేకంగా మొబైల్ ల్యాబ్స్
 150 పడకలతో త్వరలో కెఎంసి పరిధిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు : మంత్రులు ఈటల, కెటిఆర్

Ministers Team visits Warangal MGM Hospital

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి తరహాలోనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని తీర్చిదిద్దుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్ తెలిపారు. మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి ఎంజిఎం సందర్భించిన అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు, ఎక్కడికక్కడే ప్రభుత్వం పక్షాన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వరంగల్ ఎంజిఎంలో ప్రస్తుతం కరోనా సోకిన వారి కోసం ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 340 బెడ్లు సిద్ధంగా ఉన్నాయని, కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్యను 750కు పెంచుతామని ఈటల ప్రకటించారు. అవసరమైన టెస్ట్ కిట్లు, మందులు, పరికరాలు, వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.

వరంగల్ నగరానికి ప్రత్యేకంగా మోబైల్ ల్యాబ్స్ పంపించనున్నట్లు ఈటల ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధానికి, వైరస్ సోకిన వారికి మెరుగైన వైద్య అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరమైన వరంగల్ పై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. ఎంజిఎంలో ప్రత్యేక వార్డు పెట్టామని, అలాగే కెఎంసిలో మరో వార్డు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎంత మంది రోగులొచ్చినా హైదరాబాద్ కానీ, ప్రైవేటు ఆసుపత్రులకు కానీ పోవాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి ఈటల వెల్లడించారు. కరోనా సోకిన వారిలో 81 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్నారు. మిగతా వారిలో కూడా ఎక్కువ శాతం మంది కోలుకుంటున్నారని తెలిపారు. మరణాల సంఖ్య ఒకశాతం లోపే ఉందని. కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకిన వారు ధైర్యంగా ఉండడమే అసలు మందు అని అన్నారు. వైరస్ సోకిన వారు ఆసుపత్రిలో ఉన్నా, హోమ్ ఐసోలేషన్ లో ఉన్నా వైద్యులు ఎప్పటికప్పుడు రోగుల పరిస్థితిని పరిశీలిస్తున్నారని మంత్రి ఈటల తెలిపారు. అవరసమైన మందులు, సూచనలు అందిస్తున్నారని పేర్కొన్నారు. వైరస్ సోకిన ప్రతి ఒక్కరికి ఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నామన్నారు. బంధువులు ముందుకు రాకపోతే ప్రభుత్వ పరంగానే ఐసోలేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఎవరైనా కోవిడ్ వల్ల చనిపోతే, వారి బంధువులు రాకుంటే ప్రభుత్వ పరంగానే అంత్యక్రియలు కూడా చేస్తున్నామని ఈటల వెల్లడించారు.

కరోనాతో పాటు, సీజనల్ అంటు వ్యాధులపై దృష్టి పెట్టాలి..
కరోనా విషయంలో శ్రద్ధ పెడుతూనే సీజనల్, అంటు వ్యాధులపై కూడా దృష్టి పెట్టాలని మంత్రి ఈటల సూచించారు. వానలు, వరదలు వచ్చినందున జ్వరాలు, ఇతర రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్య పనులు నిర్వహించాలన్నారు. పరిశుభ్ర వాతావరణం వల్ల చాలా వరకు అంటు రోగాలను, సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చునని పేర్కొన్నారు. కరోనా పేషంట్లకు తోడుగా వారి అటెండెంట్లను వార్డుల్లోకి ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించవద్దు అని మంత్రి ఈటల స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. కరోనా పేషంట్లను కలిపి ఉంచవద్దన్నారు. వైద్య సిబ్బందికి అవసరమైనన్ని పిపిఇ కిట్లు ఉన్నాయన్నారు. వాటిని ఉపయోగించుకోవాలన్నారు. వైద్యుల ఆరోగ్యం, భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని, ఆసుపత్రుల్లో బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ… విసర్జన మరింత మెరుగ్గా జరగాలని ఈటల సూచించారు. 150 పడకలతో ఆస్పత్రి సేవలు కొనసాగుతాయని, త్వరలోనే కెఎంసి పరిధిలోని పిఎం ఎస్‌ఎస్‌వై ఆస్పత్రిని ప్రారంభించబోతున్నట్లు మంత్రి కెటిఆర్ ప్రకటించారు. కోవిడ్ బాధితులకు కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్లు, మందులు, పిపిఈ కిట్లు, మాస్క్‌లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుతామని, బాధితులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు.

Ministers Team visits Warangal MGM Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News